Monday, April 29, 2024

జనసేనకు 9 సీట్లు

తప్పక చదవండి
  • బీజేపీ-జనసేన పొత్తు.. తేలిన సీట్ల లెక్కలు..
  • గ్రేటర్‌ సిటీలో కీలకమైన సీటు జనసేనకే..!
  • నేడు బీజేపీ మూడో జాబితా విడుదల..?

హైదరాబాద్‌ : పోటీ చేయకుండా ఉంటే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎన్నికలకు దూరంగా ఉంటే కేడర్‌ మనోస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంది జనసేన. ముందే 32 సీట్లు ప్రకటించింది. అయితే బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగటంతో తెలంగాణలో రెండుపార్టీల మధ్య పొత్తుకు రూట్‌ క్లియరైంది. కాకపోతే జనసేనకు బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుందన్నదే రెండుపార్టీల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌. జనసేన 20కి పైనే సీట్లు అడుగుతున్నా పదీ పదకొండుకే పరిమితమయ్యేలా ఉందట కమలం పార్టీ. తెలంగాణలో జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలిసింది. అయితే జనసేన సీట్లకు డిమాండ్‌ చేస్తుండటంతో.. మరో రెండు సీట్లు పెంచి 11దాకా ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం సిద్ధపడిరదంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ వంటి సీట్లని జనసేన కోరుకుంటోంది. అయితే వీటిలో కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీతో సరిహద్దులు పంచుకునే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తుదిజాబితాపై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢల్లీి చేరుకున్న కిషన్‌ రెడ్డి మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్‌ జవదేకర్‌, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజస్థాన్‌ మలి జాబితాపై కసరత్తు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా నడ్డా నివాసానికి చేరుకోవటంతో పొత్తు అంశాలతో పాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ జరిగింది. తెలంగాణలోని 119 స్థానాల్లో రెండు విడతలుగా 53 సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇచ్చే సీట్లు పోను మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్‌ కమిటీ నేతలు నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సాయంత్రం బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో నడ్డా అధ్యక్షతన బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం కూడా జరగనుంది. దీంతో ఈరోజే కసరత్తు కొలిక్కిరావచ్చని భావిస్తున్నారు.జనసేనతో పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినా కొన్ని సీట్ల విషయంలో పార్టీ శ్రేణులనుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. కూకట్‌పల్లి సీటు ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ కమలం కార్యకర్తలు ముందే నిరసనకు దిగారు. శేరిలింగంపల్లి సీటు విషయంలోనూ అక్కడి నేతలు పట్టుదలతో ఉన్నారు. జనసేన గురిపెట్టిన సీట్లలో బీజేపీ ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని కొందరు తేల్చిచెబుతున్నారు. టీడీపీ ఎన్నికల బరిలో లేకపోవటంతో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో తమకు అనుకూలిస్తుందని జనసేన భావిస్తుంటే.. అక్కడి సీట్లు వదులుకునే ముచ్చటే లేదంటున్నారు బీజేపీ నేతలు. దీంతో సీట్ల సంఖ్య విషయంలో జనసేన కాస్త తగ్గినా.. కోరుకున్న సీట్ల విషయంలో మాత్రం పేచీలు తప్పేలా లేవు. మరి జనసేన-బీజేపీ పొత్తులో క్లైమాక్స్‌ సీన్‌ ఎలా ఉండబోతోందో ఏమో!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు