Wednesday, May 1, 2024

పార్లమెంట్‌ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

తప్పక చదవండి
  • నేటినుంచి పార్టీ నేతలతో కెటిఆర్‌ సమీక్ష
  • వచ్చే లోక్‌సభలో గెలుపే లక్ష్యంగా భేటీలు

హైదరాబాద్‌
తెలంగాణ ఎన్నికలలో పరాభవంతో డీలా పడిపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులను వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తం చేయడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఇందు కోసం కసరత్తు ప్రారంభించారు. కసరత్తులో భాగంగా కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యనేతలతో వరుస భేటీలకు రెడీ అయ్యారు. బుధవారం నుంచి వరుస భేటీలతో పార్లమెంట్‌ ఎన్నికలకు నేతలను సన్నద్దం చేయబోతున్నారు. ఈ భేటీలలో లోక్‌ సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించి నేతలకు, క్యాడర్‌ కు దిశా నిర్దేశర చేయనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకు టికెట్లు కేటాయించడం వల్లనే భంగపాటుకు గురయ్యామన్న అంచనాల నేపథ్యంలో కేటీఆర్‌ ప్రధానంగా లోక్‌ సభ అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకు టికెట్లు ఇవ్వకుండా ఉంటే మరిన్ని స్థానాలలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి అధికారపగ్గాలను అందుకుని ఉండేదన్న భావనలో ఉన్న పార్టీ అధినాయత్వం, అటువంటి పొరపాటు లోక్‌ సభ ఎన్నికలలో జరగకుండా పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలన్న నిశ్చయయంతో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌ కు ప్రజలలో గట్టి పట్టు ఉందని రుజువు కావడంతో ఇక్కడ ఉన్న రెండు పార్లమెంటు స్థానాలలోనూ అభ్యర్థులను రంగంలోకి దింపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి స్థానాల నుంచి పార్టీ ఎవరిని పార్టీ బరిలోకి దింపనున్నదన్న దానిపై పార్టీలో ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో ఈ రెండు లోక్‌ సభ స్థానాలలోనే పోటీ కోసం తహతహలాడుతున్న బీఆర్‌ఎస్‌ ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇతర జిల్లాలకు చెందిన నేతలు సైతం ఈ రెండు స్థానాలలోనూ ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆసక్తి చూపుతుండగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలూ కూడా రేసులో ఉన్నామంటున్నారు. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం తమ కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ కూడా రేసులోకి వచ్చారు. అలాగే దాసోజు శ్రవణ్‌ కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే గ్రేటర్‌ పరిధిలోనే ఉన్న హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై మాత్రం బీఆర్‌ఎస్‌ పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు