- మహిళా రిజర్వేషన్ బిల్లులో చోటు కల్పించాలి..
- బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి..
- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ..
న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం వాటిల్లినా అది భారతీయ మహిళలకు అన్యాయం చేసినట్టే అవుతుందని అన్నారు. అన్ని అడ్డంకులను తొలగిస్తూ మహిళా బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను చేపడుతూ ఈ బిల్లును తొలుత తన భర్త దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భం తన జీవితంలో ఉద్వేగభరితమైన క్షణమని, అప్పట్లో ఈ బిల్లును రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడించారని, ఆపై ప్రధాని పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించారని గుర్తుచేశారు. ఫలితంగా స్ధానిక సంస్ధల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళలు ఎన్నికవుతున్నారని అన్నారు. రాజీవ్‌గాంధీ కల పాక్షికంగానే నెరవేరిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో సరోజినీ నాయుడు, అరుణ అసఫ్ అలీ సహా ఎందరో మహిళా నేతల కృషిని సోనియా తన ప్రసంగంలో కొనియాడారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియం అని నామకరణం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లు రూపొందింది. అయితే 2026లో చేపట్టే జనగణన అనంతరం తదుపరి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ బిల్లు అమలుకానుంది.