- రైతులకు బీజేపీ అధిరిపోయే హామీ
- రైతుల పక్షపాతి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి
- కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటన
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తుంటారు. అందులో రైతులకు సంబంధించిన హామీలపై తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి . ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రైతుబంధు కింద ఎకరానికి పది వేలు నగదు సాయం ఇస్తుండగా.. మిగతా పార్టీలు ఆ డబ్బును మరింత ఎక్కువ ఇస్తామని హామీలు ఇస్తూ.. రైతులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా పేరుతో 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇవ్వగా.. బీఆర్‌ఎస్ పార్టీ 16 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం ఆ పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏకంగా 24 వేలు ఇస్తామని ప్రకటిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఈ ప్రకటన చేశారు. రైతులకు కేసీఆర్ చేసే ఆర్థిక సాయం కేవలం రూ.10 వేలు మాత్రమేనని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. దీన్ని బట్టి రైతు పక్షపాతి ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరారు. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామని కూడా చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఇక మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తామని వివరించారు. కరీంనగర్‌లో కట్టిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేదంటూ గంగుల కమలాకర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులది భూకబ్జాల చరిత్ర అని.. ఎన్నికలు అయిపోగానే ఆ రెండు పార్టీలు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారంటూ ఆరోపించారు. తనది ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఆస్తులు సంపాదించినట్లు గంగుల చేసిన ఆరోపణలను బండి సజంయ్ ఖండిరచారు. ఒకవేళ తాను ఆస్తులు కూడబెట్టినట్టు రుజువు చేస్తే.. వాటన్నింటినీ ప్రజలకు రాసిస్తానని చెప్పుకొచ్చారు. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ పోరాడుతోందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఓటేసి.. తనను గెలిపించాలని కరీనంగర్‌లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు.