Tuesday, October 15, 2024
spot_img

బాలభవన్ లో అక్రమ డిప్యుటేషన్ల దందా..!

తప్పక చదవండి
  • ఏండ్లకొద్ది బాల భవన్ లో పాతుకుపోయిన ప్రభుత్వ టీచర్లు
  • టీచర్లంతా బడికి వెళ్లాల్సిందేనన్న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు బుట్ట దాఖలు..
  • ఓరల్ డిప్యుటేషన్, స్పౌజ్ కేసుల పేరుతో పాఠశాలలకు ఎగనామం పెడుతున్న టీచర్లు
  • జవహార్ బాలభవన్ అడ్డాగా మార్చుకొని, హైదరాబాద్ లో తిష్ట వేసి కూర్చున్న టీచర్ల తీరు.. ఒకే చోట 5 గురు
  • గత ప్రభుత్వ అండదండలతో ఏండ్ల కొద్దీ పాఠశాలలకు వెళ్ళని వందలాదిమంది ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాల టీచర్ అంటే ఎంతో గౌరవప్రదమైన కర్తవ్యంతో కూడిన ఉద్యోగులుగా అందరూ భావిస్తారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతరమైన గొప్ప బాధ్యత ప్రభుత్వ పాఠశాల టీచర్లపై ఎంతగానో ఉంటుంది. రోజు చిన్న చిన్న కుగ్రామాలు, గిరిజన తండాల్లోకి వెళ్ళి అక్కడ విద్యను అందిస్తున్న ఎంతోమంది టీచర్లు ప్రతిరోజు కనిపిస్తుంటారు. వారంతా అభినందనీయులే. కానీ కొంతమంది తమ గురుతర బాధ్యతలను మర్చిపోయి అడ్డదారిలో ప్రయాణం చేస్తున్నారు. అక్రమ మార్గంలో డిప్యూటేషన్ల వైపు మొగ్గి, హైదరాబాద్ లోనే నిత్యం ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటేషన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఏండ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తూ తమ వృత్తికే కళంకం తెచ్చుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఉన్న ఒక్క జవహర్ బాలభవన్ లోనే గడిచిన 7-8 సంవత్సరాల నుండి ఐదుగురు ప్రభుత్వ టీచర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాల పాఠశాలల నుండి వచ్చి ఇక్కడ డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. వారి వారి డిప్యూటేషన్లు పూర్తి అయినా, సంవత్సరాలకు కొద్ది పొడిగించుకుంటూ ఇక్కడ కాలం వెళ్లదీస్తున్నారు.1) కె.లలిత కుమారి – ఎస్జిటి టీచర్ 2) జ్యోతి – పి.ఈ.టి 3) శ్రీనివాస్ రెడ్డి – స్కూల్ అసిస్టెంట్ 4) శైలజ – హిందీ పండిట్ 5) జనని – ఎస్జిటి టీచర్. వీరంతా వారికి కేటాయించిన ఆయా జిల్లాల పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి, బాధ్యతలను విస్మరించి జవహర్ బాలభవన్ లో చిన్నారులకు కళా నృత్యాలు, ఆర్ట్స్, క్రాఫ్ట్, భరతనాట్యం మ్యూజిక్ లాంటి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థకు కావలసినంత మంది ఆయా బాల కేంద్రాల ఉద్యోగులు ఇక్కడ చాలామంది అందుబాటులో ఉండగా సంబంధిత వారిని పక్కకు నెట్టి, కేవలం హైదరాబాదులో ఉండేందుకు గాను పెద్దపెద్ద పైరవీలు చేయించుకొని ఈ టీచర్లంతా ఇందులో చొరబడ్డారని పలు విమర్శలు వినబడుతున్నాయి. ఇందులో కొంతమంది ఇప్పటికే డిప్యూటేషన్ పూర్తయినా ఇక్కడనుండి కదలకుండా ఇక్కడే పాతుకపోయేట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పైన పేర్కొన్న అయిదుగురు టీచర్లలో కె.లలిత కుమారి అనే టీచర్ యొక్క డిప్యూటేషన్ పూర్తయి 8 నెలలు కావస్తోందని, ప్రభుత్వం ఆమెకు ఇంకా ఎలాంటి రెన్యువల్ ఆదేశాలు ఇవ్వకున్నా, నెలసరి జీతం రాకున్నా తాను ఇక్కడే పనిచేయాల్సిన అంత అవసరం ఏముందని తోటి ఉద్యోగులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఒక సాధారణ ఎస్జిటి టీచర్ కు బాలభవన్ కేంద్ర కార్యాలయంలో ఇన్నాళ్లుగా ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్ అప్పగించడంపై బాల భవన్ పేరంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు బుట్టదాఖలు చేసిన వైనం..
సంవత్సరాల కొద్ది డిప్యూటేషన్ ల పేరుతో ఆయా కార్యాలయాల్లో తిష్ట వేసి కూర్చున్న ప్రభుత్వ టీచర్లు అంతా కచ్చితంగా బడికి పోవాల్సిందేనని, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గడిచిన జనవరిలోనే ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 1 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. డిప్యూటేషన్ పూర్తయిన టీచర్లందరూ స్కూల్లకు పంపించాలని అందులో సూచించారు.

కానీ ఈ బాల భవన్ లో డిప్యూటేషన్ పై కొనసాగుతున్న టీచర్లు కొంతమంది తమ
కాలపరిమితి పూర్తయినా, మళ్లీ తిరిగి ఇక్కడే డిప్యూటేషన్ వేయించుకునేందుకు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ భారీ ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు ఈ విధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ పాఠశాలలకు వెళ్లకుండా, బాలభవన్ లోనే రిటైర్డ్ అయ్యే వరకు ఉంటామన్నట్లు వీళ్ళ పైరవీల వ్యవహారం కొనసాగుతుందని తెలిసింది. బాలభవన్ లో జరుగుతున్న ఈ అక్రమ డిప్యూటేషన్ల దందాపై విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దృష్టి సారిస్తే, ఇక్కడ తిష్ట వేసిన టీచర్లంతా బడులకు వెళ్లే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. పవిత్రమైన తమ టీచర్ వృత్తిని వదులుకొని ఇక్కడే రిటైర్డ్ కావాలని కోరుకోవడం దారుణమైన విషయం.

గత ప్రభుత్వ అండదండలతో చాలామంది ప్రభుత్వ పాఠశాలల టీచర్లు ఇతర విభాగాల్లో డిప్యూటేషన్లలో ఏండ్లకొద్దీ ఇంకా అక్కడే కొనసాగుతున్న వారు ఉన్నారు. ఇది ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలో జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వాహణ కొరకు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది టీచర్లు అక్రమ మార్గంలో ఇతర శాఖల్లో డిప్యూటేషన్లు కొరకు పైరవీలు చేయడం శోచనీయం, బాధ్యతారహితం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు