Wednesday, May 8, 2024

9 మంది దుర్మరణం

తప్పక చదవండి
  • పండగ పూట భారీ అగ్ని ప్రమాదం
  • నాంపల్లిలోని కెమికల్‌ గోడౌన్లో ఫైర్‌ యాక్సిడెంట్‌
  • ఐదు అంతస్తులకు వ్యాపించిన మంటలు
  • మరో 8 మందికి తీవ్రంగా గాయాలు
  • ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
  • నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్‌
  • ఘటనకు కెమికల్‌ డ్రమ్ములే కారణం
  • కీలక విషయాలు వెల్లడిరచిన ఫైర్‌ డీఐజీ
  • గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
  • జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్‌
  • రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా : ప్రభుత్వం

హైదరాబాద్‌ : నాంపల్లిలోని బజారఘాట్‌ ఏరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. వారిలో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక నాలుగు రోజుల పసికందు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అపార్టుమెంటు ముందు పార్క్‌ చేసి ఉన్న ఒక కారు, ఆరు ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగగానే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఫైర్‌ సిబ్బంది నాలుగు ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. అపార్టుమెంటులో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అపార్టుమెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయని మధ్యమండల డీసీపీ వేంకటేశ్వర్‌రావు తెలిపారు. గ్యారేజీ సమీపంలో డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములకు మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు వ్యాపించాయని చెప్పారు. అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్‌లలో అద్దెకు ఉండే కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నాయన్నారు. కాగా, అపార్టుమెంటు ఓనర్‌ రమేశ్‌ జైశ్వాల్‌కు కెమికల్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో అపార్టుమెంటు సెల్లార్‌లో అతను 130 డ్రమ్ముల కెమికల్‌ను నిలువచేశారు. పాస్టిక్‌ తయారీకి వినియోగించే ఈ కెమికల్‌ డ్రమ్ముల్లో 30 డ్రమ్ములకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆలోపే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూనే కాలిపోకుండా ఉన్న మిగతా డ్రమ్ములను బయటకు తీసుకొచ్చారు. కాగా, ప్రమాదం అనంతరం ఆపార్టుమెంటు ఓనర్‌ రమేశ్‌ జైశ్వాల్‌ పరారయ్యాడు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒకటి, రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత
నాంపల్లిలోని ఓ అపార్టుమెంటులో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి కారకుడిగా భవన యజమాని రమేష్‌ జైస్వాల్‌ను గుర్తించారు. ఐదు అంతస్తుల భవనంలో రమేష్‌ జస్వాల్‌ భారీగా కెమికల్‌ డబ్బాలు నిల్వచేశారు. రమేష్‌ జైస్వాల్‌కి ప్లాస్టిక్‌ తయారు చేసే ఇండస్ట్రీ ఉన్నట్లుగా గుర్తించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున కెమికల్స్‌ నిల్వచేయడం జరిగింది. 150 పైగా కెమికల్‌ డబ్బాలను రమేష్‌ జైస్వాల్‌ నిల్వ చేయడం జరిగింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కెమికల్‌ డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్‌ డబ్బాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా భవనమంతా మంటలు వ్యాపించాయి. ఒకటి, రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. మూడు నాలుగు అంతస్తుల్లో ఉన్నవాళ్లుసేఫ్‌గా ఉన్నారని పోలీసులు తెలిపారు. మూడు నాలుగు అంతస్తుల్లోని వారిని రక్షించారు. మృతుల్లో దట్టమైన పొగలతో ఊపిరాడక చనిపోయిన వారు కొందరైతే.. సజీవదహనమైన వారు మరికొందరున్నారు. చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భవనంలో డీజిల్‌, పెట్రోల్‌ ఆయిల్‌ లేదని పోలీసులు తెలిపారు. మంటలకు కెమికల్‌ డబ్బాలే కారణమని పోలీసులు తేల్చారు.
వివరాలను మీడియాకు వివరించిన ఫైర్‌మాన్‌ ఆదర్శ్‌
నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్‌ ఆదర్శ్‌ మీడియాకు వివరించారు. ఆదర్శ మాట్లాడుతూ నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారిని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. తమ చేతులతో 21 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్‌కు తరలించినట్లు ఫైర్‌ మాన్‌ వెల్లడిరచారు. రెండో అంతస్థులో ఉన్న ఆరు మంది పొగపీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లారని.. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారన్నారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా ఉన్నాయన్నారు. ఆ పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారన్నారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామని.. కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయాయని తెలిపారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని ఆదర్శ్‌ వెల్లడిరచారు.
మృతుల కుటుంబాల తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద మృతుల కుటుంబాల తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గాయపడిన క్షతగాత్రులకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు