Sunday, May 19, 2024

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల్లో ఉద్వేగం

తప్పక చదవండి
  • రెస్క్యూ టీమ్‌ను అభినందించిన ప్రధాని మోడీ..
  • సొరంగంలో చిక్కుకున్న వారి ధైర్యం స్ఫూర్తిధాయకం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. 17 రోజుల పాటు పలు రకాలు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన అధికారులు మంగళవారం రాత్రి రాట్‌ డ్రిల్లింగ్‌ పద్దతితో కార్మికులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అర్థరాత్రి కార్మికులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులను బయటకు తీసిన వెంటనే, ప్రధాన మంత్రి సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కార్మికులను సురక్షితంగా, విజయవంతంగా బయటకు తీసుకు రావడానికి కృషి చేసిన రెస్క్యూ బృందాలను, వారు చేసిన ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, ఐక్యత, జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ’ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను ఒకటి చెప్పాలనుకుంటు న్నాను. మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరికి మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మన స్నేహితులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం ఆనందం కలిగించే విషయం. ఈ కష్ట సమయంలో కార్మికుల కుటుంబాలు చూపించిన సహనం, ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేమ. ఈ రెస్క్యూ ఆపరేషన్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి స్ఫూర్తికి నేను వందనం చేస్తున్నాను. వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం చూపారు. జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని అన్నారు. దాదాపు 17 రోజుల శ్రమ, కృషి ఫలించింది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం లో చిక్కుకున్న 41 మంది కార్మికులను అధికారులు మంగళవారం సురక్షితంగా కాపాడారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ లో కార్మికులను రక్షించేందుకు చేసిన పలు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయినా అలుపెరుగని ప్రయత్నం చేసిన ప్రభుత్వం మంగళవారం వారిని బయటకు తీసుకొచ్చింది. రాట్‌ హోల్‌ మైనింగ్‌ నిపుణులు రాత్రి 7 గంటలకు శిథిలాలను పూర్తిగా తొలగించడంతో కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. సహాయక బృందం స్టీల్‌ పైప్‌ ద్వారా ఒక్కొక్కరిని స్టెచ్రర్లపై బయటకు తీసుకువచ్చారు. ర్యాట్‌హోల్‌మైనింగ్‌ టెక్నిక్‌లో నిపుణుల బృందం సాయంతో రాత్రి 8 గంటల సమయమంలో తొలి కార్మికుడు సొరంగం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతన్ని ఒక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సొరంగం నుంచి బయటపడిన కార్మికుల్లో కొందరి మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మరికొందరు మొహాల్లో కృతజ్ఞత, ఇంకొందరిలో అలసిపోయిన భావాలు కనిపించాయి. సొరంగం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నప్పుడు వారిని ఉత్సాహ పరిచేలా అక్కడ ఉన్నవారు నినాదాలు చేశారు. బయటకు వచ్చిన వారిని చూసి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కార్మికులను ఆస్పత్రులకు తరలిస్తున్నప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు. తమ వారు సురక్షితంగా బయటపడడంతో కార్మికుల కుటుంబాలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రెస్క్యూ వార్త వెలువడడంతో చాలా మంది టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోయారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు