Saturday, July 27, 2024

గెలిచిన “మార్పు ” నినాదం

తప్పక చదవండి
  • తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సోనియమ్మకు అంకితం..

‘‘టీపీసీసీచీఫ్‌ రేవంత్‌రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కేసీఆర్‌ను ఆయన భాషలోనే తిడుతూ.. అక్రమలను ఎండగడుతూ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. మరోపక్క పార్టీలోని అసంతృప్త నాయకులను ఏకతాటిపైకి తేవడంలోనూ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పలు సీట్లను గెలుచుకుంది. గతంలో గెల్చి, అధికార బీఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కొత్తగా వచ్చిన పలువురు మహిళలు కూడా విజయం సాధించడంలో రేవంత్‌ రెడ్డి పాత్ర విస్మరించలేనిది.’’

  • కొంపముంచిన కేసీఆర్‌ అహంకారం
  • ఫలించిన రేవంత్‌రెడ్డి వ్యూహం..
  • కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన ప్రజలు
  • పదేళ్ల కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం
  • యువతను, నిరుద్యోగులను విస్మరించి పాలన
  • తెలంగాణ కాంక్షలు నెరవేర్చడంతో విఫలం
  • ప్రజా తీర్పులో స్పష్టమైన సందేశం
  • కామారెడ్డిలో ఘోరంగా ఓటమి చెందిన కేసీఆర్‌
  • కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి ఘన విజయం..
  • పనిచేయని జనసేన మంత్రం
  • అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ..
  • పొటీచేసిన ఒక్క స్థానంలో సీపీఐ విజయం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ తెలుగులో ‘‘మార్పు కావాలి… కాంగ్రెస్‌ రావాలి ‘‘ అని చేసిన నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేసి చూపారు. మార్పు కోరుకుంటూ కాంహయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడిగా మొదలైన సిఎం కెసిఆర్‌ గడచిన పదేళ్ళలో ఆకాశం నుండి పాతాళానికి తన కీర్తి ప్రతిష్ఠలను దిగజార్చుకున్నారు. విపరీతమైన నియంతృత్వ పోకడలతో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల మొదలు, సాటి ఉద్యమకారులను, ప్రతిపక్షాలను చివరికి తనను ఈ స్థాయికి చేర్చిన ప్రజలను విస్మరించి చిన్నచూపు చూడటం అవకాశం దొరికినప్పుడు అవమానించడంతో కెసిఆర్‌ అహంకారంపై ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు చావు దెబ్బ కొట్టాడు. ఓ మోస్తరు నియంతగా మారిన కెసిఆర్‌ కు ప్రజాస్వామ్య పద్దతిలోనే చెంప చెళ్ళుమనిపించారు. కెసిఆర్‌ బీఆరెస్‌ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ బలమైన ప్రత్యర్థిగా బరిలో నిలబడి అధికార పక్షంలోని తప్పొప్పులను ఎండగట్టడంలో విజయం సాధించారు. ఈ క్రతువులో అధినాయకుడు రేవంత్‌ రెడ్డికి, సిఎల్పి నాయకులు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, మధుయాష్కి గౌడ్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి హేమాహేమీల అండదండలతో అంతా ఒక్క జట్టుగా కలసి అద్భుతమైన విజయాన్ని స్వంతం చేసుకున్నారు. సీనియర్‌ లీడర్లు వి.హెచ్‌, జగ్గారెడ్డి, మల్లు రవి, వంటి నాయకులు యువతరానికి అండగా నిలబడ్డారు. కొన్ని సార్లు ఎంతో వ్యూహాత్మకంగా పరిణితి గల నాయకునిగా వ్యవహరించే కెసిఆర్‌ మరి కొన్నిసార్లు మాస్‌ లీడర్‌ అవతారంలో వీధి పోరాటాల స్థాయిలో ప్రత్యర్థులను ట్రాప్‌ చేయడానికి కవ్వింపు ధోరణితో తికమక పెట్టేయడం అలవాటు. కెసిఆర్‌, కెటిఆర్‌ ల వ్యూహ ప్రతి వ్యూహాలను ఛేదించడంలో రేవంత్‌ రెడ్డి తిరుగులేని పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య విపరీతమైన ప్రజాస్వామ్య వాతావరణం వెల్లి విరుస్తుందని చమత్కరిస్తారు. అటువంటి ప్రతికూల వాతావరణాన్ని కూడా చాకచక్యంగా తనకు అనుకూలంగా మలచుకోవడంలో రేవంత్‌ రెడ్డి చూపిన ప్రతిభ ఢల్లీి పెద్దలకు కూడా తలనొప్పి తప్పించిన మాట వాస్తవం. గతంలో కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు యధేచ్చగా బురద జల్లుకోవడం, ఆరోపణలు చేసుకోవడంలో పోటీలు పడేవారు. అటువంటి నాయకులతో సమన్వయం చేసుకుంటూ రేవంత్‌ రెడ్డి ఒక రకంగా ముప్పేట దాడిని చాకచక్యంగా తప్పించుకుంటూ పార్టీ నాయకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడంతో ప్రస్తుతం సీఎం పదవి రేసులో తెరపై రేవంత్‌ రెడ్డి ఒక్కడై వెలిగిపోతున్న మాట వాస్తవం. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా రేవంత్‌ రెడ్డి నియామకం నల్లేరు మీద నడకలా సాగలేదు. అటువంటి అన్ని ప్రతికూలతలు దాటుకుని పార్టీని విజయం ఒడ్డుకు చేర్చిన రేవంత్‌ రెడ్డి కాకుండా మరెవరూ ఆ స్థానాన్ని ఆశిస్తున్న దాఖలాలు సమీపంలో లేకపోవడం ఢల్లీి పెద్దలకు నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి జాప్యం జరిగే పరిస్థితి లేకపోవడం రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చే మరో అంశం.
పదేళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరిగింది. ప్రజలు కోరుకున్న మార్పు వచ్చింది. నియంతగా తయారైన కెసిఆర్‌ను ప్రజలు ఇంటికి పంపారు. మాకొద్దీ దొరతనం అంటూ నినదించారు. ప్రగతిభవన్‌కు, సచివాలయానికి ప్రజలను దూరం చేసిన నియంతను.. వాటికే దూరం చేస్తూ ప్రజలు గట్టి తీర్పును ఇచ్చారు. ఇక ఫామ్‌ హౌజ్‌లో నిరంతరం విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చారు. కెసిఆర్‌ అహంకారంపై అంకుశం దింపారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు అహంకారపూరిత కెసిఆర్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చారు. అధికార బిఆర్‌ఎస్‌ను కేవలం ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అనూహ్యంగా బిజెపి పలుచోట్ల గెలుపొంది తన సంఖ్యను పెంచుకుంది. ఇకపోతే అన్నింటికి మించి కామారెడ్డిలో కెసిఆర్‌ను ఘోరంగా ఓడిరచారు. బహుశా ఎన్నికల చరిత్రలో కెసిఆర్‌కిది తొలి ఓటమిగా గుర్తించాలి. కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో పదివేల పైచిలుకు ఓట్లతో ఓటమి చెందారు. ఇక్కడ పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి ఓటమి చెందినా..కొడంగల్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇకపోతే పలువురు మంత్రులు కూడా ఓటమి చెందారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం పనిచేయలేదు. జనసేన నుంచి పోటీ చేసిన వారంతా ఓటమి చెందారు. సిపిఐ నుంచి కొత్తగూడెం నుంచి పోటీచేసిన కూనంనేని సాంబశివరావు గెలుపొందగా..పాలేరులో పోటీ చేసిన సిపిఐ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘోరంగా ఓటమి చెందారు. ఆయనతో పాటు పోటీచేసిన సిపిఎం అభ్యర్థులంతా ఓటమి చెందగా.. డిపాజిట్లు గల్లంతయాయి. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా స్పష్టమైన తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్‌లో గడ్డం సోదరులు వివేక్‌ వెంకట స్వామి, వినోద్‌లు చెన్నూరు, బెల్లంపల్లిలో విజయం సాధించారు. నల్లగొండలో కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతి కూడా విజయం సాధించారు. బిజెపి అనూహ్యంగా మూడు సీట్ల నుంచి 9 సీట్లకు ఎదగడం విశేషం. పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కెసిఆర్‌ను కెసిఆర్‌ భాషలోనే తిడుతూ..అక్రమలను ఎండగడు తూ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ స్వీప్‌ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పలు సీట్లను గెలుచుకుంది. గతంలో గెల్చి, అధికార బిఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కొత్తగా వచ్చిన పలువురు మహిళలు కూడా విజయం సాధించడం విశేషం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టబెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా కాంగ్రెస్‌ అధిక్యంలో నిలిచింది.బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌, వేములవాడ లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ విజయం సాధించారు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి మెదక్‌ బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ విజయం సాధించారు. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నల్లగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం, మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి కొడుకు జయవీర్‌రెడ్డి విజయం సాధించారు. మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు, జగిత్యాలలో జీవన్‌ రెడ్డిలు గెలుపొందారు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌రావు, దేవరకొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలు నాయక్‌ గెలుపు పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి గెలుపొందారు. ఇకపోతే కేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్‌ తగిలింది. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ మరోమారు విజయం సాధించారు. ఇక్కడ పోటీ చేసిన మాజీమంత్రి కృష్ణయాదవ్‌ ఓటమి చెందారు. అలాగే దుబ్బకాలో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ మెదక్‌ ఎంపి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా, ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ గెలుపొందారు. బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి గెలుపొందారు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ , మహేశ్వరం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబిత గెలుపొందారు. కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేక్‌, సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గెలుపొందారు. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ ఓవైసీ గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓటిమి బాటపట్టారు. జనాల్లో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్లు విజయం సాధించారు. అలాంటి వారిలో మంత్రి మల్లారెడ్డి ఒకరైతే… సనత్‌నగర్‌ నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మరోసారి గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది మంత్రులు ఓడిపోయినా మంత్రి మల్లారెడ్డి మాత్రం మరోసారి విజయం సాధించారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన రెండోసారి విజయం సాధించారు. ఈసారి మల్లారెడ్డి తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌పై విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా 2014లో టీడీపీ తరుఫున మొదటి సారి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. 2014లో ఎంపీగా విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌ రెడ్డికి బదులు మల్లారెడ్డికి టికెట్‌ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆయన మంత్రిగా కూడా పని చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ హ్యాట్రిక్‌ సాధించారు. మొత్తంగా ఆయన ఆరు సార్లు విజయం సాధించారు. ఒక ఉపఎన్నికతోపాటు మూడు సార్లు సికింద్రాబాద్‌ నుంచి మూడు సార్లు సనత్‌ నగర్‌ నుంచి జయకేతనం ఎగరేశారు. 2014 వరకు తలసాని టీడీపీలో ఉండే వారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. 2018లో విజయం సాధించి మరోసారి మంత్రి అయ్యారు. 2018లో తన సవిరీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్‌ గౌడ్‌పై విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి తుల ఉమపై విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఐదోసారి విజయం సాధించి సత్తా చాటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన సబితా ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేసి ఐదోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై భారీ విజయం నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై ఆమె తొమ్మిదివేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు