Saturday, April 27, 2024

మడుగులొత్తేవాళ్లే జర్నలిస్టులా..?

తప్పక చదవండి
  • వయా మీడియాగా ఉంటేనే రక్షణా..?
  • అవినీతిపై పోరాడితే నేరమా..?
  • జర్నలిస్టులు అంటే విష సర్పాలా..?
  • నువ్వు చేసిన ఉద్యమానికి ఊపిరిపోసింది మేమే..
  • మా కలాల వెలుగుల్ని ఆర్పేయాలని చూడకు..
  • పస్థులైనా ఉంటాం కానీ నీ కాళ్లకు చెప్పులు తొడగం..
  • మా పెన్నులో సిరా మా రక్తం.. మా ఆలోచనలే మాకు ఊపిరి..
  • ప్రాణాలను లెక్కచేయం.. ఆత్మాభిమానాన్ని చంపుకోము..

( అవాకులు చవాకులు పేలితే మా కలానికి పదునుపెడతాం అంటున్న జర్నలిస్టుల మనోవ్యథ.. ఆదాబ్ పాఠకులకు ” బీవీఆర్ రావు” అందిస్తున్న ప్రత్యేక కథనం.. )

మా కడుపులో ఆకలి అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది.. మా కళ్ళల్లో కన్నీళ్లు ఆవిరైపోయి రక్తం చుక్కలు కారుతూ ఉంటాయి.. ఇంటిదగ్గర సమస్యలు తాండవమాడుతుంటాయి.. ఆశగా ఎదురుచూసే భార్యా, పిల్లల చూపులు గుండెల్లో గుచ్చుకుంటుంటాయి.. సహకరించని శరీరం అనారోగ్యంతో వాలిపోతూ ఉంటుంది.. అయినా సరే మనోధైర్యం వెన్నుతడుతూ ఉంటుంది.. సమాజంలో ఎదురయ్యే రుగ్మతలను రూపుమాపాలనే తపన కొనవూపిరిని ఊదుతూ ఉంటుంది.. ఆ ఊపిరే మాకు ఊతం అవుతుంది.. సామాన్య ప్రజానీకానికి ఏదైనా చెయ్యాలనే ఆకాంక్ష నడిపిస్తూ ఉంటుంది.. గుండెల్లో బడబాగ్ని రాగులుతూ ఉన్నా.. చెదరని చిరునవ్వుతో ముందుకు సాగుతూనే ఉంటాం.. ఎక్కడ వాలిపోతామో..? ఎక్కడ రాలిపోతామో గ్యారెంటీ లేని బ్రతుకులు మావి.. భవితవ్యం మాకు ఎండమావి..

- Advertisement -

హైదరాబాద్ :
రక్తాన్ని సిరా చుక్కలుగా మార్చుకుని అక్షర యుద్ధం చేస్తుంటారు.. అలసిపోతున్నా ఆశ చావకుండా ముందుకు సాగుతుంటారు.. ఎక్కడ సమస్య ఉన్నా క్షణాల్లో అక్కడ వాలిపోతుంటారు.. సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.. నిలదీస్తారు.. పోరాటం చేస్తారు.. ఇదంతా తమకేదో లబ్ది కలుగుతుందని కాదు.. పదిమందికీ మంచి జరుగుతుందనే ఒక బృహత్తర ప్రయత్నంలో భాగమే.. అదే జర్నలిస్టుల జీవన చిత్రం.. పదాలతో స్నేహం చేస్తారు.. సమస్యలతో సహవాసం చేస్తారు.. అవినీతి అయినా, ఆక్రమణ అయినా కళ్లకు కట్టినట్లు కథనాలు రాస్తారు.. వాస్తవాలను ప్రతిబింబించేలా వార్తలు వెలుగులోకి తీసుకునివస్తారు.. అధికార ప్రభుత్వాలు అవినీతి చేసినా.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా యదార్ధాలు ప్రజలముందు ఉంచుతారు.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు.. తాము రాసిన రాతలకు ఫలితం దక్కితే అదే మహద్భాగ్యమని పొంగిపోతారు.. ఏ కొంత మేలు జరిగినా చెప్పలేని ఆనందడోలికల్లో తేలిపోతారు.. వాస్తవాలను రాయడం తప్ప మరే పని చేతకాని జర్నలిస్టులు.. మహా మహా ఉద్యమాలు సైతం జర్నలిస్టుల సహకారంతో సక్సెస్ అయిన సందర్భాలు కోకొల్లలు.. ఒక్కోసారి ప్రభుత్వాలే తల్లకిందులైన యదార్ధ ఘటనలను కూడా చూసాం.. ఎన్నెన్నో అపురూప ఘటనలకు ఊతమిచ్చిన జర్నలిస్టుల జీవితాలు కాలగమంలో కలిసిపోయినా వారు చూపించిన తెగింపు మాత్రం మాటల్లో వర్ణించలేము.. తమ విధినిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన జర్నలిస్టులు ఎందరెందరో..? ఏ గ్యారెంటీ లేని నిస్వార్ధ జీవులు జర్నలిస్టులు.. ఒక అక్షరం ఎంతో అంతులేని శక్తికి సమానం.. గతి తప్పుతున్న పరిపాలనలను గాడిలో పెట్టే మహోన్నత భావాలు వెలిబుచ్చే ఔషధాలు జర్నలిస్టుల కథనాలు.. అలాంటి జర్నలిస్టుల పట్ల అగౌరవంగా, అమర్యాదగా మాట్లాడుతూ.. జర్నలిస్టులను విష సర్పాలతో పిలిచినా పాలకులున్న దరిద్రపు సమాజంలో బ్రతుకుతున్నాం.. ఇది అత్యంత హేయం.. ఏ జర్నలిస్టుల సహకారంతో ఉద్యమాన్ని నిర్మించి.. ఆ ఉద్యమ నిచ్చెన ఎక్కి, అధికారం అందుకున్న అధినేత నోటికొచ్చినట్లు కామెంట్లు చెయ్యడం నిజంగా నీచమైన చర్య.. మిమ్మల్ని పొగిడితే సరే.. లేదంటే అంతే.. ఇదేనా వేల పుస్తకాలు చదివిన దురంధరుడి దుర్నీతి..?

నిన్నటికి నిన్న బీ.ఆర్.ఎస్. అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇంటిస్థలాలు మంజూరు చేస్తాం.. అని చెబుతూనే.. మాకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను పక్కన బెడతాం.. వయా మీడియాగా వార్తలు రాసే జర్నలిస్టులనే పరిగణలోకి తీసుకుంటాం.. అని చెప్పడం దేనికి సంకేతం.. దొరతనంతో గర్వంతో మితిమీరిన మాటలు కాకపోతే.. అంతేకాకుండా పాముకు పాలుపోసి పెంచుకోవాలా..? అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు.. అంటే మీరు ఏమిచేసినా మీకు బాకా వూదాలా..? అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటే వాటిని సమర్థిస్తూ వార్తలు రాయాలా..? మీరేమి చేసినా గంగిరెద్దులా తలూపాలా..? మీరు చేసే తప్పుల్లో భాగస్వాములు కావాలా..? జర్నలిస్టులంటే మీకు బానిసలు కాదు కేసీఆర్.. మాకంటూ ఒక విజన్ ఉంది.. అది సమాజం కోసం పనిచేస్తుంది.. అక్రమాలకు కొమ్ము కాయదు.. ఈ నిజాన్ని గ్రహించండి..

అయినా మీరేదో మీ సొంత ఖజానా నుండి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు.. ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న వారు జర్నలిస్టులు.. ప్రజలు ప్రభుత్వానికి కట్టే పన్నులతోనే కదా వారికి ఏదైనా ఇవ్వాల్సింది.. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ మిగులు భూముల నుంచే కదా ఇవ్వాల్సింది.. అదేదో మీ ఆస్తులు పంచుతున్నట్లు తెగ బాధపడి పోతారెందుకు..? ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందులు తొలగించడం కోసం, మీ నాయకుల కమిషన్ల కోసం, మీ బినామీ కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వ భూములను తెగనమ్మడం న్యాయం అయితే.. అర్హులైన జర్నలిస్టులకు ఇంటిస్థలాలు కేటాయించడం న్యాయం కాకుండా ఎలా పోతుంది..? మీరు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజానీకం గమనిస్తోంది.. ఒక్కసారి ఆలోచించండి.. మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు మీకు వెన్నంటి ఉండి.. మీ ఉద్యమాన్ని దశదిశలా వ్యాపింపజేసింది జర్నలిస్టులు.. ఒక మహా నాయకుడు తెలంగాణకు దొరికాడనే నిజాన్ని చాటింది జర్నలిస్టులే.. మొదటిసారి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించినప్పుడు మిమ్మల్ని మహా నేతగా కీర్తించి, తెలంగాణ ప్రజలకు మీ మీద నమ్మకాన్ని నిలబెట్టింది కూడా జర్నలిస్టులే.. కానీ మీరు వారికిచ్చే బహుమతి వారిని విష సర్పాలతో పోల్చడమా..? మీకు ఊడిగం చేసే వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని బహిరంగంగా చెప్పడం న్యాయం కాదు.. ఇది అంత మంచి పద్ధతి కాదేమో.. జరుగబోయే పరిణామాల ప్రభావం ఎదుర్కోవడం మీ తరం కాదు.. అక్షరం గర్జిస్తే ఆ శబ్దానికే నాయకులు పారిపోతారేమో..? మీరు, మీ నాయకులు వాస్తవాలను గ్రహించండి.. ఇప్పటికైనా జర్నలిస్ట్ లోకానికి క్షమాపణలు చెప్పి, చేసిన తప్పు సరిదిద్దుకోండి.. ఒక ఉద్యమ నాయకుడిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.. వ్యక్తిగతంగా మీ మీద మాకు ద్వేషం లేదు.. మీ విధానాలు.. మీ అభిప్రాయాలనే మేము వ్యతిరేకిస్తున్నాం.. నిజంగా మీకు దమ్ముంటే సపోర్ట్ గా వార్తలు రాసేవారికే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఒక జీఓ విడుదల చెయ్యండి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు