Friday, April 26, 2024

జీఓ నెం.111.. కళ్ళు చెదిరే స్కాం..

తప్పక చదవండి
పేరుకే రియల్ ఎస్టేట్ దందా లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం..
  • బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు…
  • కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి..
  • ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి, లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం..
  • రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పొందం చేసుకున్నాయి..
  • రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక..

హైదరాబాద్ : జీవో నెం 111 రద్దుపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఎన్నికల ముందే జనం గుర్తుకువస్తారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. పపోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపలేదని.. ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నేతలు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆఫీసులకు కారుచౌకగా భూములను లీజ్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నావా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. కోకాపేట్ లో హెచ్ఎండీఏ గజానికి లక్ష పది వేలకు అమ్ముతుంది. మరి గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. భూకేటాయింపును కేబినెట్ లో ఆమోదించుకుని ప్రజలకు తెలియకుండా దాచాలనుకుంటారా? అని నిలదీశారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్.. మీ పార్టీకి మాత్రం భూములెలా వచ్చాయి? అని అడిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాల పేరుతో కారు చౌకగా స్థలాలు కొట్టేసింది చాలదా? అని ధ్వజమెత్తారు. ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి మరి ఆమోదించుకున్నారు.. వాస్తవానికి ఓపెన్ మార్కెట్ లో కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కు కట్టబెట్టిన భూముల విలువ 1100 కోట్ల రూపాయలకు పైమాటేనని అన్నారు. ఈ భూమిని ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని, అయినప్పటికీ మీడియాకు మాత్రం ఈ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచి ప్రజల ఆస్తులను కొట్టేశారని అన్నారు..

సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లోకి తీసుకు పోతాం :
ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం అత్యంత కారు చౌకగా భూమిని కొట్టేసిన కేసీఆర్… ఆ భూములు చాలవని ‘‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్’’ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని కాజేయడం అమానుషం.. ట్రిపుల్ వన్ జీఓ ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ జీఓ పరిధిలోని పేదల వంద కారు చౌకగా ఎకరాల చొప్పున భూములను కొనుగోలు చేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు… ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసుకుని గజాల చొప్పున అమ్ముకుంటూ లక్షల కోట్ల రియల్ దందాకు తెరదీశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. బీజేపీ సోయం బాపూరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు పేదలు గుర్తుకొస్తారు.. ఎన్నికలైపోంగనే పేదల భూములను గుంజుకుంటున్నారు. పేదల స్థలాల్లోనే కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్లు, కాలేజీలు కడతామంటున్నరు. ధరణి పేరుతో ఎట్లా రైతులను మోసం చేస్తున్నారో.. బీఆర్ఎస్ నాయకులు ఎట్లా లాభపడ్డారో జగమెరిగిన సత్యమే అన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల పేరుతో గజానికి వంద రూపాయల చొప్పున ఒక్కో జిల్లాలో ఎకరానికి పైగా స్థలాలు తీసుకుంటూ 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అట్లాగే భూములమ్మి పైసలు దోచుకుంటున్నరు అని ఆరోపించారు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు అసలు విషయాన్ని మాత్రం దాచి వేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలోని 11 ఎకరాల విలువైన భూమిని ఇన్ స్టిట్యూట్ పేరుతో బీఆర్ఎస్ కు పార్టీకి ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనివిలువ రూ.40 కోట్లు మాత్రమే చెల్లించి ఆ భూమిని కొనేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీని కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టారు. కానీ ఈ విషయం మాత్రమ చెప్పలేదు. ఈ ఉత్తర్వులను రహస్యంగా ఉంచారు.

‘ఇదే కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని అమ్మడానికి హెచ్ఎండీఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయం పలు పత్రికల్లో వచ్చింది. కోకాపేటలో ఒక గజం విలువ ఒక లక్షా 10 వేల చొప్పున ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టింది. కానీ అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలానికి సంబంధించి ఒక్క గజానికి 7,500 రూపాయల చొప్పున మాత్రమే చెల్లించి కొనేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ స్థలం మార్కెట్ విలువ రూ.550 కోట్ల పైమాటే.. ఓపెన్ మార్కెట్ లో అక్కడ ఒక్క ఎకరానికి రూ.వంద కోట్ల విలువ చేస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 11 వందల కోట్లు.. మరి అంత తక్కువకు బీఆర్ఎస్ ఎట్లా కొంటది? ఎవడయ్య జాగీరనుకుంది? ప్రభుత్వ అమ్మే రేటుకు, పార్టీకి ఇచ్చే రేటు విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓపెన్ మార్కెట్ లో 11 వందల కోట్లు ఉంటే… 40 కోట్లే చెల్లించి కొంటారా?’ అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2008లో హైదరాబాద్ లోని బోయినిపల్లిలో 10 ఎకరాల పైగా స్థలాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టిందన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఆ పనిచేసింది. ఇంతకంటే దారుణం, మోసం ఇంకోటి లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానిక స్థలం లేదంటారు… జీతాలివ్వడానికి పైసల్లేవంటారు.. దోపిడీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయ్. ఇది భరించలేకే ఏలేటి, రామారావు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ దొంగలే . వారిద్దరూ కలిసి ఏ విధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారో దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతోంది. వాస్తవానికి ఆ రెండు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నారు. కలిసే దోచుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం. పేదలకు ఇండ్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? బీఆర్ఎస్ నేతలు దొడ్డిదారిన దోచుకోవడానికి భూములు ఎట్లా వస్తున్నాయో ఆ సంగతి తేలుస్తాం. వెంటనే ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు ఇవ్వాలి. వెంటనే సీఎం కేసీఆర్ ఈ భూ దందాను బంద్ చేయాలని బండి సంజయ్ సూచించారు.

ట్రిపుల్ వన్ జీఓ ఎత్తివేత లక్షల కోట్ల విలువైన మహా స్కాం. ఎంత దుర్మార్గమంటే… ఆ ప్రాంతంలోని పేదల దగ్గర అత్యంత తక్కువ ధరకు ఎకరాల చొప్పున కొని ఇప్పుడు ఈ జీఓను ఎత్తివేసి గజాల చొప్పున అమ్ముకుంటూ భూ దందా చేస్తున్నయ్. ఈ భూముల్లో 90 శాతం కేసీఆర్ కుటుంబానివి, బీఆర్ఎస్ కుటుంబానివే అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు