Sunday, September 15, 2024
spot_img

మోడీ గెలిస్తే.. మరో పుతిన్‌..

తప్పక చదవండి
  • మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే
  • ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు
  • నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు..
  • కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు. బీజేపీ గెలిచినా.. మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయినా.. దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవు అని.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తరహాలో జీవితాంతం ఆయనే ప్రధానిగా.. సుప్రీంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాడని హెచ్చరించారు ఖర్గే. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2024 ఎన్నికలు చివరివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ప్రతి ఒక్కరికీ ఈడీ, సీబీఐ నోటీసులు వస్తున్నాయని.. దీంతో భయపడి కొందరు స్నేహాన్ని వీడుతున్నారు.. మరికొందరు దూరం అవుతున్నారు.. ఇంకొందరు దోస్తీ కడుతున్నారంటూ బీహార్‌ రాజకీయాలను ప్రస్తావిస్తూ ఖర్గే కామెంట్స్‌ చేశారు.
బీజేపీతోపాటు ఆ పార్టీ సైద్దాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ ప్రజల్లో విషం నింపుతుందని.. సమైక్యత దెబ్బతీస్తుందని.. తప్పుడు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారాయన. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌ లో పర్యటించిన మల్లిఖార్జున ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మోడీ గెలిచినట్లయితే.. ఆ తర్వాత నియంతృత్వం వస్తుందని.. భారతదేశానికి ఇంది ఎంత మాత్రం మంచిది కాదన్నారాయన. దేశంలో సమ న్యాయం, సమానత్వం, అందరికీ ఒకే న్యాయం, దేశ ప్రజలకు ఐక్యత చేయటానికి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు ఖర్గే.

మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తాను విష్ణుమూర్తి 11వ అవతారంగా అనుకుంటున్నారని, మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నిశిత విమర్శలు చేశారు. ప్రజలు ఉదయం లేవగానే దేవీదేవతలు, గురువుల ముఖాలు చూడడానికి బదులు తన ముఖమే చూడాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు. డెహ్రూడూన్‌లోని బన్నూ స్కూల్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ, విష్ణుమూర్తి దశావతారులు గురించి అందరికీ తెలుసునని, ప్రధాని ఇప్పుడు విష్ణువు 11వ అవతారంగా అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మతపరమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని ఈఏడాది లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీని తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెడితే మంచి, చెడులను నిర్వచనం చాలా కష్టమవుతుందన్నారు. మతాన్ని ఒక ఉపకరణంగా మోడీ, బీజేపీ వాడుకుంటున్నాయి. విద్వేష భావాలను సృష్టిస్తున్నాయి. వారికి దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదు. సొంత అధికారం, ఎజెండాపైనే వారి దృష్టంతా ఉంది‘ అని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతలను చూసి బీజేపీ భయపడుతోందని, ఆ కారణంగానే వారిని ఆడిపోసుకుంటోందని ఖర్గే అన్నారు. జహహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియాగాంధీతో పాటు రాహుల్‌ గాంధీ కూడా బీజేపీ నేతల కలల్లోకి వస్తుండటంతో వారికి నిద్రపట్టడం లేదన్నారు. కాంగ్రెస్‌ పట్ల ఉన్న భయంతోనే బీజేపీ అధికారంలో ఉన్న అసోంలో కాంగ్రెస్‌ పర్యటనలను అడ్డుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ ర్యాలీపై రాళ్లు విసిరారని, పోస్టర్లు చించివేసి, జెండాలు తొలగించారని చెప్పారు. కాంగ్రెస్‌ యాత్రలకు ఒక్క అసోంలో మినహా ఎక్కడా అంతరాయం కలగలేదని, అడ్డుకోలేదని అన్నారు. ఈ తరహా ఎత్తుగడలకు తాము భయపడేది లేదన్నారు. ప్రజల హక్కులు కాపాడేందుకు, ప్రభుత్వ తప్పిదాలపై పోరుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, స్వాతంత్య్రం కోసం, దేశ సమైక్యత కోసం తమ ప్రాణాలను అర్పించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. ప్రజలకు ఎప్పుడూ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి త్యాగాలు, సేవల చరిత్ర ఉందని, ప్రగతి, న్యాయం కోసం ఒక విజన్‌ అంటూ ఉందని ఖర్గే చెప్పారు. నవభారత నిర్మాణమనే మిషన్‌ కోసం కాంగ్రెస్‌ శ్రమిస్తోందన్నారు. రైల్వేలతో సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యువతకు తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని ఖర్గే విమర్శించారు. అగ్నివీర్‌ పథకం ద్వారా నాలుగేళ్లు ఉపాధి కల్పించి, ఆ తర్వాత నుంచి యువతకు ఉపాధి లేకుండా చేస్తుందని ఖర్గే అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు