Monday, April 29, 2024

డివైన్ ఇన్ఫ్రా, పుడమి బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ..

తప్పక చదవండి
  • బరితెగించి ప్రజల జీవితాలతో చెలగాటం..
  • హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో వెంచర్లంటూ జనాలను మోసం చేసే తంతు…
  • బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ప్రజలను తడి గుడ్డతో గొంతు కోసే వ్యాపారం..
  • మార్కెట్‌ ధరకన్నా 100 శాతం రేటు పెంచేసి విక్రయిస్తున్న వ్యాపారులు..
  • అమాయకులను తీసుకొచ్చే ఏజెంట్లకు భారీ నజరానాలు..
  • బై బ్యాక్ స్కీములతో అమాయకపు ప్రజల నుండి భారీ దోపిడీ..

హైదరాబాద్ :
తెలంగాణ పోలీస్ శాఖ వారు అధిక వడ్డీలు ఈజీగా డబ్బులు వస్తాయంటే నమ్మొద్దు అంటూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎన్నోసార్లు జాగృతం చేసినా అమాయక ప్రజలు ఈ మోసగాళ్లు ఉచ్చులో చిక్కుకొని బలవుతున్నారు అనడంలో సందేహం లేదు.. ఈ కథనం ద్వారా కొంతమంది అయినా జాగ్రత్త పడాలని, పోలీస్ శాఖ వారు మరికొద్దిగా నిఘా పెంచాలని సామాజిక ఉద్యమకారులు విజ్ఞప్తి చేస్తున్నారు..

పోలీస్ శాఖ వారు ఈ దొంగ వ్యాపారంపై నిఘా సారించాలి :
బోడుప్పల్ బస్ డిపో ఎదురుగా బుద్ధ నగర్ ప్రధాన రహదారి కె.ఎఫ్.సి. పక్క సందులో డివైన్ ఇన్ఫ్రా శ్రీ నిలయం, పుడమి లాంటి పలు పేర్లతో రియల్ ఎస్టేట్ బోగస్ కంపెనీ.. ఈ కంపెనీకి యజమానులు.. ఆలకంటి ఆనంద్, సిహెచ్ రామచందర్.. అమాయకులను, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ మా వద్ద ప్లాట్ కొనండి మీ డబ్బును కొద్ది నెలల్లో రెట్టింపు చేసి తిరిగి ఇస్తాం.. అంటూ అమాయకపు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతూ నమ్మించి ఆఫీసుకు పిలిపించి అడ్మిషన్ ఫీజు రూ. 1000, అలాట్మెంట్ ఫీజు రూ. 10000లు.. ఇలా 100 గజాల స్థలం కొంటే 8 లక్షల రూపాయలు.. కొద్ది రోజుల్లోనే మీ డబ్బులు రెట్టింపు చేస్తాం.. మీకు మూడు రూపాయల వడ్డీతో వడ్డీ కట్టి ఇస్తాము.. కొన్ని రోజుల తర్వాత స్థలము వద్దంటే మీ డబ్బు మీకు ముట్ట చెప్తాం.. ఇలా అమాయకులనే టార్గెట్ చేస్తూ డబ్బును గుంజే ప్రయత్నంగా.. వేల మందిని మోసం చేసి వందల కోట్లకు పైగా మూట కట్టిన దొంగ కంపెనీ..

- Advertisement -

ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్‌ ఇన్‌కం, ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్‌ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు.

నమ్మకస్తులే మధ్యవర్తులుగా :
బీ.డీ.ఎల్, డిఫెన్స్, ఇతర ప్రైవేటు ఉద్యోగులను, గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్‌ ఉద్యోగులను రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్‌ హంగులను అద్ది రంగు రంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్‌ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.

అసలుకు రెట్టింపు ఆశ చూపి :
చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్‌ వెంచర్‌లను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి, సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్‌ వెంచర్‌లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిర్ణీత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి.

కొన్నిచోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి, ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్‌ గడువు తర్వాత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా.. లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతో పాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు.

ఈ పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా :
సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్‌ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. ఈ డివైన్ ఇన్ఫ్రా , పుడమి పేరుతో వందల కోట్లు ప్రజల నుండి సేకరించి మోసం చేసిన వ్యక్తి దొంగ వ్యాపారం అసలు బాగోతం మరో కథనంలో..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు