Friday, July 19, 2024

అక్రమ నిర్మాణానికి ఫైర్ ఎన్.ఓ.సి..!

తప్పక చదవండి
  • లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు..
  • ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం..
  • కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం..
  • రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన..
  • సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం..
  • జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్ చేయకుండా నిర్మాణం..
  • ఫైర్ ఎన్.ఓ.సి. ఎలా సాధ్యం అయ్యిందో ఆ పెరుమాళ్ళకే ఎరుక..
  • తెలంగాణ రాష్ట్రంలో డబ్భులు పడేస్తే ఏదైనా సాధ్యమేనా..?

అనుమతులు ఒక రకంగా ఉంటాయి.. నిర్మాణాలు మరో రకంగా ఉంటాయి.. ఇంత జరుగుతున్నా సంబంధిత కొందరు అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు.. కారణం లంచాల మత్తులో వారు జోగుతుంటారు.. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారుల తీరు పెను ప్రమాదాలకు దారితీస్తోంది.. నగరంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరగడం మనం చూసాం.. క్షణాల్లో కూలిపోయి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించిన అక్రమ నిర్మాణాల భాగోతం మన కళ్ళముందే ఎన్నెన్నో జరిగాయి.. కానీ అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.. ఇలాంటి అక్రమ నిర్మాణమే గచ్చిబౌలిలో వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలి.. ఇక్కడ ఐటీ కంపెనీలు ఎన్నో నెలకొని ఉన్నాయి.. కొన్ని వేలమంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తుంటారు.. కాగా రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలానికి చెందిన గచ్చిబౌలి, సర్వే నెంబర్ 28లో లే అవుట్ నెంబర్ : బీ/1373/2017 లో కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ వారు.. జీ.హెచ్.ఎం.సి. నుంచి 1/సీ 0/14638/2018.. తేదీ : 09/09/2018 ప్రకారం నిర్మించిన బిల్డింగ్ నిర్మాణంలో అక్రమ సెల్లార్ తో, ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారు.. అయితే విచిత్రంగా ఈ నిర్మాణానికి అధికారులు ఫైర్ సేఫ్టీ ఎన్.ఓ.సి. జారీ చేయడం ఒక తప్పిదం అయితే.. నిర్మాణదారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం మరో తప్పిదం..

- Advertisement -

కాగా సదరు బిల్డర్ తో లోపాయికారి ఒప్పొందం చేసుకున్న కొందరు అధికారులు ఫైర్ సేఫ్టీ ఎన్.ఓ.సి. ని నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారు.. ఇది ఎంత ప్రమాదకరమో అన్న విషయం ఆ అధికారులకు తెలియదా..? తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్న వారికి ఇది పెద్ద విషయం లాగా కనిపించడం లేదా..? అంతే కాకుండా జీ.హెచ్.ఎం.సి. వారు జారీ చేసిన అనుమతుల ప్రకారం భవనం ఎత్హు 14.99 మీటర్లు ఉండాల్సి ఉండగా.. బిల్డర్ మాత్రం 17.10 మీటర్లు పెంచి నిర్మాణం సాగించడం.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండా నిర్మించడం అత్యంత దారుణం.. అయితే ఈ విషయాలు పరిశీలించి జీ.హెచ్.ఎం.సి. వారు మొదట ఎన్.ఓ.సి. ఇవ్వడానికి నిరాకరించారు.. అయితే సదరు బిల్డర్ పెద్ద మొత్తంలో ఆశజూపి అధికారులను లోబరుచుకుని, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందడానికి ఫైర్ ఎన్.ఓ.సి. అక్రమంగా తెచ్చుకోవడం జరిగింది..

కనుక ఉన్నతాధికారి అయిన చీఫ్ సిటీ ప్లానర్ తక్షణమే స్పందించి, సదరు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి, పూర్తిగా తనిఖీ చేసి, జీ.హెచ్.ఎం.సి. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలుపుదల చేసి, ఫైర్ ఎన్.ఓ.సి. ని రద్దుచేసి, ఈ అక్రమ భవనాన్ని తక్షణమే సీజ్ చేసి, అదనంగా నిర్మించిన సెల్లార్ ను పూడ్చివేయాలని, అంతే కాకుండా ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చును పూర్తిగా సదరు బిల్డర్ నుంచి వసూలు చేయాలని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని, ఈ అక్రమ నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన సంబంధిత ప్రభుత్వ అధికారుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని.. ఇక మీదట వేరే బిల్డర్స్ ఎవరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా.. ఏ అధికారి కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కట్టడి చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు