Monday, May 27, 2024

ఓట్ల పండుగలోనోట్ల జాతర

తప్పక చదవండి
  • 8 రోజుల్లో వందకోట్ల పైనే పట్టివేత..
  • ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు వెలికితీత..

నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అంటూ స్వర్గీయ ఎన్టీరామారావు ప్రతి సభలోనూ చెప్పుకొస్తుంటారు.. అప్పుడు సభలకు హాజరైన జనాలనుద్దేశించి ఆయన అన్న మాటలవి.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నవేళ అలాంటి పరిస్థితే నెలకొంది.. ఎక్కడ చూసినా హవాలా డబ్బు, బంగారం, వెండి తదితరాలు పోలీసుల తనిఖీలలో బయటపడుతున్నాయి..

హైదరాబాద్‌ : ఇన్నాళ్లు బ్లాక్‌ మనీ పుట్టల్లో తల దాచుకున్న కట్టల పాములు.. ఇప్పుడు బుసలు కొడుతూ బయటకొస్తున్నాయి. ఓట్ల పండుగలో నోట్ల జాతర జరుగుతోంది. తెలంగాణ దంగల్‌లో నగదు, నగల తాయిలాల సిత్రాలు తళుక్కుమంటున్నాయి. కోడ్‌ కూసిందో లేదో పట్టుకుంటే కోట్లు బయటపడుతున్నాయి. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా. నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. కోట్లాది రూపాయల నగదు.. మద్యం, గోల్డ్‌.. పలు రకాల వస్తువులు ఇలా అన్ని కూడా రూ.101 కోట్ల మార్క్‌ దాటయి. షెడ్యూల్‌ వచ్చిన అనతి కాలంలోనే రూ.101 కోట్ల మార్క్‌ దాటడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కవాడిగూడలో పోలీసుల తనిఖీల్లో ఏకంగా 2 కోట్ల 9 లక్షల నగదు పట్టుబడింది.. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. కారు సహా పైలట్‌ బైక్‌ను సీజ్‌ చేశారు. ఇక మియాపూర్‌లో కారులో చెక్‌ చేస్తే 17 కేజీల బంగారం.. 17 కేజీల వెండి దొరికింది. బిల్లులు చూపకపోవడంతో సరుకును స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొమురం భీం జిల్లా, కాగజ్‌ నగర్‌ మండలం, వంజిరి చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసుల తనిఖీల్లో 99 లక్షలు పట్టుపడ్డాయి. కరీంనగర్‌లో ఓ వాహనంలో 2 కోట్ల 36లక్షల 50వేల క్యాష్‌ పట్టుబడింది.. మహబూబ్‌ నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం లాల్‌ కోట చౌరస్తా చెక్‌ పోస్ట్‌ దగ్గర తనిఖీల్లో భారీ నగదు పట్టుబడింది.. రాయచూర్‌ నుంచి నల్గొండ వెళ్తున్న డీసీఎం వాహనంలో ఆరుగురి దగ్గర 35లక్షల 49వేలు పట్టుకుని సీజ్‌ చేశారు పోలీసులు. నల్గొండ జిల్లా వాడపల్లిలో రూ. 3.04 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8కోట్ల మేర నగదు, 40 లక్షల విలువైన మద్యం, కోటి రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 56 కోట్ల రూపాయల వరకు నగదు సీజ్‌ చేశారు పోలీసులు. ఇప్పటివరకు దాదాపు 72 కిలోల వరకు బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 429 కేజీల వెండి, 42 వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి, డైమాండ్ల విలువ దాదాపు రూ. 39 కోట్లు ఉంటుంది. మరోవైపు 7 కోట్ల రూపాయల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలను ఇప్పటిదాకా స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లో 50 వరకు వైన్‌షాపులకు సంబంధించి 3 కోట్ల వరకు నగదు సీజ్‌ చేశారు. మొత్తం విలువ రూ.101 కోట్ల మార్క్‌ దాటినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 9 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని అప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికలకు సంబంధించిన నగదు పెద్ద మొత్తంలో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన సొమ్ముతో సమానమని అధికారులు తెలిపారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులతో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంలో పోలీసులు తనిఖీలు జరిపారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారులో 26 లక్షల 50 వేల 600 వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నర్సంపేట పట్టణం వరంగల్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ దగ్గర తనిఖీలు చేపట్టారు జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య. ఇక మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు జరిపారు డీసీపీ సుధీర్‌. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నగదు తీసుకురాకుండా ఉండేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు