Sunday, May 19, 2024

స్వదేశానికి వెళ్లి పోయిన షకీబ్‌

తప్పక చదవండి

వన్డే ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. నెదర్లాండ్స్‌, ఆఫ్గనిస్తాన్‌ జట్లు పెద్ద టీమ్‌ లపై గెలిచి సంచలనాలు సృష్టిస్తుంటే బంగ్లా మాత్రం వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా నాలుగింటిలో పరాజయం పాలై సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ప్రపంచ కప్‌ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్‌ తన చివరి మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ మరుసటి రోజు షకీబ్‌ ఢాకా చేరుకుని నేరుగా అక్కడి షేర్‌-ఎ-బంగ్లా నేషనల్‌ స్టేడియానికి వెళ్లాడు. అక్కడ షకీబ్‌ మూడు గంటల పాటు ప్రాక్టీస్‌ చేశాడు. అయితే తన గురువు నజ్ముల్‌ అబెదిన్‌ ఫహీమ్‌ను కలవడానికి షకీబ్‌ ఢాకా వెళ్లాడని తెలుస్తోంది. షకీబ్‌ మూడు రోజుల పాటు ఢాకాలోనే ప్రాక్టీస్‌ చేస్తాడని ఫహీమ్‌ తెలిపాడు. దీని తర్వాత మళ్లీ కోల్‌కతాకు చేరుకుంటారని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్‌ తన తదుపరి రెండు మ్యాచ్‌లను కోల్‌కతాలో ఆడనుంది. ముందుగా అక్టోబర్‌ 28న నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. అలాగే అక్టోబర్‌ 31న పాకిస్థాన్‌ తో తలపడనుంది. బంగ్లాదేశ్‌ జట్టుకు ఈ రెండు మ్యాచ్‌ లు చాలా కీలకం. సెమీ ఫైనల్‌ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది. ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బ్యాటింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతను నాలుగు మ్యాచ్‌లు ఆడాడు కానీ ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. న్యూజిలాండ్‌పై చేసిన 40 పరుగులే అత్యధికం. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఆ ఆజట్టు సెమీస్‌ చేరాలంటే మిగతా అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధించాల్సి ఉంది. అలాగే నెట్‌ రన్‌ రేట్‌ పైనా దృష్టి పెట్టాల్సి ఉంది. వీటితో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా బంగ్లా దేశ్‌ సెమీస్‌ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు