- ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ నినాదం..
- ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు..
- రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు అంటూ ట్వీట్స్..
న్యూ ఢిల్లీ : జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ – ఉత్నా హక్’ అంటూ రాహుల్ గాంధీ అందుకున్న నినాదం అర్థం కూడా అదే. ఎంత జనసంఖ్య ఉంటే అంత హక్కు లభించాలి అన్నది ఆయన మాటల అర్థం. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది. చూడ్డానికి ఇది ‘సమ న్యాయం’ లేదా ‘సహజ న్యాయం’ అన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేంద ప్రమాదకారి. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాటల్లో చెప్పాలంటే ఇది నిప్పుతో చెలగాటం. అవును.. ఈ నినాదం ఇది దేశాన్ని కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించి వారి మధ్య అగ్గి రాజేస్తుంది. ఇది అల్పసంఖ్యాక వర్గాలతో పాటు జనాభా నియంత్రణ పాటించి దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన రాష్ట్రాల పాలిట గొడ్డలి పెట్టులా మారుతుంది. మొత్తంగా దేశంలో సమతుల్యతను, ఐక్యతను దెబ్బతీస్తుంది. కేవలం కిరెన్ రిజుజు వంటి రాజకీయ నాయకులే కాదు, సిద్ధార్థ్ లూత్రా వంటి ప్రఖ్యాత న్యాయవాదులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు.. ’జిత్నీ అబాదీ-ఉత్నా హక్’ అంటూ ఆయన చేస్తున్న నినాదం భారతదేశాన్ని చంపేస్తుంది.. అరుణాచల్ ప్రదేశ్, హిమాలయ ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ వంటి రాష్ట్రాలు, జనాభా తక్కువగా ఉన్న వేలాది చిన్న చిన్న సమూహాలు అన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది.. కష్టతరమైన సరిహద్దు ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవు. ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రజలు కఠినమైన పర్వతాలు & ప్రతికూల ప్రాంతాలలో నివసించగలరు.. భారతదేశంలోని ఇలాంటి అల్పసంఖ్యాక వర్గాలకు దేశ నిర్మాణంలో ఎప్పటికీ అవకాశం లభించదు. అధికారం కోసం ఎవరైనా ఇంతలా వ్యవహరిస్తారా?” అంటూ మండిపడ్డారు.