Saturday, April 27, 2024

తిరుమలగిరి మున్సిపాలిటిలో ముసలం.!

తప్పక చదవండి
  • తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటిలో అవిశ్వాసానికి రంగం సిద్దం
  • చైర్మన్ రజిని మెరుపు ధర్నాకు అసలు కారణం ఏంటి?
  • రజినికి సపోర్ట్ గా నిలబడని బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు..
  • తిరుగుబాటుకు సిద్దమంటున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు!
  • దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్..

పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరబాద్ ప్రత్యేక ప్రతినిధి

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఛైర్మన్ వర్సెస్ కమీషనర్ మద్యలో రాజుకున్న వైరం చిలికి చిలికి గాలివానల మారుతోంది. బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ప్రస్తుత పాలకమండలినే ఇక్కడ అధికారం కొనసాగిస్తోంది. మున్సిపాలిటిలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో మెజారిటీ 11 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయినా కూడా తిరుమలగిరి మున్సిపాలిటి చైర్మన్ రజిని చెప్పినట్లుగా ఇక్కడి కమీషనర్ శ్రీనివాస్ వినడం లేదని, తాను చైర్మన్ గా ఏమి ఆదేశించిన సదరు అధికారి లెక్కచేయడం లేదని, పాలకమండలి తీర్మాణాలకు వ్యతిరేఖంగా కమీషనర్ పనిచేస్తున్నారని నిరసిస్తూ చైర్మన్ రజిని సోమవారం సాయంత్రం తిరుమలగిరి మున్సిపాలిటి ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. ఆమె మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో చైర్మన్ రజిని వెంట బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఒక్క కౌన్సిలర్ కూడా ఆమెకు మద్దతుగా కనిపించకపోవడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది.

- Advertisement -

బీఆర్ఎస్ ను గద్దె దించేద్దామా..?

చైర్మన్ రజిని వర్సెస్ మున్సిపల్ కమిషనర్ వివాదం విషయం ఇలా ఉండగా, రజినిని చైర్మన్ పదవి నుండి తొలగించేందుకోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లలో ప్రస్తుతం 8 మంది అవిశ్వాసానికి తాము రెడీ! అంటుండగా మరో బిఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తటస్థ వైఖరిలోనే తాను సైతం అవిశ్వాసానికి రెడీగా ఉన్నట్లేనని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో 9 మంది కౌన్సిలర్లు ఒకే మాట మీదికి వచ్చినట్లయితే, వెంటనే వీరంతా కలిసి జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసంపై మెమొరండం ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ విషయం తెలిసే చైర్మన్ రజిని సోమవారం మున్సిపాలిటీ ఎదుట నిరసన ధర్నా, డ్రామా మొదలు పెట్టారని కాంగ్రెస్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పాలకమండలి మొత్తం బిఆర్ఎస్ చేతిలోనే ఉంది. నాడు జిల్లా మంత్రి, ఎమ్మెల్యే అందరూ ఒకే పార్టీ వారై ఉండి కూడా వారి మాట వినని మున్సిపల్ కమిషనర్ ను ఎందుకు బదిలీ చేయలేకపోయారని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ప్రశ్నిస్తోంది. చైర్మన్ రజిని బిఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ఒంటరి పోరాటమే చేస్తోందని, గతమంతా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఆడిందే ఆటగా, ఆయన మార్క్ పాలన ఇక్కడ జోరుగా కొనసాగిందననే విషయం బహిరంగ రహస్యమే.

దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్..

గడిచిన 10 ఏళ్ళు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా పాతుకొని కూర్చుంది. అంతకుముందు ఐదేళ్లు టిడిపి ఎమ్మెల్యే పాలన ఇక్కడ కొనసాగింది. మొత్తం 15 ఏళ్లు కాంగ్రెస్ క్యాడర్, లీడర్లు అధికారానికి దూరమై తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. పదిహేను ఏళ్ల తర్వాత ఇక్కడ బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఒకేసారి జరిగింది. దీంతో ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం ఒక్కసారిగా ఆగిపోతున్న ఊపిరిని తిరిగి పీల్చుకున్నట్లు అయ్యింది.

తాము పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎదుర్కొన్న రాజకీయ అధికార దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా కసి తీర్చుకోవాల్సిందే అన్న రీతిలో క్యాడర్ మొత్తం స్థానిక మండల నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి ఆయువుపట్టు తిరుమలగిరి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తిరుమలగిరి మున్సిపాలిటీని తమ చేతిలోకి తీసుకోవాల్సిందే నన్న ప్రక్రియలో కాంగ్రెస్ నాయకత్వం చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. రేపో మాపో తమ రాజకీయ తడాఖా చూపించాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది. గతంలో తాము రాజకీయంగా అనుభవించిన అణిచివేతకు బదులు తీర్చుకోవాలని చూస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ చతురతను ఏ విధంగా ప్రదర్శించబోతుందో వేచి చూద్దాం.!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు