Tuesday, March 5, 2024

పదేళ్ల తెలంగాణ అభివృద్దిపై చర్చించండి

తప్పక చదవండి
  • నాడు..నేడు ఎలా ఉందో గ్రామాల్లో చర్చ చేయాలి
  • ఎవరో చెప్పిండని ఓటేసి బాధపడొద్దు
  • ఎవరికి ఓటేస్తే బాగుపడతమో ఆలోచన చేయాలి
  • ఐదేళ్ల భవిష్యత్‌కు ఓటు వజ్రాయుధం లాంటిది
  • చేర్యాల సభలో సీఎం కేసీఆర్ పిలుపు

సిద్దిపేట : ఎన్నికల్లో ఆషామాషీగా, అలవోకగా.. చిన్నాయన చెప్పిండని.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయొద్దని.. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పిలుపునిచ్చారు. పదేళ్లకు ముందు తెలంగాణ..పదేళ్ల తరవాత తెలంగాణ ఎలా ఉందో గుర్తించి ఓటేయాలన్నారు. తెలంగాణ కోసం గత పదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని, దానిని తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య పక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదన్నారు. ఎక్కడైతే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి. మనదగ్గర ఎలక్షన్లు వచ్చినయంటే అన్నీ అబద్ధాలు, అభాండాలు, బద్నాంలు, బట్టకాల్చిమీదేసుడు, లొల్లులు, కొట్లాడుకునడు.. కత్తులుపట్టి పొడుసుడు ఇవన్నీ కళ్లారా చూశాం. అమెరికాలాంటి దేశాల్లో సభలు కూడా జరుగవ్‌. టీవీల్లోనే మాట్లాడుతరు. పార్టీ పాలసీ చెబుతరు. దానిపైనే ప్రజలు ఓటేస్తరు. ఆ పరిణితి కొంచెం కొంచెం వస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అది బాగా రావాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.ఎన్నికల్లో పార్టీకొకరు నిలబడుతరు. ఎట్లయిన 30వ తారీఖున ఓట్లు పడుతయ్‌. 3 తారీఖున లెక్కబడుతరు. ఆడికి దుకాణం అయిపోతది. ఇది జనరల్‌గా మనకు తెలిసిన లెక్క. అసలు లెక్క అది కాదు. ఎన్నిక వస్తే ఏం జరగాలంటే.. నిలబడ్డ వ్యక్తి గుణం, గణం చూడాల్సిందే. ఎలాంటి వ్యక్తి ? ఏం చేస్తడో చూడాలి. ముఖ్యంగా అభ్యర్థుల వెనుక పార్టీల చరిత్రను చూడాలి. ఆ పార్టీల నడవడిక, దృక్పథాన్ని పరిశీలించాలి. రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి వాళ్ల అవగాహన ఏంది. వాళ్లకు రాష్టాన్న్రి అప్పగిస్తే ఎటు తీసుకుపోతరు? ఈ విషయంపై ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. అప్పుడు తెలివితోని ఓటు వేసినట్లవుతుంది. తప్పకుండా తెలివికల్ల ప్రభుత్వం వస్తుందన్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు నేను చెప్పే నాలుగు మాటలను గ్రామాల్లో చర్చ పెట్టాలి. నిజానిజాలు తేల్చాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకేఒక వజ్రాయుధం ఓటు. అది సామాన్యమైటువంటిది కాదు. ఆషామాషీగా అలవోకగా.. మా చిన్నాయన చెప్పిండు.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయాల్సింది కాదు. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలి. ఐదుసంవత్సరాలు రాష్ట్రం తలరాతను, తద్వారా మనందరి తలరాతను ఓటు మారుస్తుంది. చైతన్యం లేని ప్రజలను చైతన్యవంతం చేయాలి. చైతన్యం ఉన్న యువత వాస్తవాలపై చర్చ పెట్టాలి. అప్పుడు నిజమైన ప్రజాస్వామిక పరిణితి వచ్చే అవకాశం ఉంటుంది. మేలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర మీ అందరి కండ్ల ముందే ఉన్నది. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజల హక్కుల కోసం. పని చేస్తున్నది కూడా తెలంగాణ కోసమే. కాంగ్రెస్‌ చరిత్ర కండ్ల ముందున్నది. బీఆర్‌ఎస్‌ మీ ఆశీర్వాదంతో పదేళ్లుగా అధికారంలోకి ఉన్నది. అంతకు ముందు కాంగ్రెస్‌ 50 సంవత్సరాలు అధికారంలో ఉంది. 50 సంవత్సరాల
కాలంలో వాళ్లు ఏం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ నడక ఏంది? అనేదానిపై చర్చించాలి. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం. కాంగ్రెస్‌ చరిత్రనేమో ఉన్న తెలంగాణను ముంచింది. మన తెలంగాణ మనకే ఉండే. దాన్ని జబర్దస్త్‌గా తీసుకుపోయి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కలిపి 58 ఏళ్లు ఏడిపించారు. 1969 సంవత్సంలో పిట్టల్లా 400 మందిని కాల్చి చంపారు. 2001 మనందరం కలిసి మొదలుపెడితే 2004లో మనతో పొత్తు పెట్టుకుంటమని ముందుకువచ్చారు. తెలంగాణ ఇస్తమని మాట ఇచ్చారు. మరి 2004లో పొత్తుతో ఇక్కడ, ఢల్లీిలో అధికారం వచ్చింది. 2005, 2006లో తెలంగాణ ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వకుండా ధోఖా చేసింది మనం మొండిగా కొట్లాడం. రాజీపడలేదని అన్నారు. ఎట్లన్న మూవ్‌మెంట్‌ను కిందమీద చేయాలని చూశారు. ఎమ్మెల్యేలను కొనాలని చూశారు. టీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చాలని చూశారు. చాలా కుట్రలు చేశారు. చివరకు నాకు తిక్కరేగి తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ వచ్చుడో ఏదే ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు దిగితే.. ప్రజలు ఉప్పెలా ఉద్యమాలు చేస్తే.. 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత దిక్కులేదురా అని తెలంగాణ ఇచ్చేందుకు ముందువచ్చారు. ఇది మీ కండ్ల ముందే జరిగిన చరిత్ర. నేను భారతం, రామయణం చెబుతలేను. ఇవాళ పదేళ్లయ్యింది తెలంగాణ వచ్చి. మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తున్నది. మనం ఓ మార్గం వేసుకున్నాం. తెలంగాణ వచ్చిన నాడు.. రాక ముందు.. పదేళ్లకు ముందు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు