Monday, May 6, 2024

ఆర్థిక పరిస్థితి.. ఏం చేద్దాం?

తప్పక చదవండి
  • సీఎం రేవంత్‌ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ భేటీ
  • ముఖ్యమంత్రి నివాసానికి రఘురాం రాజన్‌
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చ
  • ఇప్పటికే పలు శాఖలపై రేవంత్‌ సమీక్షలు
  • ఆరు హామీల అమలుకు ఏటా రూ. 60వేల కోట్లు
  • ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడంపై దృష్టి
  • అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు
  • డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు హాజరు

రాష్ట్రంలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిపై ఫోకస్‌ పెట్టింది. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఎన్నికల హామీలను అమలు చేసేందుకు అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడంపై కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపును అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాల అమలుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో మంత్రులు, అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, రాబడి, వ్యయాలు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో పథకాల అమలుకు నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఇవాళ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామ రాజన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్‌ శాంతి కుమారి, స్పెషల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

స్వాగతం పలుకుతున్న సమస్యలు..
ఆర్థికపరంగా తెలంగాణ ఇప్పటికే సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన వివిధ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కత్తిమీద సామే కానుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం. హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోకుండా చూడటం అనేది పెద్ద రేవంత్‌ రెడ్డికి సవాలే. 2023-24 చివరి నాటికి తెలంగాణ అప్పులు జీఎస్‌డీపీలో 23.8 శాతంగా ఉండనున్నాయి. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.29 లక్షల కోట్లు అవసరం అనేది 2022-23 నాటి అంచనా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీల అమలుకు నగదు సర్దుబాటు చేయడానికి కిందా మీద పడిరది.

- Advertisement -

2023-24లో తెలంగాణ ప్రభుత్వం రూ.38,234 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుండగా.. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకే రూ.33,378 కోట్ల మేర అప్పులు తెచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు.. గత ఏడాదితో పోలిస్తే.. తెలంగాణ రెవెన్యూ క్రమంగా తగ్గుతోంది. 2023-24 బడ్జెట్‌ ప్రకారం రూ.2.16 లక్షల కోట్ల మేర రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటి దాకా వచ్చింది లక్ష కోట్ల లోపే (రూ.99,755 కోట్లు). కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలోనూ ఇప్పటికే రాష్ట్రానికి 50 శాతం (రూ.14,528 కోట్లు ) వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడపటం రేవంత్‌ రెడ్డికి పెద్ద సవాల్‌గానే మారనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీఐ మాజీ గవర్నర్‌తో సీఎం రేవంత్‌ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించినట్లు తెలిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు