Sunday, May 19, 2024

బీజేపీకి ఒక్క ఓటు కూడా వెయ్యొద్దు అని చెప్పిన సీఎం కేసీఆర్

తప్పక చదవండి

కామారెడ్డి : ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్‌.. కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం అక్కడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్షగట్టి ఒక్క నవోదయ పాఠశాలనుగానీ, ఒక్క మెడికల్‌ కాలేజీనిగానీ ఇయ్యలేదని, మోటార్లకు మీటర్ల పెట్టేందుకు ఒప్పుకోలేదని రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టిందని సీఎం విమర్శలు గుప్పించారు.
‘రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఏటా రూ.5 వేల కోట్ల నిధులకు కోత పెడ్తనని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిండు. అయినా నేను వినలే. ఏం చేసుకుంటవో చేస్కోపో అని తెగేసి చెప్పిన. నేను సచ్చినా సరే మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన. దాంతోటి కక్షగట్టి గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టిండు. కేవలం మోటార్లకు మీటర్లు పెట్టలేదన్న కారణంగా తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెట్టిన బీజేపోడు ఏం మొఖం పెట్టుకుని ఓట్లడుగుతడు..? మీరు ఆలోచించాలి. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాల్నో అలా చెప్పాలె’ అని సీఎం సూచించారు.
‘దేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని నవోదయ పాఠశాలలు పెట్టాలె. అందుకు ఓ చట్టం ఉన్నది. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం అది. మన రాష్ట్రంల జిల్లాలను 33కు పెంచుకున్నం. అలాంటప్పుడు రాష్ట్రంలో నవోదయ పాఠశాలలను కూడా పెంచాలి కదా..? దీని కోసం నేను నరేంద్రమోదీకి ఏకంగా 100 ఉత్తరాలు రాసిన. మన ఎంపీలు కేశవరావు, బీబీ పాటిల్‌ పార్లమెంటులో నెత్తినోరు కొట్టుకుని మొత్తుకున్నరు. అయినా పట్టించుకోలే. కనీసం ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇయ్యలే. మరి ఒక్క పాఠశాల కూడా ఇయ్యని బీజేపీకి మనం ఓటెందుకు ఎయ్యాలె..?’ అని ప్రశ్నించారు.
‘దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 157 మెడికల్‌ కాలేజీలు పెట్టిండు. మరి దేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం కాదా..? అలాంటప్పుడు మరె మనకు కూడా మూడో, ఐదో, పదో కాలేజీలు ఇయ్యాల్నా..? కానీ ఒక్కటి కూడా ఇయ్యలే. మరె ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇయ్యని నరేంద్రమోదీకి మనం ఓటెందుకు ఎయ్యాలె..? అందుకే మీరు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని పదేపదే మనవి చేస్తున్నా. బీజేపీ కథ ఇట్ల, కాంగ్రెస్‌ కథ అట్లున్నది. కాబట్టి ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటేయండి’ అని సీఎం కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు