- ఓటుతోనే రాహుల్, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పాలి
- బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అమిత్ షా బీసీ సీఎం ప్రకటనపై రాహుల్ గాంధీ అవహేళనతో, చులకన భావంతో మాట్లాడారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీసీలను అవమానపరిచారన్నారు. అవకాశం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీసీలు బీజేపీకి దగ్గరవుతారన్న అక్కసుతో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని విమర్శించారు. బీసీలు తమకున్న ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రకటించే తాయిలాల కోసం తాము ఆరాటపడడం లేదని బీసీలు నిరూపించుకోవాలన్నారు. బీసీలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతైన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీసీ వ్యక్తి ప్రధాని అయితే రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను రాహుల్ గాంధీ విరమించుకోవాలని హితవుపలికారు. 1358 ఓబీసీ శాసన సభ్యులు బీజేపీ తరపున గెలిచారని… 160 మందికి శాసనమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణలో ఈనెల 7న సాయంత్రం బీసీల ఆత్మగౌరవ సభ పేరుతో హైదరాబాద్ సభ నిర్వహించనున్నామని.. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని ఎంపీ తెలిపారు. జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి వైదొలగడం కారణంగా బీజేపీ అన్ని సీట్లు సాధించగలిగిందని తెలిపారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో టికెట్ ఆశించిన బీజేపీ అభ్యర్థులు నిరాశ పడవద్దని సూచించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. పదవులు, అవకాశాలు చాలా వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి పొత్తు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరికి మద్దతు ఇస్తుందో ప్రకటించలేదన్నారు. జనసేన ఎన్డీఏ భాగస్వామిగా ఉందని.. పొత్తు ధర్మాన్ని పాటించి సీట్ల సర్దుబాటు చేసుకుంటామన్నారు. నిన్న, మొన్నటి వరకు పార్టీ మారబోనంటూ వివేక్ వెంకటస్వామి స్వయంగా ప్రకటించారని.. ఇప్పుడు ఆయన మనసు మార్చుకుంటే విూరు ఆయన్ని అడగాలని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.