వంగాల వందల కోట్ల అక్రమ అర్జన..
- యూనిట్‌కు రూ.10-18 వేల కమీషన్
- రీసైక్లింగ్ ద్వారా 50 శాతం నొక్కివేత..!
- కమీషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి..!
- డాక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా యవ్వారం
- గతంలో పశుక్రాంతి పథకంలోనూ వంగాల చేతివాటం..
- కొత్త సర్కార్ దృష్టి పెడితే వాస్తవాలు బయటకొచ్చే ఛాన్స్
సహకార సమాఖ్య ద్వారా గొల్ల-కుర్మలు-యాదవులకు సబ్సీడి పద్ధతిన గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్కీంను అప్పటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం గైడ్ లైన్స్ నూ రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఒక్కో యూనిట్ చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది. యూనిట్ కు 20 గొర్రెలు, ఒక పొట్టేల్ ను ఇవ్వాలని డిసిషన్ తీసుకుంది. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం భరించగా.. అప్పటి ప్రభుత్వమే 75 శాతం చెల్లించింది. అంటే యూనిట్ ధరను సర్కార్ రూ.1.25 లక్షలుగా నిర్ణయించగా..ప్రభుత్వం రూ.93,750 వేలు, లబ్ధిదారుడు రూ.31,250 వేల చొప్పున చెల్లించారు.
గొర్రెల పంపిణీ స్కీం కాదు..కమీషన్ల స్కాం..!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీం..పూర్తిగా కమీషన్ల స్కాంగా మారిపోవడం గమనార్హం. ఈ మొత్తం యవ్వారాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివ్రుద్ధి సహకార సమాఖ్య మాజీ మ్యానేజింగ్ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి చూసుకోవడం విశేషం. గొర్రెల పంపిణీ స్కీంను మొత్తం ఈయన అవినీతి మాయం చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో అడ్డగోలు దోపిడి చేసేందుకు మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి ఒక వ్యవస్థనే క్రియేట్ చేసుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, డాక్టర్ ను ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడ్డారు. మొదటి టర్మ్ గొర్రెల పంపిణీలో డాక్టర్లు నేరుగా స్పాట్ కు వెళ్లి గొర్రెల అమ్మకదారుణ్ని సంప్రదించేవారు. వీరు చెప్పిన ప్రకారమే గొర్రెల యూనిట్లు అప్రూవల్ అయ్యేవి. ఈ నేపథ్యంలోనే నేరుగా జిల్లా పశు వైద్యాధికారుల నుంచి ఒక్కో యూనిట్ కు మాజీ మ్యానేజింగ్ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డికి రూ.10-18 వేల వరకూ కమీషన్ రూపంలో ముట్టేవి. ఇలా ప్రతీ జిల్లా నుంచి కోట్ల రూపాయాలు ప్రతీ నెలా వంగాలకు మామూళ్లు అందేవని సమాచారం. దీంతో వంగాల డైరెక్టర్ గా ఉన్న కాలంలో వందల కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
రీ సైక్లింగ్ లోనూ 50 శాతం నొక్కివేత..!
ఇక మొదటగా కమీషన్ల వరకే పరిమితమైన వంగాల లక్ష్మారెడ్డి యవ్వారాలు..తర్వాత రీ సైక్లింగ్ తంతుకు తెర తీశారు. రూ.10-18 వేల వరకే తొలుత కమీషన్లు తీసుకోగా..అనంతరం గొర్రెల పంపిణీలో అక్రమ రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సుమారు 50 శాతం వరకూ మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కమీషన్ల రూపంలో నొక్కేయడం గమనార్హం. గొర్రెల పంపిణీ స్కీంలో భాగంగా లబ్ధిదారులు వారికి కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇలా మన రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఏపీలకు గొర్రెల సెలెక్షన్స్ కోసం అధికారులు లబ్ధిదారులను తీసుకెళ్లేవారు. అయితే ఇక్కడే మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తన వేషాలను మొదలుపెట్టేశారు. అక్కడికి వెళ్లిన వారి చేత ఫోటో తీయించుకొని వాటిని రీసైక్లింగ్ చేయించేవారని సమాచారం. లబ్దిదారులు కట్టిన డీడీల మొత్తానికి అదనంగా రూ.30 వేల వరకు అందజేసి.. మిగతా మొత్తాన్నిముడుపుల రూపంలో పుచ్చుకునేవారని తెలుస్తోంది. ఇందుకోసం వంగాల జిల్లా వైద్యాధికారులపై ఒత్తిళ్లు పెట్టి పనులు చేయించుకునే వాళ్లని తెలుస్తోంది.
జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే రీ సైక్లింగ్ పనులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు పశుక్రాంతి పథకం అమల్లో ఉండేది. ఈ స్కీంలో భాగంగా మేలి జాతి గెదెలను పాడి రైతులకు ఇచ్చేటోళ్లు. వీటితో పాటు దాన కూడా పాడి రైతులకు సరఫరా చేసేవారు. అయితే అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన లక్ష్మారెడ్డి.. పశుక్రాంతి పథకాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించినట్లు సమాచారం. పశువులను నార్థ్ ఇండియా నుంచి తీసుకొచ్చి..వరంగల్ లో దించగానే వాటి ఫోటోలు తీయించి మళ్లీ వాటిని వాపస్ పంపేవారని తెలుస్తోంది. తద్వారా కోట్ల రూపాయాలను వంగాల వెనకెసుకున్నట్లు అర్థమవుతోంది. అంతేకాక నాసిరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడినట్లు సమాచారం. అదే తంతును గొర్రెల పంపిణీ స్కీంలోనూ లక్ష్మారెడ్డి ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. వెరసి బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో 3 లక్షల 66 వేల యూనిట్లను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేయగా.. అందులో దాదాపు 40-50 శాతం వరకూ ఫండ్స్ పూర్తిగా మిస్ యూజ్ అయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల కొత్త ప్రభుత్వం కనుక ఈ వ్యవహారంపై నజర్ పెడితే.. మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి యవ్వారాలతో పాటు..ఆయన ఎవరెవరికీ ముడుపులు ముట్టజేప్పారనే విషయం బయటకొచ్చే అవకాశముందని తెలుస్తోంది.
అంతేకాక, ఈ వ్యవహారం రాజకీయనాయకులకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టింది, ఓ యువ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవినీతి అధికారులు చందాలు చేసి అతనికి పార్టీ ఫండ్‌గా చెల్లిన కథాకామాషి మరో కథనంలో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.