Tuesday, May 14, 2024

భారత్‌పై కెనడా ప్రధాని తీవ్ర వ్యతిరేకత

తప్పక చదవండి

న్యూఢిల్లీ : భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందంటూ ఇటీవలే ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్‌`కెనడా మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. అయితే, భారత్‌ విషయంలో ట్రూడో ముందు నుంచే వ్యతిరేక భావజాలంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవలే న్యూ ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ఓ సంఘటన తాజా పరిస్థితులకు బలం చేకూరుస్తోంది. భారత్‌ నాయకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు ఈ నెల 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢల్లీిలోని భారత్‌ మండపంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాధినేతలకు కేంద్రం గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. అతిథుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్లోబల్‌ లీడర్‌కు పూర్తి భద్రతా ప్రొటోకాల్‌లతో ప్రెసిడెన్షియల్‌ సూట్‌తో కూడిన వీవీఐపీ హోటళ్లలో బస ఏర్పాటు చేసింది. ట్రూడోకు కూడా ఢిల్లీ లోని లలిత్‌ హోటల్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో బస ఏర్పాటు కల్పించింది. అయితే, అందులో ఉండేందుకు కెనడా ప్రధాని నిరాకరించినట్లు కేంద్ర వర్గాలు తాజాగా వెల్లడిరచాయి. తనకోసం బుక్‌ చేసిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ట్రూడో బస చేయలేదని తెలిపాయి. బదులుగా భారత్‌లో ఉన్నంత సేపూ ఆయన అదే హోటల్‌లోని ఓ సాధారణ గదిలో బస చేసినట్లు పేర్కొన్నాయి. మరోవైపు జీ20 సమ్మిట్‌ సందర్భంగా ట్రూడోకు ఎన్నో షాకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా సదస్సులో ఆయన వ్యవహార శైలి ముందు నుంచీ అంటీముట్టనట్టే ఉంది. సదస్సు తొలిరోజు రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు కూడా ఆయన హాజరు కాలేదు. దీనికి కారణం చెప్పేందుకు కూడా కెనడా ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలోనూ ట్రూడో ఎవరితోనూ పెద్దగా కలవలేదు. దీంతో ప్రధాని మోదీ ఆయన్ను చేయి పట్టుకొని అక్కడి విశేషాలను వివరించేందుకు ప్రయత్నించినా.. ట్రూడో సున్నితంగా చేయి వెనక్కి తీసుకున్నారు. ఇక జీ20 చివరి రోజు మోదీతో ద్వైపాక్షిత సమావేశం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ భేటీలో మోదీ నేరుగా ట్రూడో వద్దే భారత్‌ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని ప్రస్తావించారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు కూడా. ఇక భారత్‌ పర్యటన ముగించుకొని కెనడా బయలు దేరే చివరి క్షణంలో ట్రూడో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మరో రెండు రోజులు ట్రూడో సహా ఆ దేశ ప్రతినిధులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారు తిరిగి కెనడా వెళ్లేందుకు వీలుగా భారత్‌ తన ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ విమానాన్ని వినియోగించుకోవాలని సూచించింది. అయితే, భారత్‌ సాయాన్ని కెనడా తిరస్కరించింది. చివరికి సుమారు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడా బయలుదేరి వెళ్లారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు