Monday, May 13, 2024

పేదలకు వరం గృహలక్ష్మీ పథకం

తప్పక చదవండి
  • రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

శామీర్‌పేట : గృహలక్ష్మీ పథకం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మేడ్చల్‌ నియోజకవర్గానికి చెందిన 1200 మందికి గృహలక్ష్మీ పథకం రూ.3 లక్షల ఉత్తర్వుల కాపీలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఇళ్ళు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అనే మాటను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నీ తానై ఇంటిని కట్టించడానికి అవసరమైన డబ్బులు అందచేయడంతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం ద్వారా పెళ్ళికి అవసరమైన డబ్బులను అందచేసి మేనమామలా అన్నీ తానూ చూసుకుంటున్నారని అలాంటి ముఖ్యమంత్రి ఉండటం అందరి అదృష్టమని అన్నారు. దీంతో పాటు వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, దివ్యాంగులకు రూ.4,016 అందచేస్తూ రైతులకు ఎకరాకు సంవత్సరానికి పదివేలు చొప్పున రైతుబంధు పంట పెట్టుబడికి అందచేయడం జరుగుతుందని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంట్ను ఇరవై నాలుగు గంటల పాటు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. రాష్ట్రంలో గురుకులాల్లో ఇంగ్లీష్‌ మీడియం చదివే విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేయడం జరుగుతోందని దీనికై ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1.25 లక్షలు ఖర్చు పెట్టి మంచి చదువులు చెప్పించడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అలాగే బతుకమ్మ పండగకు ఆడపడుచులకు చీరలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.3 లక్షలు జమ అవుతాయని వీటిని ఇంటి నిర్మాణానికి సక్రమంగా వినియోగించుకోవాలని మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, విజయేందర్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు