- ముందు పోతే గొయ్యి, వెనకకుపోతే నుయ్యి..
- మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ల పరిస్థితి దారుణం..
- తాను కార్పొరేటర్లుగా గెలిపించుకున్న తన
అనుచరులు అతనికి మద్దతుగా నిలుస్తారా.. - లేదా హ్యాండ్ ఇస్తారా.. చూడాలి..
మల్కాజిగిరి : మల్కాజిగిరి అంటే మైనంపల్లి, మైనంపల్లి అంటే మల్కాజిగిరి అనే స్థాయికి మల్కాజిగిరి ప్రజల్లో, టిఆర్‌ఎస్ నాయకుల్లో ఒక భావన కలిగించే విధంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నియోజకవర్గానికి కృషి చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవల జరిగిన పరిణామం తన తనయుడు రోహిత్ కు బిఆర్‌ఎస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే సీటు ప్రకటించలేదని కోపంతో మంత్రి హరీష్ రావు పై చసిన వ్యాఖ్యల వల్ల తాను టిఆర్‌ఎస్ పార్టీని వీడే పరిస్థితి ఏర్పడిరది. అయితే శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనకు తాను బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ.. తాను మాట్లాడిన వీడియోని మీడియాకు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకే బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మల్కాజిగిరి ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, త్వరలోనే ఏ పార్టీలో చేరే విషయాన్ని తెలియజేస్తానని, దేనికి లొంగే ప్రసక్తే లేదని అన్నారు. ఈ తరుణంలో మైనంపల్లి కోసం బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, పార్టీలో ఉంటారా, లేదా మైనంపల్లి కోసం పార్టీకి రాజీనామా చేస్తారా..? అని ప్రస్తుతం మల్కాజ్గిరి ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల నాయకుల మదిలో నెలకొన్న పెద్ద సందేహం. సిట్టింగు కార్పొరేటర్లను కాదని తన అనుచరులను కార్పొరేటర్లను చేసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెంట ఉంటారా..? లేదా కాదని బిఆర్‌ఎస్ లోనే కొనసాగుతారా..? అని ఉద్యమకారులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే విధంగా మారింది మల్కాజిగిరి బిఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ల పరిస్థితి. పార్టీ వీడకుంటే మైనంపల్లికి కోపం, పార్టీని విడితే ప్రజలకు కోపం.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు. మరి ఆయన వెంట ఎవరు నడుస్తారు అన్నది.వేచి చూడాలి.