Thursday, February 29, 2024

మఖ్తల్‌లో ‘‘కాంగ్రెస్‌’’ గాలి వీస్తోందా..?

తప్పక చదవండి
  • భారీగా నమోదైన ఓట్ల సంకేతమేది…
  • హ్యాట్రిక్‌ కు బ్రేకులు పడినట్లేనా….?
  • మఖ్తల్‌ బ్యాలెట్‌ పోరుపై స్పెషల్‌ స్టోరీ…

మఖ్తల్‌ : మఖ్తల్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మఖ్తల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,254 మందికాగా…1,86,860 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 1,64,409 మంది ఓటేశారు. ఈసారి మఖ్తల్‌ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి (బీసీ), బీజేపీ నుంచి జలంధర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, బీఎస్పీ నుంచి వర్కటం జగన్నాథ్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. అభ్యర్థుల్లో చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇక బీజేపీ నుంచి జలంధర్‌ రెడ్డి 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీ చేసిన వాకిటి శ్రీహరి… తొలిసారి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. వర్కటం గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.అభ్యర్థుల బలాబలాలు చూస్తూ… హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా విడుదలైన ఎక్సిట్‌ పోల్‌ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు ప్రజలు సైతం ఈసారి నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే చిట్టెం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆశించిన స్థాయిలో మఖ్తల్‌ అభివృద్ధి జరగకపోవడం, చిట్టెం వ్యవహర శైలి సైతం ప్రధానంగా వార్తల్లో నిలిచింది. దీంతో సహజంగా సౌమ్యుడు, లోకల్‌ వ్యక్తి, బలహీన వర్గాల నేత వాకిటి శ్రీహరి వైపు ప్రజలు మొగ్గు చూపారని చర్చించుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి జలంధర్‌ రెడ్డి కనివినీ ఎరుగని రీతిలో పోటీ పడినా… చివరకు ప్రజలు వాకిటి శ్రీహరి వైపే మొగ్గు చూపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు భారీగా నమోదైన ఓట్లు సైతం వాకిటి శ్రీహరి కే అడ్వాంటేజ్‌ గా మారిందని, మెజారిటీ మరింత పెరిగేందుకు దోహదం చేస్తోందని అంటున్నారు. మొత్తమ్మీద అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌ వైపే మఖ్తల్‌ మొగ్గు చూపుతుండగా… తుది ఫలితం 3వ తేదీ జరిగే కౌంటింగ్‌ తో స్పష్టం కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు