Thursday, May 16, 2024

పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది

తప్పక చదవండి
  • ఉదయం నుంచే పోలింగ్‌ సామాగ్రి అందచేత
  • పత్యేక వాహనాల్లో తరలివెళ్లిన సిబ్బంది
  • పలు కేంద్రాలను సందర్శించిన వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గురువారం పోలింగ్‌ జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ పక్రియను ఉదయం నుంచే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకోగా వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేసారు. సామాగ్రిని తీసుకుని సాయంత్రం లోగా సిబ్బంది తమతమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. దాదాపు 1.85 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. అందులో 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్‌లను, స్క్వాడ్‌లను నియమించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ రాష్ట్రంలోని అన్ని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించారు. మరోవైపు కలెక్టర్‌ అనుదీప్‌ హైదరాబాద్‌ పరిధిలోని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాగా, ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల పక్రియలో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం లలో పోలింగ్‌ పూర్తయ్యింది. గురువారంతో తెలంగాణలో కూడా పోలింగ్‌ ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెలువరించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు