Wednesday, September 11, 2024
spot_img

గిరిజన మహిళపై పోలీసుల అమానుష ఘటనపై హై కోర్టు సీరియస్..

తప్పక చదవండి
  • సుమోటోగా స్వీకరించి కేసు విచారించిన న్యాయస్థానం..
  • చీఫ్ జడ్జికి లేఖ రాసిన జడ్జి సూరేపల్లి నంద..
  • ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు..
  • సంఘనకు సంబంధిచిన సీసీ ఫుటేజీని సమర్పించాలని ఆదేశాలు..
  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా..
  • మరో దారుణ ఘటనలో విూర్‌పేట బాలికపై సామూహిక అత్యాచారం..
  • పూర్తి వివరాలతో నివేదిక కొరిన గవర్నర్‌ తమిళసై..

హైదరాబాద్‌ :
స్వాతంత్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్‌ జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ డీజీపీ, హోం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌, ఎల్బీనగర్‌ డీసీపీకి, ఏసీపీ, ఇన్స్పెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన ఎంక్వయిరీ రిపోర్టులు సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. విూర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నందిహిల్స్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 4లో ఉంటున్న వరలక్ష్మీ… తన కూతురి పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి డబ్బులు కోసం వెళ్లారు. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌కు వస్తుండగా ఎల్బీనగర్‌ సర్కిల్ లో వరలక్ష్మిని పోలీసులు ఆపేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. బాధితురాలు ఎదురు తిరిగినందుకు ఖాకీలు మరింత చిత్రహింసలకు గురి చేశారు. ఆపై తెల్లవారుజామున ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్‌ పోలీసులు వదలిపెట్టారు. పోలీసులు దాడిలో బాధితురాలు నడవలేని స్థితికి చేరుకున్నారు. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాయి. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. అండగా ఉంటామంటూ హావిూ ఇచ్చారు.

అలాగే అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన కేసులో ఇద్దరు పోలీసులపై వేటు పడిరది. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ శివ శంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ చౌహాన్‌ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ… ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విూర్‌పేటలో బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, రాచకొండ సీపీ చౌహాన్‌ కి గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇండిపెండెన్స్‌ డే రోజు ఓ మహిళను ఎల్బీనగర్‌ పీఎస్‌ కు తరలించి ఆమెపై దాడిచేసిన ఘటనపై సైతం గవర్నర్‌ నివేదిక కోరడం తెలిసిందే. విూర్‌ పేట్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతుందని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్‌ ప్రకారం ముగ్గురు అత్యాచారం చేసినట్లు గుర్తించామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. బాలికపై ఈ దారుణానికి పాల్పడింది స్థానికులేనని, వారి గురించి తెలిసిన వారేనని స్పష్టం చేశారు. బాలికకు వైద్య చికిత్సలు పూర్తి చేశామని, మెడికల్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు. ఈ కేసులో ఇదివరకే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో అబేద్‌ లాల్‌ రౌడీ షీటర్‌ పై అనుమానం ఉందన్నారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్‌ ప్రకారం ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నందనవనం పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా గంజాయి అరికట్టడంలో రాచకొండ పోలీస్‌ ముందుంటారన్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన వారు కూడా గంజాయి బ్యాచ్‌ అని అనుమానిస్తున్నట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడిరచారు. మైనర్‌ బాలిక తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో వీరి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలిక సోదరులతో కలిసి నగరంలోని విూర్‌పేట నందనవనంలో నివాసం ఉంటోంది. తండ్రి వీరికి దూరంగా ఉన్నాడని స్థానికంగా ఉండే కొందరు బాలికపై కన్నేశారు. నిందితులు సోమవారం పట్టపగలే వీరి ఇంట్లోకి చొరబడ్డారు. ఆపై కత్తులతో బాలికను, ఆమె సోదరుడిని బెదిరించారు. అనంతరం ముగ్గురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోదరుడి ఎదుటే నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని, నిందితులను పట్టుకునేందుకు కొన్ని బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు