Monday, May 6, 2024

కాంగ్రెస్ లో తిరగబడుతున్న దళిత నాయకత్వం..

తప్పక చదవండి
  • పటాన్ చెరువు టికెట్ పై మాజీ డిప్యూటీ సీ.ఎం దామోదర రాజనర్సింహ గరం.. గరం…
  • గాంధీభవన్ లో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎస్టి, ఆదివాసి సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, బక్క జడ్సన్..
  • ఇంకా ఎటు తేలని తుంగతుర్తి.. అయోమయంలో అద్దంకి.!
  • ఎస్సీ రిజర్వుడు స్థానాలపై రెడ్ల బోడ పెత్తనం ఏంటని నిలదీస్తున్న దళిత యువతరం..
  • అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ ఫలాలను అందుకోలేకపోతున్న భావితరం నాయకులు..
  • నాలుగు పార్టీలు తిరిగొచ్చిన నేతలకే కాంగ్రెస్ పెద్దపీట వేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత
  • ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకత్వం కన్నెర్ర చేస్తోంది. ఎస్సీ రిజర్వుడు స్థానాలు మొదలు, ఇతర అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది రెడ్లు చెప్పిన వారికి మాత్రమే టికెట్ వచ్చే పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ దళిత లీడర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సర్వేల పేరుతో భారీ కుట్ర జరుగుతోందని, పార్టీలో పని చేసే కమిటెడ్ నాయకులను కాదని గెలుపు గుర్రాల పేరుతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగడమే కాకుండా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని సీనియర్ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తుది విడత టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తికి గురైన మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కేటాయింపులో తమ సూచనలు పట్టించుకోకపోవడం దామోదరను మనస్తాపానికి గురి చేసింది. పార్టీలో పని చేస్తున్న వారికి టిక్కెట్లు కేటాయించాలని కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని చేసిన సూచనలు పట్టించుకోక పోవడం దామోదరకు ఆగ్రహం కలిగించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దామోదర రాజనరసింహ రాజీనామా వార్తలతో కాంగ్రెస్ అప్రమత్తం అయ్యింది. ఆ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే దామోదర్‌కు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేయడంతో దామోదర ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పరిస్థితులు సర్దుకుంటాయని థాక్రే నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.

పార్టీలో ఉద్దేశపూర్వకంగానే తమను అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పటాన్‌చెరులో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ను కాదని నీలం మధుకు టిక్కెట్ కేటాయించడంపై దామోదర్ రాజ నరసింహ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో పార్టీని వీడి తన దారి తాను చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

మరోవైపు పటాన్‌చెరు టిక్కెట్‌ నీలం మధుకు కేటాయించడంపై కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రేవంత్ రెడ్డి ఇంటినిముట్టడించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు నినాదాలు చేశారు. అటు నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం విషయంలో కూడా దామోదర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

గాంధీభవన్ లో నిరసన వ్యక్తం చేసిన బెల్లయ్య నాయక్..

కాంగ్రెస్ ఎస్టి, ఆదివాసి సెల్ అధ్యక్షుడైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్ మంగళవారంనాడు గాంధీభవన్ లో నిరసన వ్యక్తం చేశారు. నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారో చెప్పాలని ఆయన అదృష్టాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ టికెట్ తనకు కేటాయించాలని అక్కడ ఎస్టీ జనాభా ఎక్కువ ఉందన్నారు. పార్టీలో ఉన్న కమిటెడ్ దళిత గిరిజన నాయకులకు టికెట్లు కేటాయించడంలో అధిష్టానం పెద్దలు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన తన నిరసనను తెలియజేశారు.

సత్తుపల్లి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మానవతారాయ్.!

ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నేతగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా పేరున్న మానవతారాయ్ ఆశించిన సత్తుపల్లి టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపించింది. బి.ఆర్.ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, కేసులు ఎదుర్కొన్న నేతగా మానవతారాయ్ కి మంచి పేరుంది. కాంగ్రెస్ నుండి 2014, 2018లో సత్తుపల్లి రిజర్వుడు స్థానం నుండి ప్రయత్నించి బంగపడ్డారు. అయినా పార్టీలోనే ఉంటూ కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా సత్తుపల్లి టికెట్ ఇస్తారనే ఆశతో ఉన్న ఆయనకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఆయన ఓపిక నశించి, ఇక ఈసారి రెబల్ గానైనా తాను సత్తుపల్లిలో పోటీకి దిగాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను బి.ఆర్.ఎస్, బిజెపిలోకి వెళ్ళేది లేదని ఒంటరిగానే బరిలో ఉంటానని ఓ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చివరి క్షణంలోనైన అధిష్టానం పునరాలోచన చేయాలని మానవతారాయ్ కోరారు.

ఎటూ తేలని తుంగతుర్తి.. అయోమయంలో అద్దంకి..!

తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు టికెట్ కొరకు ప్రస్తుతం ఢిల్లీ లేవెల్ లో పంచాయతీ నడుస్తుంది. ఇక్కడి నుండి 2014, 2018లో రెండుసార్లు పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన అద్దంకి దయాకర్ పేరు అధిష్టానం ఖరారు చేయగా, సూర్యాపేట టికెట్ బరిలో ఉన్న దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో ఈ పీఠముడి పక్కనే ఉన్న తుంగతుర్తికి చుట్టుకోవడం వలన ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించడం కుదరడం లేదు. ఏది ఏమైనా పార్టీలో కమిటెడ్ లీడర్ గా, కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడిగా పేరున్న అద్దంకిని అడ్డుకునేందుకు కూడా కొంతమంది నల్లగొండ రెడ్లు ప్రయత్నించడాన్ని దళిత నాయకత్వం, కాంగ్రెస్ లో ఉన్న యువతరం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది రెడ్లు పార్టీలో ఉన్న భవిష్యత్ తరం దళిత నాయకత్వంపై చేస్తున్న బోడ పెత్తనాన్ని జీర్ణించుకోలేని యువతరం సోషల్ మీడియా వేదికగా నల్గొండ రెడ్ల రాజకీయంపై దుమ్మెత్తి పోస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను నేటి భావితరం దళిత నాయకులకు అందకుండా చేయడంలో నల్లగొండ రెడ్లకు పెట్టింది పేరుగా మారిందని యువతరం విమర్శిస్తోంది. పూటకు నాలుగు పార్టీలు మారి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ లో టికెట్లు కేటాయించడాన్ని కొంతమంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు