Friday, May 10, 2024

స్వర్ణ సంబరం

తప్పక చదవండి
  • ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట..
  • 107 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్
  • నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు
  • 2018 క్రీడల్లో 70 పతకాలు గెలిచిన భారత్
  • తమ లక్షాన్ని చేరుకున్న భాదిత అథ్లెటిక్స్..
  • అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని

న్యూ ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ముందెన్నడూ లేని విధంగా విజయ బావుటా ఎగురవేస్తోంది. భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. 100 పతకాలు సాధించి జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 25 బంగారు పతకాలు, 35 వెండి పతకాలు, 40 కాంస్య పతకాలను భారత అథ్లెట్లు గెలుచుకున్నారు. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళ కబడ్డీలో భారత్ మూడు బంగారం పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో జ్యోతి వెన్నమ్, ప్రవీణ ఓజస్ బంగారం పతకాలను గెలుచుకున్నారు. చైనీస్ తైపీ జట్టును ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు బంగారం పతకం సొంతం చేసుకుంది. దీంతో జాబితాలో భారత్ ఖాతాలో 107 మెడల్స్ చేరాయి.

కాగా చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భాగంగా నేడు చివరిరోజు.. ఈరోజు ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో కరాటే పోటీలు జరుగుతాయి. ఈ రెండు పోటీల్లో భారత అథ్లెట్లు ఎవ్వరూ పోటీలో లేకపోవడంతో ఏషియన్ గేమ్స్‌ 2023 పోటీల్లో భారత క్రీడా ప్రస్థానం నేటితో ముగియనుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలను సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం విశేషం. ఈసారి వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగి.. లక్ష్యాన్ని చేరుకున్నారు.

- Advertisement -

కాగా భారత్ కు క్రికెట్‌లోనూ స్వర్ణం దక్కింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ 18.2 ఓవర్ల ఆట తర్వాత వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం కారణంగా శనివారం మధ్యాహ్నం ఆట 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. 18.2 ఓవర్ల తర్వాత మరోసారి వరుణుడు అడ్డుకున్నాడు. అప్పటికి అఫ్గానిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. చాలా సేపటికి వరకూ వేచి చూశారు.. ఆట కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్ రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆసియా క్రీడల్లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌కే స్వర్ణ పతకం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

భారత మహిళా చెస్ టీమ్ హారికా ద్రోణవల్లి, కొనేరు హంపి, వంతిక అగర్వాల్, వైశాలి బాబు, సవితా శ్రీ, 15/18 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచారు. పురుషుల చెస్ టీమ్ ఈవెంట్‌లోనూ రజతమే దక్కింది. ప్రజ్ఞానంద, గుకేశ్, విడిత్ గుజ్‌రాతీ, అర్జున్, హరికృష్ణ రజతం గెలిచారు. ఈ రెండు పతకాలతో కలిపి భారత్ ఖాతాలో మొత్తం 107 పతకాలు చేరాయి. కాగా అంతకు ముందు రెజ్లింగ్‌లో 86 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన దీపిక్ పూనియా కూడా ఇరాన్ రెజ్లర్ హసన్ యజదానీచరతి చేతుల్లో 0-10 తేడాతో ఓడాడు. ఈ ఏషియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన ఏకైక భారత రెజ్లర్ దీపిక్ పూనియా కావడం విశేషం..

శనివారం రోజు భారత పురుషుల జట్టుతో పాటు, భారత కబడ్డీ పురుషుల, మహిళల జట్టు స్వర్ణాలు గెలిచాయి. అలాగే బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆర్చరీలో జ్యోతి వెన్నం, ఓజాస్ డియోటెల్ స్వర్ణం గెలవగా అభిషేక్ వర్మ రజతం, అదితి స్వామి కాంస్య గెలిచింది. భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. ఈ రోజు గెలిచిన 12 పతకాలతో భారత్ పతకాల సంఖ్య 107కి చేరింది. భారత్ గెలిచిన 107 పతకాల్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన టీమిండియా, ఏషియన్ గేమ్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100కి పైగా పతకాలు సాధించింది. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్, ఆ తర్వాత బెస్ట్ పొజిషన్ కూడా ఇదే. ఆఖరి రోజు జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొనే భారత జట్టు, స్వదేశానికి తిరిగి రానుంది.

భారత్ సాధించిన ఈ పథకాల చరిత్రను చిరస్మరణీయ విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పురస్కారాలను భారత్ కు తీసుకొచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఏషియన్ గేమ్స్ లో భారత్ కు చిరస్మరణీయ విజయం. నూరు మెడళ్ల మైలురాయిని చేరుకున్నందుకు భారతీయులు ఉద్వేగానికి గురవుతున్నారు. మన అసాధారణ క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. వారి కృషితోనే భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడాకారుల బృందానికి ఈ నెల 10న ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏషియన్ గేమ్స్ లో అత్యధికంగా 354 పతకాలతో చైనా ముందుంది. జపాన్ 169, దక్షిణ కొరియా 170 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు