Sunday, April 28, 2024

మహిళా రూపంలో మహమ్మారి..

తప్పక చదవండి
  • ఎంఎన్‌జే ఇంచార్జ్‌ జయలత చేస్తున్న అవినీతి లీలలు
  • ప్రైవేట్ మెడిక‌ల్ క‌ళాశాల విద్యార్థుల నుండి న‌గ‌దు వ‌సూలు
  • భారీగా ఆరోగ్య శ్రీ నిధులు దుర్వినియోగం
  • ట్రస్ట్ నుంచి విడుదలైన నిధులు.. ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం
  • కోట్ల రూపాయాలకు లెక్కలు చెప్పని వైనం
  • యూజర్ ఛార్జీల పేరుతో రోగులకు తప్పని వేధింపులు
  • చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డ‌ని మిషనరీల కొనుగోలు..
  • ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ..
  • జ‌య‌ల‌త‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై తాత్స‌ర్యం ఎందుకు…?
  • ఆదారాలున్న చ‌ర్య‌లు తీసుకోని మంత్రి దామోదర రాజనర్సింహ ?

దైవ్యం కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌లు ఆరాదించేది ఒక్క డాక్ట‌ర్‌ను మాత్ర‌మే.. కానీ అలాంటి డాక్ట‌రే ప్ర‌జ‌ల పాలిట య‌మ‌కింక‌రుడైతే ఆ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి.. స్థాయిని మ‌ర్చి ఎంఎన్‌జే ఇంచార్జ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న జ‌య‌ల‌త అవినీతిపై పూర్తి ఆధారాల‌తో ఆదాబ్ హైద‌రాబాద్ వార్త క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. ఇంచార్జ్ డైరెక్ట‌ర్ గ‌త ప్ర‌భుత్వాల‌కు ఊడిగం చేసి అంతులేని అక్ర‌మాలు చేసి అవినీతి సొమ్మును మూట‌క‌ట్టి, అప్ప‌టి ప్ర‌భుత్వంలోని కొంద‌రి అవినీతి పెద్ద‌ల‌కు ముట్ట‌జెప్పింది. ఆ ఆర‌చకాలు నూత‌నంగా ఏర్ప‌డ్డ‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేసి అవినీతి అధికారి అయిన ఇంచార్జ్ డైరెక్ట‌ర్ జ‌య‌ల‌త‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని స‌ర్వ‌త్రా భావించారు. కానీ, ప్ర‌స్తుత ఆరోగ్యశాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా పూర్తిగా ఎంఎన్‌జే అక్ర‌మాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన అధికారికి కొన‌సాగించ‌డం శోచ‌నీయం. జ‌య‌ల‌త చేసిన మ‌రో అవినీతి కోణం మీ ముందు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మెడిక‌ల్ క‌ళాశాలల విద్యార్థులు క్యాన్స‌ర్ వ్యాధిపై అవ‌గాహ‌న (పోస్టింగ్) కొర‌కు ఎంఎన్‌జే ఆస్ప‌త్రికి ప్ర‌తి నెలా సుమారు 15 నుండి 20 మంది విద్యార్థులు వ‌స్తుంటారు. అయితే ఇక్క‌డ ఒక్కొక్క మెడిక‌ల్ విద్యార్థి నుండి న‌గ‌దు రూపంలో రూ. 10వేలు (రిసిప్ట్ నెం. 944, తేది 15-2-2024) వ‌సూలు చేస్తున్నారు. ఈ విధంగా న‌గ‌దు రూపంలో ఎంత‌కాలం నుండి వ‌సూలు చేస్తున్నారు..
వ‌సూలు చేసిన ఈ మొత్తాన్ని హెచ్‌డిఎస్ (హాస్పిట‌ల్ డెవ‌లపెమెంట్ సొసైటీ)లో జ‌మ చేయాలి. ఆ నిధులు హాస్పిట‌ల్ అభివృద్ధికి ఉప‌యోగించాలి. ఈ సొసైటీకి జిల్లా క‌లెక్ట‌ర్ చైర్మ‌న్‌గా విధులు నిర్వ‌ర్తిస్తారు. కానీ, ఇక్క‌డ వ‌సూలు చేసిన న‌గ‌దు వివ‌రాలు ఆడిట్‌లో చూప‌లేద‌ని స‌మాచారం. ఈ న‌గ‌దును హాస్ప‌ట‌ల్ అభివృద్ది కొర‌కు ఉప‌యోగించారా..? లేక దారి మ‌ళ్లించారా..? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

నైజాం హయాంలో క్యాన్సర్ రోగుల కోసం అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఎంఎన్‌జే ఆసుపత్రి స్థాపించగా.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ గా మారింది. ఆసుపత్రికి ఉన్న పాపులారిటీ దృష్ట్యే ఇక్కడకు అనేక మంది పేద ప్రజలు ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందేందుకు వస్తుంటారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ఆసుపత్రికి భారీగా ఆరోగ్య శ్రీ ద్వారా నిధులు విడుదలయ్యాయి. అయితే గ‌త ప్ర‌భుత్వంలో విడుద‌లైన ఆరోగ్య శ్రీ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నిధుల నిర్వాహణలో కూడా ఆసుపత్రి యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఆరోగ్య శ్రీ నిధులను దుర్వినియోగం చేసేందుకు నిబంధనలను ఎంఎన్‌జే యాజమాన్యం తుంగలో తొక్కేసింది. అటు ఆరోగ్య శ్రీ ట్రస్ట్.. ఇటు ఎంఎన్‌జే యాజమాన్యం ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం బట్టబయలైంది.

అంటే గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ద్వారా ఎంఎన్‌జే ఆసుపత్రికి రూ.92,49,51,013 కోట్ల నిధులు విడుదల కాగా.. ఎంఎన్‌జే ఆసుపత్రి ప్రకటించిన వివరాలు ప్రకారం మాత్రం ఈ ఐదేళ్లలో ఆ హాస్పిటల్ కు ట్రస్ట్ ద్వారా రూ.41,01,87,497 కోట్లే వచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్న మాట. అయితే మిగతా రూ.51,47,63,516 కోట్లు ఎక్కడ పోయాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నిధులు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. ఇక నిధుల వివరాల కోసం ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే రెండేళ్ల తర్వాత ఆర్టీఐ కమిషనర్ ఆదేశిస్తే తప్ప వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చే ఆరోగ్య శ్రీ రోగులకు అందజేసే మందుల విషయంలోనూ పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందుల ఖర్చు కూడా ఆకస్మాత్తుగా పెంచి చూపించారు. 2017-18లో మందుల కొనుగోలు కోసం రూ.కోటి ఖర్చు చేయగా ..2018-19లో రూ.03 కోట్ల 20 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఒక్క ఏడాదిలోనే మందులపై అయిన ఖర్చులు రూ.2 కోట్ల 20 లక్షలకు చేరుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఉద్యోగుల‌ జీతాల చెల్లింపునకు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. జీతాల చెల్లింపునకు ఆరోగ్య శ్రీ నిధులు ఎందుకు వెచ్చించారనేది అర్థం కాని పరిస్థితి. అయితే జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ.. ఎందుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ డబ్బులను ఎంప్లాయిస్ శాలరీస్ కోసం మళ్లించాల్సిన అవసరం ఏర్పడిందనే తెలియడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా యూజర్ ఛార్జీల వసూళ్లు..

ఆరోగ్య శ్రీ రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచిత వైద్యం అందించాలి. కానీ, ఎంఎన్‌జే యాజమాన్యం మాత్రం పేద రోగుల నుంచి రూ.300 నుంచి 3 వేల వరకూ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ట్రిట్ మెంట్ పూర్తైన తర్వాత ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం చెబుతోంది. యూజర్ ఛార్జీలు వసూలు చేయడమేందుకు.. తిరిగి వారికి చెల్లించడమేందుకు అనే దానిపై మాత్రం ఆసుపత్రి వర్గాల వద్ద సమాధానం లేదు. ఎంఎన్‌జే ఆసుపత్రికి ప్రతీఏటా ప్రభుత్వం చేసే కేటాయింపులు, ఆరోగ్య శ్రీ ద్వారా వచ్చే నిధులు, ఆసుపత్రికి దాతలు ఇచ్చే డబ్బులు, ఇతరత్రా రూపాల్లో వచ్చే ఫండ్స్ లోనూ వందల కోట్ల అవినీతి జరిగినట్లే అర్థమవుతోంది. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంఎన్‌జే ఆసుపత్రికి జరిగిన కేటాయింపులు, నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తే అసలు బండారం బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మిష‌నిరీల కొనుగోలులో కూడా ఇంచార్జ్‌ డైరెక్టర్‌ అవినీతి

గత తొమ్మిది సంవత్సరాలుగా ఇంచార్జ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతూ, ఏక పక్షంగా అనేక మిషన‌రీలు కొనుగోలు చేసింది.. క్యాన్సర్‌ హాస్పిటల్‌ లో కొన్న ప్రతి మిషన్‌, క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడేలా ఉండాలి.. కానీ ఈమె క్యాన్సర్‌ స్పెషలిటీకి సంబంధించిన వాళ్ళతో సంప్రదించకుండా కొనుగోలు చేసింది..
ఎంఆర్‌ఐ మిషన్‌ కొన్నప్పటికీ, అది ఆధునిక క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌కు ఉపయోగపడకుండా కేవలం నిర్ధారణ వరకే పరిమితం అయ్యింది.. అలాగే రూ. 20 కోట్ల పెట్‌ స్కాన్‌ మిషన్‌కి సంబంధించి కూడా ఎవరినీ సంప్రదించకుండా, నిమ్స్‌ ఆర్డర్‌ ని కాపీ పేస్ట్‌ చేసి కొనుగోలు చేసి, దానిని కూడా ఆధునిక క్యాన్సర్‌ చికిత్సకు పనికిరాకుండా చేశారు.. ఇలా ఆధునిక క్యాన్సర్‌కి అవసరమైన పరికరాలు కాకుండా, క‌మీష‌న్ల కొర‌కు తన ఇష్టానుసారంగా, పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించకుండా వృధా చేశారు.

ఎంఎన్‌జే ఇంచార్జ్ డైరెక్ట‌ర్ గా గత తొమ్మిది సంవత్సరాలుగా కొన‌సాగుతున్న జ‌య‌ల‌త చేస్తున్న అవినీతిపై ద‌ర్యాప్తు అధికారులు నిధుల గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లు నివేదిక‌లు అందించిన‌ప్ప‌టికి, స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా సేక‌రించిన స‌మాచారంతో ఆరోగ్య శ్రీ నిధులు దారి మ‌ళ్లించార‌ని తేలిన‌ప్ప‌టికి, ఆధునిక‌ క్యాన్స‌ర్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు కొనుగోలు చేయ‌కుండా స్వార్థ ప్రయోజ‌నాల కోసం చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డ‌ని ప‌రిక‌రాలు కొనుగోలు చేసినా, పేద రోగుల నుండి అక్ర‌మంగా యూజ‌ర్ చార్జీలు
వ‌సూలు చేసిన‌ట్లు నిర్ధార‌ణ అయినా, ఎంఎన్‌జే ఆసుప‌త్రిలో క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తున్న జ‌య‌ల‌త అవినీతిపై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని భావించిన‌ప్ప‌టికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం విస్మ‌యానికి గురిచేస్తుంది. ఇప్ప‌టికైనా వాస్త‌వాల ఆధారంగా వెంట‌నే అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ఇంచార్జ్ డైరెక్ట‌ర్ జ‌య‌ల‌త‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేద‌రోగులు కోరుతున్నారు.

ఎంఎన్‌జేలో జ‌రిగిన మ‌రిన్ని అవినీతి బాగోతాల‌పై పూర్తి ఆధారాల‌తో తెర‌మీద‌కు తీసుకురాన్న‌ది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం అవినీతిపై అస్త్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు