Tuesday, April 30, 2024

కబ్జాకోరల్లో… పిల్లల పార్క్ …

తప్పక చదవండి

మాయమవుతున్న నాచారం సావర్కర్ నగర్లోని చిల్డ్రన్స్ పార్క్..

  • రెండు కాలనీల మధ్యలో కబ్జాకు గురైన జీహెచ్ఎంసీ పార్క్….
  • కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా పర్వాలు..
  • చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు….
  • పార్కు ఆక్రమణకు చక్రం తిప్పిన రాజకీయ ప్రముఖులు
  • సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్ కాలనీలకు చిల్డ్రన్స్ పార్క్ కలగానే మిగిలిపోనుందా..!

హైదరాబాద్ రాజకీయ ప్రముఖులు, అధికారులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలైనా…… ఆట స్థలాలైన కబ్జాలకు గురికావాల్సిందేనా…? కాలనీలకు ఆటవిడుపు కోసం వెంచర్ నిర్వహకులు విశాల దృక్పథంతో ఆటవిడుపు స్థలాలను కేటాయిస్తే, కాపాడాల్సిన ప్రభుత్వ అధికా రులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై కబ్జాలకు పాల్పడతారా..? కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం డివిజన్ సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్, హనుమాన్ నగర్ కాలనీలకు మధ్యలో సుమారుగా 2000 గజాలను పార్కు స్థలంగా కాప్రా జిహెచ్ఎంసి బోర్డును ఏర్పాటు చేశారు. రెండు కాలనీల మధ్యలో అటు ఈఎస్ఐ హాస్పటల్ ప్రహరి గోడకు అనుకోని ఉండడంతో, కబ్జాదారుల కన్ను పార్కు పై పడింది. అధికారులు సహాయ సహకారాలతో కబ్జాదారులు రెండు కాలనీల వెంచర్ లేఅవుట్లను మాయం చేసి, పార్కు స్థలాన్ని పక్కా ప్లాట్గా నకిలీ డాక్యుమెంట్లతో చిత్రీకరించారంటే కబ్జాదారులకు అధికారులు సహాయ సహకారాలు దండిగా ఉన్నట్లే. సావర్కర్ నగర్ ప్రభుత్వ పార్కును కాపాడాలని, కాలనీ పెద్దలు 2016-2019 సంవత్స రంలో కోర్టు మెట్లు ఎక్కినా, దరఖాస్తుదారులను భయభ్రాంతులకు గురిచేశారని.. పైగా అధికారులు కూడా సహకరించకపోవడంతో పార్క్ స్థలం కబ్జాకు గురైనట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

కాప్రా సర్కిల్ అధికారులు పార్కు స్థలం నిర్ధారించి నాటిన బోర్డులను సైతం కబ్జాదారులు రాత్రికి రాత్రి తొలగించి, ప్లాట్లుగా చేసి విక్రయిస్తే చర్యలు తీసుకున్న నాథుడే లేడు. పార్కు స్థలంలో యదేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే, టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
నాచారం, సావర్కర్ నగర్ పార్కు స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతులు జారీ చేశారో అధికారులకే తెలియాలి. కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులకు డబ్బులు ఇస్తే, స్మశాన వాటికకు సైతం అనుమతులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ పార్కులు కనుమరుగవుతుంటే. పిల్లలకు ఆట స్థలాలు ఆకాశంలో అందని చందమామ చందంగా మారిపోనున్నాయి. నాచారం సావర్కర్ నగర్ పార్కు కబ్జాలో రాజకీయ ప్రముఖులు చక్రం తిప్పినట్లు స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలో కబ్జా చేసిన స్థలంలో యదేచ్చగా బహుళ అంతస్తుల నిర్మాణలు జరుగుతుంటే గ్రేటర్ అధికారులు స్పందించరా..? నాచారం డివిజన్లోని సావర్కర్ నగర్ పార్కులో బహుళ అంతస్తుల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. చిల్డ్రన్ పార్క్ స్థలం కబ్జాకు సహకరించిన రాజకీయ పెద్దలు ఎవరు..? లంచాలు మత్తులో చేతులు కలిపిన అధికారులు ఎవరు..? ఎవరెవరికి ఎంతెంత వాటా ముట్టింది..? పార్క్ స్థలం కబ్జాకు ఇంతగా తెగించిన కబ్జాదారులు వెనుక వుండి నడిపించింది ఎవరు..? ప్రభుత్వ స్థలాలకు, పార్కులకు రక్షణ లేకుండా పోతుండటం దేనికి సంకేతం.. దేని ఆధారంగా అధికారులు అనుమతులు జారీ చేశారు..? నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వానికే కుచ్చుటోపీ పెడుతున్న దుర్మార్గులు ఎవరు..? అన్న విషయాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది
ఆదాబ్ హైదరాబాద్ : ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు