- పటాన్ చెరువు మండలం, లకుడారం గ్రామ ప్రజల బంపర్ ఆఫర్..
- క్రషర్ తో కకావికలం అవుతున్న లకుడారం గ్రామ జనజీవనం..
- కె.ఎస్.ఆర్. మైన్స్ అనుమతులు రద్దు చేయాలంటూ ఆందోళనలు..
- గతంలో మైన్స్ పనులు నిలిపివేసిన.. తిరిగి ఎలా ప్రారంభమయ్యాయి..?
- స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ గామస్తుల తీవ్ర ఆరోపణలు..
- పెద్ద చెరువుకు అతి సమీపంలో నెలకొన్న కె.ఎస్.ఆర్. మైన్స్ వారి క్రషర్..
- క్రషర్ నుంచి వచ్చే కాలుష్యంతో పంటలు, భూగర్భ జలాలు కలుషితం..
- ప్రజలు గ్రామం వదిలే తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం..
- క్రషర్ తొలగించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామంటున్న గ్రామస్తులు..
హైదరాబాద్ : పటాన్ చెరు మండలం, లకుడారం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 744లో సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు కలదు. దీని కింద సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.. 600 రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే చెరువు కట్టకు అతి సమీపంలో సర్వేనెంబర్ 747లో కె.ఎస్.ఆర్. మైన్స్ కు కొంతమంది అవినీతి అధికారులు.. క్రషర్ యజమాన్యం వారితో లోపాయకారి ఒప్పందం చేసుకొని.. ప్రభుత్వం ఏర్పర్చిన నిబంధనలను అతిక్రమించి అనుమతులు ఇచ్చారు. ఈ క్రషర్, క్వారీ ఏర్పాటు వల్ల చెరువు కట్ట పూర్తిగా ధ్వంసం అవుతుందని ఆందోళన వ్యక్తం అయ్యింది.. కాగా గతంలో ఇదే స్థలంలో చెరువు కట్టకు గండి పడింది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు, రైతులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో, నీటి పారుదల శాఖ, గనులు, భూగర్భల శాఖ, పటాన్ చెరువు తహసిల్దార్ కు పలుమార్లు కలిసి రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన పటాన్ చెరువు తహసిల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ తో సర్వే నిర్వహించి.. ఒకవేళ ప్రమాదం ఉన్నట్లయితే వెంటనే అక్కడ పనులను నిలిపివేస్తామని గ్రామస్తులకు మాట ఇచ్చారు. అనంతరం ఆర్.ఐ. సంబంధిత స్థలాన్ని పరిశీలించి, గ్రామస్తుల ఎదురుగానే తహసిల్దార్ కు ప్రమాదం ఉందని ఫోన్ లో వివరించారు. దీన్ని ఆధారంగా చేసుకుని తహసిల్దార్ పనులు ఆపివేస్తున్నామని గ్రామస్తులతో తెలపడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు.. అదే స్థలంలో తిరిగి కె.ఎస్.ఆర్. మైన్స్ వారు పనులు ప్రారంభించారు. తహసిల్దార్ కు అక్రమ మైనింగ్ పై గ్రామస్తులు పూర్తి వివరాలు వివరిస్తుండగానే.. ఇది మా పరిధి కాదు, మైనింగ్ వారిని కలవాలని తెల్పడం, అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరం. ఎన్నిసార్లు తాసిల్దార్ కార్యాలయానికి వెల్లినా సమయం ఇవ్వడం లేదు. ఫోన్ లో సంప్రదిస్తే, ఫోన్ తీయడం లేదు. కనుక తమ గ్రామ పెద్దచెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న కె.ఎస్.ఆర్. మైన్స్ కు సంబందించిన క్వారీ, క్రషర్ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు..
కె.ఎస్.ఆర్. సంస్థకు మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోతే కలిగే దుష్పరిణామాలు ఇలా ఉంటాయి:
1) పెద్ద చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. 2) పెద్దచెరువు తెగిపోతే చుక్క నీరు లేక రైతులు పంటలు పండించుకోలేకపోతారు. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. దుమ్ము, ధూళితో పంటలు పండించుకోలేకపోతున్నారు. 3) భూగర్భజలాలు అంతరించి పోయి గ్రామంలో ఉన్న బోర్ బావులు ఎండిపోయి చుక్క నీరు లేకుండా పోతాయి.. 4) చేపలు ఉత్పత్తి చేసే వారు తమ జీవనోపాధి కోల్పోతారు. 5) పక్షులు, మేకలు, గొర్రెలు, బర్రెలు లాంటి జంతువులకు తాగడానికి నీరు దొరకదు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నీరు లేక, ఉపాధి లేక జన జీవనం అస్తవ్యస్తం అయ్యే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వారంతా భవిష్యత్తులో ఊరు విడిచిపెట్టే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. కావున గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, ఉద్యోగులు, అందరూ సంఘటితమై శాంతియుతంగా చేస్తున్న దీక్షకు తమవంతు సహాయ సహాకారాలు అందించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిశ్చయించుకున్నారు. కె.ఎస్.ఆర్. మినింగ్స్ అనుమతులు రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని.. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా.. గ్రామస్తులకు ఎలాంటి సహాయాన్ని అందించకుండా.. అక్రమంగా మైనింగ్ చేస్తున్న యజమాన్యంతో తన స్వలాభం కోసం మౌనంగా ఉన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేయవలసిన నాయకుడు ప్రేక్షక పాత్రలో ఉండడం అత్యంత బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై తక్షణమే స్పందించి.. వెంటనే క్రషర్ అనుమతులను రద్దు చేయాలని.. లేనిచో రాబోయే ఎన్నికలలో ఓటుతో సమాధానం చెప్తామని గ్రామస్తులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు..