Friday, July 26, 2024

నార్సింగి మున్సిపాలిటీలోఅరాచకం..

తప్పక చదవండి
  • పైసల్ కొట్టుకో.. అక్రమనిర్మాణాలు కట్టుకో..
  • మున్సిపల్ లో విచ్చలివిడిగా సెల్లార్లు, కమర్షియల్ నిర్మాణాలు..
  • అనతికాలంలోనే రూ. 50 లక్షల పైగా వెనుకేసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి..
  • సేఫ్ జోన్ లో ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ..
  • మచ్చుకైనా కనిపించని ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు..
  • వేలాది మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్, పేయింగ్ గెస్టులుగా ఈ హాస్టల్స్ లోనే..
  • తగలబెడితే అంతే సంగతులు.. వారి ప్రాణాలు గాల్లో దీపాలేనా..?
  • మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టింపేది..?
  • చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి..?
  • సి.డీ.ఎం.ఏ. దృష్టి సారించాలంటున్న స్థానికులు..

పైసల్ కొట్టు.. అక్రమనిర్మాణాలు చేపట్టు అనే కాన్సెప్ట్ లో వట్టినాగులపల్లి, గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.. అనతికాలంలోనే రూ. 50 లక్షలకు పైగా వెనుకేసుకేసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి సేఫ్ జోన్ లో ఉండేందుకు ముందుస్తుగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటోంది ఆరోపణలు ఈ ప్రాంతంలో జోరుగా వినిపిస్తున్నాయి.. సెల్లార్లు కాకుండా ఏడు నుంచి ఎనిమిది అంతస్తులు కమర్షియల్ నిర్మాణాలు చేస్తూ, సెట్ బ్యాక్ లు లేకుండా నిరభ్యంతరంగా సాగిస్తున్నారు… ఫైర్ సేఫ్టీ ఏఒక్క బిల్డింగ్ కు మచ్చుకైనా లేకపోవడంతో తగలబడితే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని బహిరంగ చర్చ జరుగుతోంది.. నిస్సిగ్గుగా పేట్రేగిపోతున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి ‘పావనీ రావు’ పై డీ.ఎం.ఏ. కమిషనర్ ‘పమేలా సత్పతి’ దృష్టి సారించి బహిరంగ విచారణ చేపట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వట్టినాగుల పల్లి, గౌలిదొడ్డి అడ్డాగా విచ్చలవిడిగా అక్రమనిర్మాణాలు సాగిస్తూ నిర్మాణదారులు బరితెగిస్తున్నారు.. వట్టినాగుల పల్లి ప్రధాన్ కన్వెన్షన్ హాలు పక్కన పబ్బు ఏర్పాటుకు భారీ ఎత్తున అక్రమ నిర్మాణం దానిపక్కనే రెండు ఎకరాల్లో ఇరన్ స్ట్రక్చర్ తో రెండు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలకు సన్నాహాలు, అలాగే గౌలిదొడ్డిలో సాయి తులసి లే అవుట్ లో సుమారు 10 అక్రమ నిర్మాణాలు, సర్వే నెంబర్ 218లో మరో ఆరు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుపెట్టుకుని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిణి ‘పావనీ రావు’ తన ప్రైవేట్ సైన్యంతో రెండు నెలల వ్యవధిలోనే సుమారు రూ. 50 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడిందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.. పైసలు తీసుకుని మాకు నోటీసులు ఎలా జారీ చేస్తారని నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వారిని సముదాయించి ముందస్తుగానే నోటీసులు జారీ చేయడంతో ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పుకునేందుకే తప్ప నిర్మాణాలను కూల్చేందుకు కాదని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశామని, దాంతోపాటు జిల్లా టాస్క్ ఫోర్స్ (డీ.టి.ఎఫ్.) అధికారులకు అక్రమనిర్మాణాలను కూల్చేందుకు లేఖలు రాశామని మభ్యపెడుతున్నట్లు వారు ఆరోపించారు. గత నాలుగు నెలల వ్యవధిలో ఎన్ని డీ.టి.ఎఫ్. లేఖలు రాశారు..? వారు ఎన్నింటికి స్పందించారు..? ఎన్ని బిల్డింగులను కూలగొట్టారు..? అసలు రంగారెడ్డి జిల్లాలో డీ.టి.ఎఫ్. కార్యాలయం ఎక్కడుందో చెప్పండి.. అక్కడే స్వయంగా మేమే ఫిర్యాదు చేస్తామంటూ ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.. టౌన్ ప్లానింగ్ అధికారిణి నోటీసులు జారీచేశామనే సాకుతో కాలయాపన చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.. శ్రీధర్ గౌడ్ కూకట్ పల్లి జోన్ లో ఏసీపీగా విధులు నిర్వహిస్తూ, వారంలో కేవలం ఒక్క రోజు నార్సింగి మున్సిపాలిటీపై దృష్టిపెద్దటంతో దీనిని ఆసరాగా తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతా తానై ఏకచత్రాధిపత్యంగా చక్రం తిప్పుతూ అక్రమనిర్మాణ దారులకు కొమ్ముకాస్తోందని బహిరంగ చర్చ జరుగుతోంది..

- Advertisement -

ఏ ఒక్క భవనానికి ఫైర్ సేఫ్టీ లేదు :
సాయి తులసి లే అవుట్, గౌలిదొడ్డిలో వందలాది అక్రమనిర్మాణాలు పుట్టగొడుగుల్లా ఏడు నుండి ఎనిమిది అంతస్తులు, సెల్లార్లు, సెట్ బ్యాక్ లు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు జరిగినప్పటికీ అగ్నిమాపక అధికారుల అనుమతులు తీసుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపిస్తోంది.. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డారని ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం చెప్పటం విస్మయానికి గురిచేస్తోంది.. నిర్మాణ అనుమతులు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ అనుమతులు ఇవ్వడానికి అధికారులు నిరాకరించి ఉండవచ్చునని ఉద్యోగ విరమణ పొందిన ఓ అగ్నిమాపక అధికారి పేర్కొనటం విశేషం.. వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిజేసే వందలాదిమంది యువతీ, యువకులు తల్లిదండ్రులను వదిలి హాస్టళ్లలో ఉంటూ తమ విధినిర్వాహణా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. జరగరాని విపత్తు జరిగి ప్రాణనష్టం జరిగితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని యువత తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు..

ఇప్పటికైనా డీ.ఎం.ఏ. కమిషనర్ పమేలా సత్పతి స్పందించి, అక్రమ వసూళ్లకు తెగబడుతూ అక్రమనిర్మాణదారులకు వంతపాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి పై బహిరంగ విచారణ జరిపించి ఇక్కడ జరుగుతున్న అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అలాగే వందలాది బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని దృష్ట్యా, నిర్మాణదారులకు జరిమానా విధించైనా సరే వారికి ఫైర్ సేఫ్టీ అనుమతులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అమాయకులైన వేలాదిమంది సాఫ్ట్ వేర్ యువతీ, యువకుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు