Wednesday, May 15, 2024

సంకెళ్లను తెంచి.. స్వేచ్ఛను పంచి..

తప్పక చదవండి

పాలకులం కాదు.. సేవకులమే అన్న మాటను నిలబెట్టుకున్నాం

  • సీఎం రేవంత్‌ రెడ్డి పాలనకు నెల రోజులు
  • తన పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌ రెడ్డి
  • నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం
  • పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం
  • 33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం ఆలోచనలు
  • వాటి సంఖ్యను తగ్గించడంపై రేవంత్‌ దృష్టి!
  • అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం

అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ.. ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది..

- Advertisement -

‘‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.’’

  • సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పాలన నెలరోజులు పూర్తి చేసుకున్నారు. ఈనెల రోజుల పాలనలో రేవంత్‌ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. డిసెంబర్‌ 7న తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పాలనకు నేటితో నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తన నెలరోజుల పాలనను గుర్తు చేస్తూ రేవంత్‌ రెడ్డి స్పెషల్‌ ట్వీట్‌ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా.’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.
కాగా, నేడు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ కానుంది. అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రోజుతో నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్‌ భేటీ కావటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో నెల రోజుల పాలన, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. అయితే.. ఇవే కాకుండా పలు కీలక అంశాలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీ ఎన్నికలు జరగనుండటంతో.. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చేలోపే.. ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్లు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ నియామకం లాంటి ప్రక్రియలు పూర్తి చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో.. ఈ అంశాలు కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం లేకపోలేదు. మరోవైపు.. అసెంబ్లీలో ప్రకటించినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ విషయాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి సంబంధించిన అంశంపై కూడా కేబినెట్‌లో మంత్రులు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హుల ఎంపిక.. వంద రోజుల్లో పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్చలపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కూడా కేబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం ఆలోచనలు
తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్‌ సర్కారు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా, ఆయన జిల్లాల పునరేకీకరణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనతో ఉన్నారు. 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి, జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కోసం ఓ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు రేవంత్‌ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు