Monday, April 29, 2024

ఎంఎన్‌జేకు అవినీతి క్యాన్సర్‌

తప్పక చదవండి
  • భారీగా ఆరోగ్య శ్రీ నిధులు దుర్వినియోగం
  • ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ నుంచి విడుదలైన నిధులు వివరాలు ఒకలా..
  • ఎంఎన్జే హాస్పిటల్‌ డైరెక్టర్‌ ప్రకటించిన నిధుల వివరాలు మరోలా..
  • రెండింటి మధ్య భారీ వ్యత్యాసం..
  • కోట్ల రూపాయాలకు లెక్కలు చెప్పని వైనం
  • బీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ టర్మ్‌ సర్కార్‌ లో అడ్డగోలు దోపిడి
  • యూజర్‌ ఛార్జీల పేరుతో రోగులకు తప్పని వేధింపులు
  • దాతలు ఇచ్చిన డబ్బులు మటు మాయం
  • కొత్త సర్కార్‌ దృష్టి పెడితే అసలు బండారం బయటపడే ఛాన్స్‌

హైదరాబాద్‌ ఎంఎన్‌జే (మెహదీ నవాబ్‌ జంగ్‌ ఇన్స్‌ ట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌) ఆసుపత్రికి అవినీతి క్యాన్సర్‌ జబ్బు పట్టుకుంది. హాస్పిటల్‌ యాజమాన్యం బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో అడ్డగోలు అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఆరోగ్య శ్రీ నిధులు, బడ్జెట్‌ కేటాయింపులు, దాతల విరాళాలల వినియోగంలో భారీగా దుర్వినియోగం చేసినట్లు అర్థమవుతోంది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఎంఎన్జే ఆసుపత్రి యాజమాన్యం ఖర్చులకు ఎక్కడా పొంతన లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరపున పేద క్యాన్సర్‌ రోగులకు చికిత్సను అందించే ఒకే ఒక ఆసుపత్రి హైదరాబాద్‌ రెడ్‌ హిల్స్‌ లోని ఎంఎన్‌జే హాస్పిటల్‌. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో విచ్చలవిడి అవినీతి జరగడం గమనార్హం.

నైజాం హయాంలో క్యాన్సర్‌ రోగుల కోసం అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్‌ రెడ్‌ హిల్స్‌ లో ఎంఎన్‌జే ఆసుపత్రి స్థాపించగా.. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్‌ గా మారింది. ఆసుపత్రికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఇక్కడకు అనేక మంది పేద ప్రజలు ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందేందుకు వస్తుంటారు. అటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఈ ఆసుపత్రికి భారీగా ఆరోగ్య శ్రీ ద్వారా నిధులు విడుదలయ్యాయి. అయితే కేసీఆర్‌ ఫస్ట్‌ టర్మ్‌ లో రిలీజ్‌ అయిన ఆరోగ్య శ్రీ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నిధుల నిర్వాహణలో ఆసుపత్రి యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఆరోగ్య శ్రీ నిధులను దుర్వినియోగం చేసేందుకు నిబంధనలను ఎంఎన్‌జే డైరెక్టర్‌ జయలత తుంగలో తొక్కేసింది. అటు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌.. ఇటు ఎంఎన్‌జే యాజమాన్యం ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం బట్టబయలైంది. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఎంఎన్‌జే ఆసుపత్రికి 2014 నుంచి 2019 వరకు 92 కోట్ల 49 లక్షల 51వేల 013 రూపాయల నిధులను విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ కార్యాలయ వర్గాలు చెబుతుండగా.. ఎంఎన్‌జే హాస్పిటల్‌ యాజమాన్యం మాత్రం 41 కోట్ల 1లక్ష, 87వేల 497 రూపాయలు వచ్చినట్లు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వడం గమనార్హం. అంటే ట్రస్ట్‌ లెక్కల ప్రకారం ఎంఎన్‌జే ఆసుపత్రి యాజమాన్యం 51 కోట్ల 47 లక్షల 63 వేల 516 రూపాయల నిధులను మింగేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
అంటే బీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ద్వారా ఎంఎన్‌జే ఆసుపత్రికి రూ.92,49,51,013 కోట్ల నిధులు విడుదల కాగా..ఎంఎన్‌జే ఆసుపత్రి ప్రకటించిన వివరాలు ప్రకారం మాత్రం ఈ ఐదేళ్ల ఆ హాస్పిటల్‌ కు ట్రస్ట్‌ ద్వారా రూ.41,01,87,497 కోట్లే వచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్న మాట. అయితే మిగతా రూ.51,47,63,516 కోట్లు ఎక్కడ పోయాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నిధులు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. ఇక నిధుల వివరాల కోసం ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే రెండేళ్ల తర్వాత ఆర్టీఐ కమిషనర్‌ ఆదేశిస్తే తప్ప వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం.
మరోవైపు ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చే ఆరోగ్య శ్రీ రోగులకు అందజేసే మందుల విషయంలోనూ పెద్ద ఎత్తున గోల్‌ మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందుల ఖర్చు కూడా ఆకస్మాత్తుగా పెంచి చూపించారు. 2017-18లో మందుల కొనుగోలు కోసం రూ.కోటి ఖర్చు చేయగా.. 2018-19లో రూ.03 కోట్ల 20 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఒక్క ఏడాదిలోనే మందులపై అయిన ఖర్చులు రూ.2 కోట్ల 20 లక్షలకు అధికంగా చేరుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఉద్యోగాల జీతాల చెల్లింపునకు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. జీతాల చెల్లింపునకు ఆరోగ్య శ్రీ నిధులు ఎందుకు వెచ్చించారనేది అర్థం కాని పరిస్థితి. అయితే జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ.. ఎందుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ డబ్బులను ఎంప్లాయిస్‌ శాలరీస్‌ కోసం మళ్లించాల్సిన అవసరం ఏర్పడిరదనే తెలియడం లేదు.

- Advertisement -

నిబంధనలకు విరుద్ధంగా యూజర్‌ ఛార్జీల వసూళ్లు
ఆరోగ్య శ్రీ రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచిత వైద్యం అందించాలి. కానీ, ఎంఎన్‌జే యాజమాన్యం మాత్రం పేద రోగుల నుంచి రూ.300 నుంచి 3 వేల వరకూ యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తోంది. ట్రిట్‌ మెంట్‌ పూర్తైన తర్వాత ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం చెబుతోంది. యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడమేందుకు.. తిరిగి వారికి చెల్లించడమేందుకు అనే దానిపై మాత్రం ఆసుపత్రి వర్గాల వద్ద సమాధానం లేదు. ఎంఎన్‌జే ఆసుపత్రికి ప్రతీఏటా ప్రభుత్వం చేసే కేటాయింపులు, ఆరోగ్య శ్రీ ద్వారా వచ్చే నిధులు, ఆసుపత్రికి దాతలు ఇచ్చే డబ్బులు, ఇతరత్రా రూపాల్లో వచ్చే ఫండ్స్‌ లోనూ వందల కోట్ల అవినీతి జరిగినట్లు అర్థమవుతోంది.
ఈ మొత్తం వ్యవహారంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించి ఆరోగ్య శ్రీ ద్వారా ఎంఎన్‌జే ఆసుపత్రికి జరిగిన కేటాయింపులు, నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తే అసలు బండారం బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారానికి తెగబడ్డ హాస్పిటల్‌ డైరెక్టర్‌ జయలత, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ ఆక్ట్‌ 1864 ప్రకారం కాజేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.
ఎంఎన్‌జే హాస్పిటల్‌ లో జరిగిన మరిన్ని అవినీతి బాగోతాలను, అక్రమంగా ఇంచార్జ్‌ డైరెక్టర్‌ గా కొనసాగుతున్న జయలత గురించి మరో కథనంలో పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు