Sunday, May 5, 2024

తూనికలు కొలతల శాఖలో గందరగోళం..!

తప్పక చదవండి
  • రాష్ట్ర కార్యాలయంలో నలుగురు చేతిలో వ్యవస్థ చిన్నాభిన్నం..
  • అనర్హులను అందలం ఎక్కిస్తూ అందినకాడికి దండుకుంటున్న వైనం..
  • చర్యలు చేపట్టాల్సిన బాధ్యులు చేతులెత్తేసిన విపరీత పరిస్థితులు..
  • తాజాగా బదిలీలలో భారీగా డబ్బులు
    చేతులు మారినట్లు ఆరోపణలు!

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సమాంతరంగా డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ తూనికలు, కొలతల శాఖలో కొందరు అధికారులు కోటరీగా ఏర్పడి మరో సమాంతర వ్యవ స్థను నిర్వహించడం పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాష్ట్ర రాజధాని నగరంలో లీగల్‌ మెట్రాలజీ శాఖలో గందరగోళం చెలరేగుతున్నా పట్టించుకునే ఓపిక, సమయం ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం దేనికి సంకేతం! ప్రభుత్వ వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన విధివిధా నాలను పాటిస్తూ ప్రజలకు ఇంకా వినియోగ దారులకు జవాబు దారిగా ఉండ వలసిన ప్రజా ప్రతినిధులు, అధికా రులు, ఉద్యోగులు అసలు కంటే కొసరు మిన్న అన్న చందంగా ప్రభుత్వ విధివిధానాలను పక్కనపెట్టి వారి సొంత నిర్ణయాలను అమలు పరుస్తూ.. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి, వినియోగదారులను నిండా ముంచు తున్నా ఏ దేవుడూ పట్టించు కున్న పాపాన పోకపోవడం వెనక మతలబు ఏమిటి! లీగల్‌ మెట్రాలజీ శాఖలో నలు గురు ఒక ముఠాగా ఏర్పడి, రాష్ట్రపతి ఉత్తర్వులు బుట్ట దాఖల చేస్తూ, సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ కమిషన్ల ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో తాజాగా ఏడుగురికి ప్రమోషన్‌ లు ఇస్తూ భారీగా అమ్యాన్యాలు చెల్లించుకున్నట్లు ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి. ఇన్ని అపోహలకు ఆరోపణలకు కారణమైన లీగల్‌ మెట్రాలజీ శాఖపై సంబంధిత మంత్రి ఒక్కసారి కూడా రివ్యూ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందని పలువురు మేధావులు మండిపడుతున్నారు. నిత్యం ప్రజలతో, వినియోగదారులతో అనుసంధానమై ఉన్న తూనికలు, కొలతల శాఖ వ్యవస్థపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కనీసం ఒక్కసారైనా సంబంధిత మంత్రి వాకబు చేయకపోవడం, విచారణకు ఆదేశించకపోవడానికి కారణం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సామాన్య మానవుడు భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో క్రుంగి పోతుంటే మరోవైపు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా శాఖలోని అవినీతి లంచగొండితనం వ్యాపారులకు లాభాలు తెచ్చి పెడుతూ.. వినియోగదారులకు శఠగోపం పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. స్వలాబానికి అలవాటు పడ్డ కొంతమంది అధికారులు, ఉద్యోగులు తమకు ఆమ్యామ్యాలు లభించే చోటునే ఎంచుకొని వేమెంట్‌ తనిఖీలను మమ అనిపించి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారిందని సామాన్య ప్రజానీకం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సామాన్య వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారస్తులను వారి బాట్లను, వేయింగ్‌ మిషన్‌ లను తనిఖీ చేయకపోవడం పరిపాటిగా మారింది. కేవలం వారికి లాభాలు వచ్చే చోటును ఎంచుకొని భారీ వ్యాపారస్తులు నిర్వహించే బంగారు, వజ్రాల వ్యాపారులు, పెట్రోల్‌ పంపులు, వే బ్రిడ్జ్‌ లను సూపర్‌ మార్కెట్లను టార్గెట్‌ గా విధులు నిర్వహించి వచ్చిన లంచం డబ్బును అధికారులకు పంచుతూ, అందిన కాడికి దాచుకోవడం వీరికి పరిపాటిగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అనేక శాఖలు ప్రజల కోసం పనిచేస్తున్నొ తూనికలు కొలతల శాఖ చాలా ముఖ్యమైనదని దీనినే అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఈ శాఖలోని అధికారులు, ఉద్యోగుల స్తిర చరాస్తులను గమనిస్తే బినామీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని పలువురు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం తమ కుటుంబ ఆర్థిక ఆస్తి వివరాలను ప్రభుత్వానికి తెలియపరుస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న వారి ఆస్థుల తాలూకు వివరాలను ఎవరు ఆరా తీయకపోవడం వెనుక జరుగుతున్న తతంగం సైతం బయటికి రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలతో, వినియోగదారులతో ముడిపడి ఉన్న తూనికలు, కొలతల శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని వివరాలతో మరో సంచికలో ఆదాబ్‌ కథనం మీ ముందుకు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు