Thursday, May 16, 2024

ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆకలి బతుకులే..

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ వచ్చాక మారిన పాలమూరు పరిస్థితులు
  • ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు గెలవకూడదన్న కేసీఆర్
  • పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ ఎవడు తెచ్చిండు..
  • తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను చీల్చే కుట్ర
  • రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఓట్లు అడుగుతున్నారా..?
  • వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం
  • గెలిచిన నెల రోజుల్లోనే కందనూలుకు ఇంజినీరింగ్ కాలేజీ
  • కల్వకుర్తిలో 1.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది
  • ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. సీఎం కేసీఆర్ ప్రచారంలో గేరు మార్చారు. ఈ క్రమంలోనే.. ఆదివారం పాలమూరు జిల్లాలోని నాలుగు సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని, పైగా 2004లో పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…‘ఏం చేసింది ఈ కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు ? ఆ నాడు చేసింది చాలాక మళ్లీ కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నరు సిగ్గులేకుండా. ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నరు. ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే ? మనం చూడలేదా? ఎన్టీ రామారావు పార్టీ రెండురూపాయలకు కిలోబియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు. అంత ఎండి సచ్చినం. ఎవ్వడు ఆదుకున్నోడు లేడు. పేదల బాధలు పట్టించుకున్నోడు లేడు. పేదలకడుపు నింపాలన్న సోయి లేదు. రైతుల పొలాలకు నీరిచ్చే సోయి లేదు. ఏదీ చేయలేదు’ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. ఐదారు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది… ఆ తర్వాత తెలంగాణ ఇస్తానని మాట తప్పింది… కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మహబూబ్ నగర్‌లో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిచేవన్నారు. ఇప్పుడు వచ్చిన మార్పును అందరు చూడాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలం అంతా తెలంగాణకు వెనుబడిన ప్రాంతమని.. గరీబు ప్రాంతమంటూ కాంగ్రెస్‌ పార్టీ పేరు పెట్టింది. ఇక్కడ వడ్లు పండయని.. కేవలం జొన్నలు మాత్రమే పండించుకోవాలని చెప్పారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం కూడా తెలంగాణకు నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు మాట్లాడారని.. కానీ ఈరోజు తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని కేసీఆర్ వివరించారు. కొల్లాపూర్‌లో 1.25 లక్షల ఎకరాల్లో వడ్లు పండుతన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పక్కన కృష్ణా నది ఉన్నా కొల్లాపూర్‌కు మంచి నీళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి నీళ్లు ఇవ్వలేదు.. సాగు నీళ్లు ఇవ్వలేదు.. కరెంటు కూడా ఇవ్వలేకపోయారు.. పేద ప్రజలకు ఆదుకోలేదని.. మరి ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. వాల్మీకి, బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని, మరోసారి అధికారంలోకి వస్తే వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకు పోతున్నా అప్పుడు కాంగ్రెస్ నేతలు పదవుల మీద ఆశతో ఎవరూ మాట్లాడలేదని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. ‘ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఉండే పింఛన్ రూ.2 వేలు చేశాం. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతాం. 24 గంటల కరెంట్, రైతుబంధు రూ.16 వేలు అందిస్తాం.’ అని వివరించారు. మరోవైపు రాహుల్ గాంధీపై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు గులాబీ బాస్. ఇందిరమ్మ వారసుడు రాహుల్‌ గాంధీ కొల్లాపూర్‌కు వచ్చాడని గుర్తు చేసిన కేసీఆర్.. అసలు అతను ఎందుకు వచ్చాడని అడిగారు. గడ్డి కొయ్యడానికి వచ్చాడా..? మళ్లీ తెలంగాణను ఆగం చేసి, ముళ్ల కిరీటం పెట్టడానికి వచ్చిండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస మాటలు నమ్మి మోసపోవద్దని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చర్చించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరోసారి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు