Saturday, May 18, 2024

చంద్రబాబు నిర్దోషి..

తప్పక చదవండి
  • ఆందోళనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి..
  • చట్టాలపై, న్యాయ స్థానాలపై మాకు నమ్మకం ఉంది
  • కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం
  • చంద్రబాబు అక్రమ అరెస్టును తెలుగుజాతి ఖండిస్తోంది
  • ఎన్టీఆర్‌ భవన్‌ నందు టీటీడీపీ నాయకుల నిరాహార దీక్ష
  • వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించిన నాయకులు
  • టీటీడీపీ దీక్షకు పలువురు నాయకుల, సెలెబ్రెటీల మద్దత్తు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢల్లీిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘‘సత్యమేవ జయతే’’ పేరుతో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షలకు సంఫీుభావంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్‌ భవన్‌ నందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి ఈ దీక్షను నాయకులు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా సంఫీుభావంగా ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబుకు సంఫీుభావం తెలియజేశారు.ఈ సందర్భంగా టీడీపీ-టీఎస్‌ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జయంతి రోజున ఈ నిరసన దీక్ష చేపట్టడానికి ముఖ్యకారణం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధంగా జైలులో పెట్టడమేనని అన్నారు. ఈ అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, వ్యతిరేకిస్తున్నదని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. ఏ మనిషైతే 24 గంటలు అహర్నిశలు రాష్ట్రం కోసం, దేశం కోసం, మంచి ఆలోచనలతో పని చేశారో అటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని జ్ఞానేశ్వర్‌ అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌ లు ప్రజలలోకి వెళ్లి పాదయాత్ర, సభలు నిర్వహిస్తుంటే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రావడాన్ని తట్టుకోలేని సైకో జగన్‌ ఈ అక్రమ అరెస్టు చేశారని అన్నారు. ఆకాశంపై ఉమ్మి వేస్తే అది మనపైనే పడుతుంది… మనం ఒక వేలు చూపిస్తే ఐదు వేళ్లు మనల్ని చూపిస్తాయని జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిది. చంద్రబాబు అక్రమ అరెస్టును రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచంలోని నలుమూలలోని తెలుగు ప్రజలు ఖండిస్తూ, నిరసనలు తెలుపుతున్నారు. కులాలకు అతీతంగా కుటుంబాలకు కుటుంబాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ కష్టాలు తాత్కాలికమే. రాబోయే రోజులలో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. నారా లోకేష్‌ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే అరెస్టు చేస్తామని అంటున్నారు. మీ కేసులకు భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. అక్రమ కేసులను, అరెస్టులను ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం.
జాతీయ తెలుగుదేశం పార్టీ క్యాదర్శి కాసాని వీరేష్‌ మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా ఎన్ని దొంగ కేసులు పెడుతున్నా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారు. సత్యం నిప్పులాంటిది. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వ దురాగతాన్ని గమనిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి పైశాచిక ఆనందాన్ని జగన్‌ పొందుతున్నాడు. ఇది ఎంతో కాలం కొనసాగదు.
ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ… చంద్రబాబుకు సంఫీుభావంగా చేస్తున్న అందరి ప్రార్థనలు వృధాకావు. చంద్రబాబు అజేయుడుగా విజయంతో బయటకు వస్తారు. ఆయన రాక కోసం టీడీపీ శ్రేణులే కాదు ఎన్టీఆర్‌ అభిమానులు, మేమంతా ఎదురు చూస్తున్నాం.
నందమూరి వసుంధర మాట్లాడుతూ… మహాత్మాగాంధీ జయంతి రోజున ఈ దీక్షను చేస్తున్నాం. న్యాయం గెలిచి తీరుతుందని నమ్ముతున్నాం.
పొలిట్జ్యూరో సభ్యులు, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేసి ఎన్టీఆర్‌, చంద్రబాబులు తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడం జరిగింది. చంద్రబాబునే అక్రమంగా అరెస్టు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆలోచిస్తున్నారు. సమర్థవంతమైన పాలన ఇచ్చి తెలుగు ప్రజల గౌరవం పెంచిన నాయకుడు చంద్రబాబు, కేసీఆర్‌ కు కూడా రేపు ఏ పరిస్థితి వస్తుందో ఆలోచించుకోవాలి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి. చంద్రబాబు ఆశీర్వాదంతోనే కేసీఆర్‌ రాజకీయాలలో ఎదిగారు.
జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్‌ మాట్లాడుతూ… చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ పది మంది దోపిడిదారులు కలిసి చంద్రబాబు నాయుడు ని బంధించినంత మాత్రాన అది అరెస్టు కాదు. పోలీసులను రౌడీలుగా మార్చి చంద్రబాబును బంధించారు. కీచకుడు మరో రూపంలో ఏపీని పాలిస్తున్నాడు. కీచకుడు ఎలా మరణించాడో అలాగే జగన్‌ మోహన్రెడ్డిని ప్రజలు రాజకీయంగా అంతమొందించడం ఖాయం. చంద్రబాబు అక్రమ అరెస్టే చట్టమైతే రాబోయే రోజులలో ప్రతి మంత్రి జైలులోనే ఉండాల్సి వస్తుంది.
జాతీయ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కన్న తల్లిని, సొంత చెల్లెలిని దూరం పెట్టిన దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌ మోహన్‌ రెడ్డి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఏపీ వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించాలి.

జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశారు. ఆయన అక్రమంగా అరెస్టు చేయడంతో అనేక మంది అసువులు బాశారు. వారికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ధర్మానికి అధర్మానికి, అభివృద్ధికి దుర్బుద్ధికి జరుగుతున్న ఈ పోరాటంలో మనమందరు కలిసి ముందుకెళ్లాం. అంతర్జాతీయ అవినీతి సంఘానికి అధ్యక్షుడు, సైకోల సంఘానికి శ్వాశ్వత అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు జీవనోపాధికి పాలు అమ్ముకుంటున్నారే కానీ పరిపాలనను ఎన్నడూ అమ్ముకోలేదు. చంద్రబాబుకు కట్టడం తెలుసు కానీ కూల్చడం తెలియదు. 2021లో స్కిల్‌ డెవెలప్మెంట్‌ అద్భుతమైనదని సర్టిఫికేట్‌ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? యువతకు నైపుణ్యం నేర్పడం చంద్రబాబు చేసిన నేరమా? ఏపీలో డేటా చోరీ జరిగితే తెలంగాణలో కేసు పెట్టారు. ఈ కేసు ఎవరి కోసం పెట్టారో కేటీఆర్‌ సమాధానం చెప్పాలి. పైన ఉన్న మోడీ ఏపీలో ఉన్న కేడీ గురించి ఆలోచించాలి. నిప్పులాగా చంద్రబాబు బయటకువచ్చేదాకా మనమందరం కలిసి పోరాటం సాగించాలి.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు పోరాటం చేస్తే జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమిటీ… జగన్‌ బాబైనా దిగిరావాల్సిందే. ఈ పోరాటాన్ని మరో స్వాతంత్య్ర పోరాటంలా మనం పరిగణించాలి. ప్రజాస్వామ్యాన్ని, ప్రాధమిక హక్కులను పరిరక్షించుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాం.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య మాట్లాడుతూ… సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయంతో పరిపాలనను అందరికీ అందించడంలో చంద్రబాబు అగ్రగణ్యుడు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజా యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరముంది.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాలరెడ్డి మాట్లాడుతూ… నిత్యం జనంలో ఉంటూ తెలుగు ప్రజల భవిష్యత్‌ కోసం కృషి చేసిన మహనీయుడు చంద్రబాబు. ఒక్క అవకాశమని ప్రజలను మభ్యపెట్టి జగన్‌ రాక్షస పాలన చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో జగన్‌ పాలన ఒక చీకటి కాలం. జగన్‌ పాలనను పాతాళంలోకి తొక్కే వరకు నిద్రపోకూడదని ఈ దీక్ష చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు టిజికే మూర్తి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్‌, గడ్డి పద్మావతి, బండారి వెంకటేష్‌ ముదిరాజ్‌, జివిజి నాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు శ్రీనివాసులు నాయుడు, బిల్డర్‌ ప్రవీణ్‌, ముప్పిడి గోపాల్‌, సూర్యదేవర లత, మీడియా కమిటీ చైర్మన్‌ తెలుగుదేశం ప్రకాష్‌ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రాచారి, కుర్రా ధనలక్ష్మి, సంధ్యపోగు రాజశేఖర్‌, బిక్షపతి ముదిరాజ్‌, లీలా పద్మావతి, సుభాషిణి, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు శ్రీశైలం మహానంది, మన్నె రాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్‌, మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు హబీబ్‌ మహ్మద్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముంజా వెంకట రాజం గౌడ్‌, పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు గోపాల్‌ రెడ్డి, రాంచందర్‌ రావు, కందికంటి అశోక్‌ కుమార్‌ గౌడ్‌, విద్యాసాగర్‌ రావు, శేరిలింగంపల్లి ఇంచార్జిలు కట్టా వెంకటేష్‌ గౌడ్‌, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఆషా, వాణి, లక్ష్మి, శైలజ, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు