Tuesday, May 7, 2024

యూనివర్సిటీలు, బోర్డుల పరీక్షా విధానాల్లో సకారాత్మక మార్పులు సాధ్యపడవా!

తప్పక చదవండి

భారతదేశ విద్యా వ్యవస్థ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,100 పైగా యూనివర్సిటీలు, 50,000 అనుబంధ కళాశాలలు, 700 స్వయంప్రతిపత్తి కలిగి సంస్థలు, 40.15 మిలియన్ల విద్యా ర్థులతో అతి భారీ భారత ఉన్నత విద్యా వ్యవస్థ అనేక రకాల పరీక్షా విధానాలు, వేరు వేరు మూల్యాంకన పద్దతులతో మూస పద్దతిలో నడుస్తున్నాయి. వీటికి తోడుగా భారతంలో 60 వరకు స్కూల్‌ బోర్డుల ద్వారా 15 మిలియన్ల విద్యార్థులు తమ తమ పరీక్ష లు వ్రాసి మార్కులు/ ర్యాంకులు/గ్రేడ్లు పొందుతున్నారు. పరీక్ష విధానాలు ఎలా ఉన్నా మార్కులు లేదా ర్యాంకులు ఘనంగా దాదా పు 100 శాతానికి సమీపంగా ఉంటూ తల్లితండ్రులను, విద్యార్థుల ను సంతోష సాగరాల్లో ముంచెత్తుతున్నాయి. మరో కోణంలో పరిశీలిస్తే విద్యార్థులు పొందిన మార్కులు/ ర్యాంకులకు వారు ప్రదర్శించే విజ్ఞాన నైపుణ్యాలకు అందనంత దూరం కనిపిస్తోంది.
పరీక్షా విధానాల్లో లొసుగులు లేదా స్కామ్‌లు:పరీక్షా విధానాల్లో నెలకొన్న ప్రమాణాలతో కూడిన ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల్లో గోప్యత, విద్యార్థిలో డిజిటల్‌ యుగపు అవసర గుణాలను పరీక్షించే పద్దతులు ప్రస్తుత కనీస అవసరాలు కావాలి. గోప్యతలో లోపంతో పేపర్‌ లీకేజ్‌ కుంభకోణాలు నిత్య వార్తలు అవుతూ యువత ఆగ్రహానికి కారణం అవుతున్నది. బోధనా పద్దతులు, సిలబస్‌ రూపకల్పనలు, మూల్కాంకన విధానాలు, ప్రశ్నాపత్రాల్లో బహుముఖీన ప్రతిభను గుర్తించే ప్రశ్నలు, పారదర్శక విద్యా విధానాలు లాంటివి నేడు ప్రశ్నార్థకంగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. విద్యాలయాలు మార్కులు/ర్యాంకులను పంపిణీ చేసే కేంద్రాలు మాత్రమే కావని, విద్యార్థిలో పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన విజ్ఞాన నైపుణ్య పౌరుడిగా మార్చగలిగే సరస్వతి కోవెలలుగా ఉండాలని కోరుకుంటున్నాం. యూనివర్సిటీలు, విద్యాలయాలు, బోర్డులను బట్టి పరీక్షా విధానాలు మారడం సముచితం కాదు. దేశ విద్యా వ్యవస్థలన్నీ ఒకే రకమైన పరీక్షా విధానాలు, సిలబస్‌లు, మూల్యాంకనాలు, బోధనా పద్దతులను పాటించే విధంగా చూడాలి.
నేటి భారత విద్య, పరీక్షా విధానాలు:నేటి విద్యా సంస్థలు నిర్వహించే పరీక్షలు విద్యార్థుల్లో సిలబస్‌ను బట్టి పట్టి పరీక్షల్లో సమాధానాలు రాయడం, జ్ఞాపక శక్తిని మాత్రమే తెలుసుకుంటు న్నాయనే వాదన అనాదిగా వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించి, సిలబస్‌ పూర్తి చేయడంతో చేతులు దులుపుకుంటున్నారని మన అనుభవం స్పష్టం చేస్తున్నది. ఆధునిక యువతలో దాగిన అపార విజ్ఞాన వివేకాలు, జ్ఞాపక శక్తి, సిలబస్‌లోని అంశాల పట్ల సంపూర్ణ అవగాహన, విజ్ఞాన విస్తృతి, లోతైన విషయ పరిజ్ఞానం, సృజనశీలత, వైవిధ్యభరిత ఆలోచనలు, అనువర్తిత పరిజ్ఞానం, ప్రయోగశాల అనుభవాలు, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు, విశ్లేషణాత్మక విజ్ఞానం, క్రిటికల్‌ అండ్‌ లాజికల్‌ థింకింగ్‌ లాంటి అంశాలతో కూడిన విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి పరీక్షా విధానాలల్లో సమూల మార్పులు రావాలని నిపుణులు కోరుతున్నారు. పలు సందర్భాల్లో ప్రశ్నాపత్రాల్లో పొరపాట్లు, భాషా/అక్షర దోషాలు, సిలబస్‌కు సంబంధం లేని ప్రశ్నలు, అసంబద్ధ ప్రశ్నలు, లోతైన విజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు లేకపోవడం, అనేక ఇతర తప్పులు తరుచుగా కనిపించడం సాధారణ అంశం అవుతున్నది. పరీక్షలు పూర్తి అయిన తర్వాత కొన్ని ప్రశ్నలను తొలగించడం లేదా అందరికీ మార్కులు సమానంగా వేయడం లాంటివి సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సందర్భాల్లో ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాలను లేదా తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడానికి మరో నిపుణుల కమిటీ నియమించడం కూడా మామూలు అయ్యింది.
మార్కులకు, ప్రతిభకు పొంతన ఉందా: మూల్యాంకనాల్లో మార్కు లు, గ్రేడ్‌లు లేదా ర్యాంకులతో విద్యార్థి ప్రతిభకు పొంతన లేకపో వడం కూడా కనిపిస్తున్నది. లోతైన విషయ పరిజ్ఞానం, అవసర శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాస అంశాల్లో పట్టు లాంటి అంశాలను కోరుకునే కంపెనీలకు అర్హతకు తగిన యువత దొరక డం లేదు. లక్షల్లో పాసవుతున్న విద్యార్థుల్లో 10 శాతానికి కూడా అర్హత కలిగిన ఉద్యోగాలు రావడం లేదు. మెమోలో మార్కులు లేదా ర్యాంకులు ఘనంగా ఉన్నప్పటికీ పలు ఆధునిక నైపుణ్యాల కొరతతో యువత నిరుద్యోగ వలయంలో చిక్కి విలవి ల్లాడుతు న్నారు. యూనివర్సిటీలు అందించే పట్టాలు/ ర్యాంకులు /గ్రేడ్లు/ మార్కులను నమ్మకుండా బహుళజాతి కంపెనీలు తమ తమ ఉద్యోగ నియామకాల్లో వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించ డానికి ప్రత్యేక నియామక పరీక్షలు నిర్వహించడం చూస్తున్నాం.
విద్యా ప్రమాణాలు కొరవడడానికి కారణాలు: స్వయం ప్రతిపత్తి పొందిన ఉన్నత విద్యా సంస్థలు, కొన్ని యూనివర్సిటీలు తమ సిలబస్‌లను తామే రూపొందించుకోవడం, తమ పరీక్షలను తామే నిర్వహించడం, పశ్నాపత్రాలను తయారు చేసుకోవడం, మూల్యాం కానాలు చేయడం, ఫలితాలను ప్రకటించడం లాంటి అధికారా లను కలిగి ఉన్నాయి. ఇలాంటి ఉన్నత విద్యా సంస్థలు కొన్ని తమ కళాశాలలు/యూనివర్సిటీలు తమ ఫలితాలను అతిగా చూప డానికి కొంత వరకు విద్యా ప్రమాణాలను తగ్గించడం, మూల్యాం కనాల్లో ఉదారత చూపడం, సరళ ప్రశ్నాపత్రాలు రూపొందిం చడం, ముఖ్య ప్రశ్నలను ముందుగానే లీక్‌ చేయడం, పరీక్షా విధా నాల్లో పారదర్శకత లోపించడం లాంటి విధానాలను పాటించడం విచారకరం. పరీక్షా విధానాల్లో కావలసిన మార్పులు: మన విద్యా విధానంలో అత్యాధునిక సిలబస్‌ కూర్పు, బోధనా పద్దతులు, క్షేత్ర పర్యటనలు, పరిశ్రమలతో అనుసంధాన విద్యా బోధనలు, ఉద్యోగ సాధన నైపుణ్యాల పెంపు, సాంకేతిక నైపుణ్యాల పెంపు, సృజన పోషనకు అవకాశాలు, విలక్షణ ఆలోచనలకు అవకాశాలు, మల్టీడి సిప్లినరీ కోర్సులు, విద్యార్థిలో పరిశోధనా స్ఫూర్తిని రగల్చడం, ప్రత్యేక నైపుణ్యా లను పరీక్షించడం, విద్యార్జన లో విద్యార్థి ప్రగతిని దినదినం పరీక్షి ంచడం, అర్హత కలిగిన బోధనా సిబ్బందిని నియ మించు కోవడం, మార్కులకు విషయ పరిజ్ఞానానికి సారూప్యత ఉండడం, యూని వర్సిటీ పట్టాను చూసి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి రావడం, బహు ముఖీన వ్యక్తిత్వ వికాసాలను సాధించడం లాంటి సకారాత్మక మార్పులతో మన విద్యా వ్యవస్థ ఆధునిక డిజిటల్‌ రంగులద్దు కుంటూ రూపాంతరం చెందాలి. అవుట్‌డేటెడ్‌ పరీక్షావి ధానాలతో నిరుద్యోగులుపుడతారని తెలుసుకొని అప్‌డేటెడ్‌ సూత్రా లకు అనుగుణంగా మన పరీక్షా విధానాలను మార్చుకో వాలి. ‘‘అప్‌డేట్‌ కాకపోతే అవుట్‌డేట్‌ అవుతాం’’ అని యువత అర్థం చేసుకోవాలి. పరిక్షా పత్రాలు రూపొందించడం, పరీక్షలను పారద ర్శకంగా నిర్వ హించడం, సమాధాన పత్రాల మూల్యాంక నాల్లో సారూప్య తలు, మెమోల తయారీలో స్పష్టత, ప్రశ్నాపత్రాల్లో గోప్య త, పరీక్షల నిర్వహణలో పటిష్టత, ఫలితాల విడుదలలో స్పష్టత లాంటి సత్వర చర్యలు మన పరీక్షా విధానాల్లో తక్షణమే రావాలి.
` డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు