Tuesday, October 3, 2023

నేటి తరానికి ఆదర్శం .. ధర్మబిక్షం సేవాభావం..

తప్పక చదవండి

ఆయన స్వాతంత్య్ర సమర యోధులు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు. నిజాం వ్యతిరేక ఉద్యమ కారులు. నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ప్రజా మద్దతుతో ఎన్నికై, అత్యంత సామాన్య జీవితం గడిపిన అసామాన్య నాయకులు. ఆయనే బొమ్మగాని ధర్మబిక్షం.. బొమ్మగాని ధర్మబిక్షం యువకుడిగా విద్యార్థి నాయకులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఆర్య సమాజ్‌ బాధ్యులు. ప్రజా జీవితమే పరమావధిగా ఆజన్మ బ్రహ్మచారిగా గడిపిన ఆదర్శ నాయకులు. సామా జిక సేవకునిగా, గ్రామీణ పేదల హక్కుల కోసం పోరాటం, యువత, విద్యార్థులు అసంఘటిత కార్మికుల సంఘటితం, పేదలకోసం భూమి, ఇళ్ళు కొనుగోలు లాంటి కార్యక్రమా లలో అకుంఠిత కార్యదీక్ష, అంకిత భావంతో నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేశారు.ఆయన నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్‌, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో జన్మించారు. బొమ్మ గాని ధర్మబిక్షం తండ్రి చిన్నవయస్సులో సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు. ధర్మభిక్షం సూర్యాపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచు కున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్స వాలు జరపాలన్న ప్రధానోపాధ్యా యుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్క రించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. సోవియట్‌ సోషలిస్ట్‌ విప్లవం, భారత దేశంలో జరిగిన అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు నల్గొండ జిల్లాలో మొదటి కమ్యూనిస్ట్‌ సెల్‌ను స్థాపించడానికి ధర్మభిక్షంను ప్రేరేపించాయి. అలా 1942లో సీపీఐలో చేరి,కమ్యూనిస్టు పార్టీతో అనుబంధాన్ని ఏర్పరచుకుని, ధర్మభిక్షం పార్టీలో పనిచేస్తూనే పాత్రికేయులుగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండల్లో పనిచేశారు. నిజాంపై సాయుధ పోరాటం మొదలైన తర్వాత తుపాకి చేత బట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధ పోరాటాన్ని విస్తరింప జేశారు. దేశ్‌ముఖ్‌ వ్యతిరేక పోరాటంలో భాగంగా పేరుమోసిన భూస్వామి విస్నూరు రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా ధర్మభిక్షం విద్యా సంస్థల్లో నిరవధిక సమ్మెను నిర్వహించి,ఏడాదిన్నర పాటు అజ్ఞాత జీవితం గడిపారు. తర్వాత అరెస్టు కాబడి ఐదేళ్లకు పైగా జైలుశిక్షను అనుభవించారు. సూర్యా పేటలో, చంచల్‌ గూడ సెంట్రల్‌ జైలు, ఔరంగాబాద్‌, జాల్నా జైళ్లలో గడిపారు.స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజక వర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభకు 1957లో నకిరేకల్‌ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ లోకసభ నియోజక వర్గం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. 1996 లో 11వ లోక్‌సభ ఎన్నికలలో నల్లగొండ నుండి 480 మంది ఫ్లోరైడ్‌ బాధితులు పోటీ చేసినప్పటికి ఆయన 76 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరి వరకు పోరాడారు. తెలంగాణ ప్రాంతంలో శ్రమ జీవులను సమైక్య పర్చడంలో, పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం పాత్ర మారవ లేనిది. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చు కున్నారు. ధర్మభిక్షం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు.1951-73లో భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ కార్యదర్శిగా, 1952-57, 1957-62, 1962-67 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శాసన సభ్యులుగా, 1972 నుండి ఆంధ్రప్రదేశ్‌ సిపిఐ, కార్యవర్గ సభ్యులుగా, 1991లో 10వ లోక్‌ సభ సభ్యులుగా, 1991-96 సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులుగా.1992-95 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి, సిపిఐ, కార్యవర్గ సభ్యులుగా, 1996 లో 11వ లోక్‌ సభ సభ్యులుగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి సభ్యులుగా పనిచేసిన విశేష అనుభవం గడిరచారు.నిజాం హయాంలో రైతాంగ ఉద్యమంలో పాల్గొని, భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ లో 2019 నవంబర్‌ 8న రోజున బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. ధర్మబిక్షం నీతి, నిజాయితీకి ఆదర్శనీ యుడని ఆయన జీవిత చరిత్రను పాఠ్యాం శంలో చేర్చాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆ సందర్భం గా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. జీవితాంతం ప్రజా సేవకే అంకితమై, సోదరుని కుమారున్ని దత్తత తీసుకుని, అవివాహితులుగానే ఉన్నారు. 89 ఏళ్ళ వయసులో ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బ తగలగా, హైదరాబాద్‌లోని పైవేటు ఆసు పత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపించుకొని, తర్వాత ఊపిరి తిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ 2011, మార్చి 26న మరణించారు. పోరాట యోధుని గా, అసామాన్య ప్రజా సేవకునిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు.

  • రామ కిష్టయ్య సంగన భట్ల…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు