కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు ఘనంగా జరగనుంది.మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల వేమో! దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువమంది హాజరయ్యే ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. జాతరకు కీలకమైన నాలుగు రోజులకు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే ఈ జాతరకు సుమారు 700 ఏండ్ల చరిత్ర ఉంది.1940 వరకు చిలకలగుట్ట మీద జరిగే జాతరకు గిరిజనులు మాత్రమే వచ్చేవాళ్ళు.కాలక్రమేన మన రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ జాతరకు గిరిజనుల తో పాటు గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతు న్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఒడిశా,చత్తీస్ గడ్, రaార్కండ్ రాష్ట్రాల నుంచి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968 లోనే రాష్ట్ర పండుగగా గుర్తించింది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం 2008 నుంచే కోరుతుంది.ప్రతి జాతర సమయంలో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నది.కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.ప్రభుత్వం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించింది. 2020 జాతర సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా కు కూడా వినతులు సమర్పించారు. జాతీయ హోదా వస్తే కేంద్రం నుంచి నిధులు రావడమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తో పాటు పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందుతుంది. అలహాబాద్ లో జరిగే కుంభమేళా తర్వాత అత్యంత మహా జాతరగా విరజిల్లుతున్న ఈ జాతరను జాతీయ పండుగ గా గుర్తించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. జాతీయ హోదా వస్తే యునెస్కో గుర్తింపునకు అవకాశం ఉంటుంది .కోల్ కతా దుర్గాపూజ ఎలాగైతే యునెస్కో గుర్తింపు పొందినదో అలాగే చారిత్రక నేపథ్యం కలిగిన మేడారం జాతరకు కూడ యునెస్కో వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి.ఎలాంటి విగ్రహాలు గానీ కనీసం గుడి కూడా లేని పలు విశిష్టతలు కలిగిన ఈ జాతర ఇంటాన్జబుల్(కనిపించని) వారసత్వ సంపద కేటగిరీలో యునెస్కో వారసత్వ హోదా లభించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.వారి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రతిసారి జాతరలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు వదిలేస్తుండడంతో మేడారం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ప్లాస్టిక్ వనంగా మారిపోతున్నది. ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపేందుకు శబరిమల తిరుమల తిరుపతి దేవస్థానాలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నవి.అదే స్ఫూర్తితో మేడారంలో ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతోపాటు జంతువులకు ఎలాంటి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. కోటి యాభై లక్షల మందికి పైగా సందర్శించే మేడారం మహా జాతరను ఒక్కసారైనా సరే చూడాలనే తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. జాతర జరిగే ముఖ్య దినాలను ప్రభుత్వం సాధారణ సెలవులుగా ప్రకటిస్తే బాగుంటుంది.సెలవులు ప్రకటిస్తే జాతర సమయంలో మేడారంలో తల్లులను దర్శించుకునే అవకాశం ఉద్యోగులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దక్కుతుంది.ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరను విజయవంతం చేయుటకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.జాతర సమయా నికైనా మేడారం కు జాతీయ హోదా రావాలని ఆశిద్దాం.
` పుల్లూరు వేణుగోపాల్, 9701047002
తప్పక చదవండి
-Advertisement-