Saturday, April 27, 2024

“వట్టినాగుల పల్లి” లో అక్రమార్కుల బరితెగింపు..

తప్పక చదవండి
  • కమర్షియల్ నిర్మాణాలకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండ..
  • ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులైతే ఎలాంటి చర్యలుండవా..?
  • నోటీసులతో కాలం వెళ్లదీస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • మున్సిపల్ ఆదాయానికి కోట్లలో గండికొడుతున్న అక్రమార్కులు..
  • సి.డీ.ఎం.ఏ. కమిషనర్ పమేలా సత్పతి అక్రమ నిర్మాణాలపై స్పందించేనా..?

అక్రమనిర్మాణాలను ఆదిలోనే అడ్డుకొని అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మీనమేషాలు లెక్కించడంతో అక్రమ నిర్మాణదారులు పేట్రేగిపోతున్నారు.. నర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో వట్టినాగుల పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తున్నారని బహిరంగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

నార్సింగి: రంగారెడ్డి జిల్లా, నార్సింగి మున్సిపాలిటీ, వట్టినాగుల పల్లి అడ్డాగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయి.. ఈ అక్రమ నిర్మాణాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు వత్తాసు పలకడంతో నిర్మాణదారులు చెలరేగిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అక్రమ నిర్మాణాలను గుర్తించి మొదట్లోనే అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పేకమేడల్లా దర్శనం ఇస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఎమ్మెల్యే, ఎంపీ బంధువులమంటూ అక్రమ నిర్మాణదారులు సరికొత్త పంథాను ఎంచుకుని తమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.. ఎంపీ, ఎమ్మెల్యే బంధువులైతే అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉండవా..? ఎంతటి అక్రమాలకైనా తెగబడవచ్చా..? అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.. అందులో భాగంగా సుమారు 4 ఎకరాల్లో “ప్రధాన్ కన్వెన్షన్ హాల్” నిర్మించడంతో ఆదాబ్ దినపత్రిక ఈ ఏడాది జూన్, 12, 13 తేదీల్లో ఆ విషయాన్ని ప్రచురించింది.. కానీ నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. పైగా టౌన్ ప్లానింగ్ అధికారులు జిల్లా టాస్క్ ఫోర్స్ (డీ.టి.ఎఫ్.) అధికారులకు కూల్చివేతలు జరిపేందుకు లెటర్లు పంపామంటూ దాటవేతలు జరుపుతున్నారు.. కనీసం అక్రమ నిర్మాణాలను ఆప్ ప్రయత్నం చేయకపోవడం శోచనీయం.. జిల్లా టాస్క్ ఫోర్స్ కు లెటర్లు పంపితే వారు ఎందుకు స్పందించడం లేదు..? అసలు లెటర్లు పంపుతున్నారా లేదా..? లేక టౌన్ ప్లానింగు అధికారులే డ్రామాలు ఆడుతున్నారా..? “ప్రధాన కన్వెన్షన్ హాల్ ” పక్కనే పబ్ నిర్మాణం జరుగుతోంది.. దాని వెనువెంటే సుమారు రెండు ఎకరాల్లో హోటల్ నిర్మాణం భారీ ఎత్తున జరుగుతోంది.. ముందుకెళితే మరో పబ్ నిర్మాణం, దీనికి కుడివైపున డ్యాన్స్ శిక్షణ కోసం డబుల్ డెక్కర్ తో పెద్ద షెడ్ల నిర్మాణాలు, అన్వయ్ ఫంక్షన్ హాల్ పక్కన ఫ్రీజమ్ పబ్బు ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ పోలీస్, మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతులు లేవని స్థానికులు పేర్కొంటున్నారు.. శుక్ర, శని, ఆదివారాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఫ్రీజమ్ పబ్ అడ్డాగా మారిందని ఈ ప్రాంత ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.. ఇంత జరుగుతున్నా పోలీస్, మున్సిపల్ అధికారులకు తెలియదా..? తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.. గౌలిదొడ్డి గ్రామంలో ఐటీ ఉద్యోగులైన యువతీ, యువకులు హాస్టళ్లలో వేళల్లో ఉండటంతో ఫ్రీజమ్ పబ్ యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తోందని స్థానిక ప్రజలు ఏ ముగ్గురు కలిసినా ఇదే చర్చ జోరుగా సాగుతోంది.. అందుకే ఫ్రీజమ్ పబ్ యాజమాన్యం పోలీస్, మున్సిపల్ అధికారులకు నెలవారీ మామూళ్లు భారీ మొత్తంలో ముట్టజెప్పడంతో వారు ఈ పబ్ వైపు కన్నెత్తి చూడటం లేదన్నది మరోవైపు చర్చ సాగుతోంది..
ఈ అక్రమ నిర్మాణాల వల్ల మున్సిపాలిటీకి కోట్లల్లో నష్టం వాటిల్లుతున్నప్పటికీ ఉన్నతాధికారులు సైతం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజల్లో సందిగ్ధం నెలకొంది.. నూతనంగా భాద్యతలు చేపట్టిన సి.డీ.ఎం.ఏ. కమిషనర్ పమేలా సత్పతి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు