- ఉరితాళ్లలా వేలాడుతున్న విద్యుత్ వైర్లు..
- నిత్యం భయం భయం ప్రాణ సంకటం..
- బండాపోతుగల్‌లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..
- తొలగించమని కోరినందుకు కరెంట్ సిబ్బంది గుర్రు..
- ఇంటి యజమానిపై ఏఈ దురుసు ప్రవర్తన..
- ఎవడికైనా ఫిర్యాదు చేసుకోమంటున్న ఏఈ రాంబాబు..
చిలిపిచేడ్ : ఓ ఇంటిపై యమపాశాలుగా విద్యుత్ తీగలు వేళాడుతున్నాయి.ఎప్పుడు ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎంత జాగ్రత్త వహించినా రెప్పపాటు పొరపాటుతో ప్రాణాలు పోయే ప్రమాదముంది. అటువంటి కరెంట్ తీగలు నేరుగా ఇంటిపైనే వేళాడుతుంటే భయంభయంతో బతుకెళ్లదీస్తున్నారు ఆయా కుటుంబాలు. కాస్త కనుకరించి కరెంట్ తీగలు ఇంటిపై నుంచి తొలగించాలని కోరినందుకు ప్రత్యామ్నాయం చూపడమో, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడమో చేయాల్సిన సంబంధిత అధికారులు మాత్రం అందుకు భిన్నంగా సమస్య ఉందని తెలిపిన ఇంటి యజమానిపైనే దురుసుగా ప్రవర్తించిన తీరు విస్తూపోయేలా ఉంది.చిలిపిచేడ్ మండలం బండాపోతుగల్ గ్రామంలోని రెండవ వార్డులో అతి తక్కువ ఎత్తులో 33కేవీ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి.

కొన్ని లైన్లు ఏకంగా బిల్డింగ్ ల మీదుగా, మరికొన్ని ఇళ్లకు దగ్గరగా ఉండడంతో ఇంటి యజమానులు నిత్యం భయం భయంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో ఎక్కడ ఇంటి మీదకి వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటారో అని హడలిపోతున్నారు. మేడపై ధాన్యం కానీ,బట్టలు కానీ ఆరబెట్టుకోవాలన్న భయపడుతున్న పరిస్థితి. విద్యుత్ తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని, విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. విద్యుత్ స్తంభాలను ఉన్నచోట నుండి మార్చి పెద్ద స్తంభాలను వేసి వైర్లు పైకి లాగాలని ఇంటి యజమానులు కోరుతున్నారు. గోవర్ధన్,ఇంటి యజమాని నెలనెల విద్యుత్ బిల్లులను వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించడంలో లేదని, పైగా ఏఈ రాంబాబును విద్యుత్ తీగలను తొలగించమని కోరగా మేం తొలగించం, ఎవరికి చెప్తారో చెప్పుకో డీఈకి ఫిర్యాదు చేసుకో అంటూ దురుసుగా మాట్లాడుతున్నాడు. పై అధికారులైనా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం..
ఏఈ రాంబాబు వివరణ ఏఈ రాంబాబును ఆదాబ్ వివరణ కోరగా విద్యుత్ తీగలను తొలగించడానికి అయే ఖర్చు ఇంటి యజమాని భరిస్తాను అంటే తీగలను తొలగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సమాధానం ఇచ్చారు..