- నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం..
- ఈ నెల 28న ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం
- ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం
- రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్లు
న్యూ ఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నాయి. వీర్ సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంటును ప్రారంభించడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇటీవల ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వాధినేత మాత్రమేనని, పార్లమెంటును ఆయన ఎందుకు ప్రారంభించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ విషయంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రతిపక్ష నేతల డిమాండ్లకు గొంతు కలిపారు. ‘‘పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని మోదీ కాదు.. రాష్ట్రపతి’’ అని హిందీలో ట్వీట్ చేశారు. మే 28న పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని ఇటీవల లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. గత గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానిని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.