- నకిలీ సర్టిఫికెట్లతో నయా దందా..
- కారుణ్య నియామకాలలో అధికారుల కక్కుర్తి..
- సంక్షేమ శాఖలో ఇది షరా మాములేనా.. ?
- కులం కార్డు చూపెడితే కొలువుల్లో ప్రమోషన్ లు.
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు..
- చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు..
హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖలో నకిలీ కొలువుల జాతర యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆ శాఖ అధికారులే బరితెగించి కేటుగాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేయడమే కాకుండా జిల్లా ఉన్నతాధికారులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆ శాఖలోని అన్ని విభాగాల్లో కొంతమంది అధికారులు అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఏ ఒక్క ఉద్యోగి కూడా ప్రశ్నించకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మరీ వీరి దందా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సాంఘిక సంక్షేమ శాఖలో నకిలీ కొలువులు, అక్రమ డిప్యుటేషన్లు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వంటి అనేక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ శాఖలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతుపై ఏ ఒక్కరు కూడా దృష్టి పెట్టకుండా, ఆ శాఖ అధికారులు జాగ్రత్త పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఫేక్ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న కేటుగాళ్ళు :
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో నకిలీ సర్టిఫికెట్లతో పలువురు ఉద్యోగస్తులుగా చలామణి అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 సంక్షేమ వసతి గృహాలు ఉండగా, వీటి పరిధిలో దాదాపు 15 మంది ఉద్యోగులు ఫేక్ సర్టిఫికెట్లతో కొలువులు చేస్తున్నారు. జిల్లాలోని పలు వసతి గృహాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో హెచ్ డబ్ల్యు ఓ. లుగా పదోన్నతి పొందారు. సీనియారిటీ మీద కొందరు 4వ తరగతి ఉద్యోగులు ప్రమోషన్ తీసుకున్న సందర్భంలో, మరికొందరు కేటుగాళ్ళు నకిలీ యూనివర్సిటీల ద్వారా సర్టిఫికెట్ సంపాదించి పదోన్నతులు పొంది దర్జా వెలగబెడుతున్నారు. వాస్తవానికి హెచ్ డబ్ల్యు ఓ. గా పదోన్నతి పొందాలంటే ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి. కానీ దొడ్డిదారిన పదోన్నతులు పొందిన ఉద్యోగులు మాత్రం ఏనాడు లాంగ్ లీవ్ పెట్టలేదు.. సరికదా, పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందిన దాఖలాలు లేవు. కానీ దాదాపు 15 మంది ఉద్యోగులు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందటం, మిగిలిన ఉద్యోగులకు మింగుడు పడటం లేదు. ఈ తంతు కాస్త ఆ శాఖ ఉన్నతాధికారుల కనుసనల్లోనే జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతుంది.
కారుణ్య నియామకాల్లో బంధువులకు పెద్దపీట :
సాంఘిక సంక్షేమ శాఖలో జరిగిన కారుణ్య నియామకాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వసతి గృహాల్లో నియామకాలు చేపట్టే సందర్భంలో బంధువులకు ఒక రకంగా, మిగిలిన వారికి ఒకరకంగా పోస్టింగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఆ శాఖలో పనిచేస్తున్న హెచ్ డబ్ల్యు ఓ. స్థాయి ఉద్యోగి మరణించిన సందర్భంగా అతని భార్య కూడా అదే పోస్టును ఇచ్చి బంధుప్రీతిని చూపించుకున్నట్లు తెలుస్తుంది. మరో చోట అదే శాఖలో పనిచేస్తూ మరణించిన హెచ్ డబ్ల్యు ఓ. కుటుంబంలోని వ్యక్తికి మాత్రం అదే స్థాయి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ కుటుంబంలో వ్యక్తికి విద్యార్హతలు మెండుగా ఉన్నప్పటికీ సాధారణ పోస్టింగ్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్లో ఉన్నతాధికారుల బంధువులు ఉంటే ఒక రకంగా, మిగిలిన వారిని మరో రకంగా చూస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది.
కులం కార్డు ఉంటే డిప్యూటేషన్ పక్కా :
సాంఘిక సంక్షేమ శాఖలో కుల ప్రాతినిధ్యం భారీగా పెరిగిపోతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంస్కృతికి ఆ శాఖ ఉన్నత అధికారులు ఆజ్యం పోస్తున్నారు. అడిగిన చోటికి బదిలీ కావాలన్నా, డిప్యూటేషన్ కావాలన్నా అదే క్యాస్ట్ ఉద్యోగులు ఉంటే సరిపోతుంది అనే భావన ఈ మధ్యకాలం బాగా వినిపిస్తోంది.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఉద్యోగులకు డిప్యూటేషన్ కల్పించిన సంఘటన ఈ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
చేతివాటంతో అన్ని సక్రమాలే :
సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అక్రమాలకు చేతివాటంతో సక్రమాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను కాపాడాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే అనే అంశం సాధారణంగా మారిపోయింది. విధులకు డుమ్మా కొట్టినా, వసతి గృహాల్లో అక్రమాలు బయటికి వచ్చినా, భవన నిర్మాణాలలో అక్రమాలు వెలుగు చూసినా స్లాబులవారీగా ధరలు నిర్ణయించి డబ్బులు దండుకోవడంలో సిద్ధస్తులయ్యారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై ఏకంగా ఆ శాఖ రాష్ట్ర అధికారులను, జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించి, అవసరమైతే రాజకీయంగా అధికార పార్టీ కార్డు వాడుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెడితే విస్తుపోయే విషయాలు బహిర్గతం కానున్నాయి..
తప్పక చదవండి
-Advertisement-