Tuesday, April 30, 2024

బోడుప్పల్లో ఘరానా మోసం.. !

తప్పక చదవండి
  • “పుడమి” రియల్ ధగా..
  • ‘డివైన్ ‘మార్కెటింగ్ అక్రమ దందా..
  • లేని భూమికి లే అవుట్..
  • కోట్లు దోచుకుంటున్న రియల్టర్లు…
  • బై బ్యాక్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి…
  • అధిక వడ్డీ ఆశకు ప్రజలు నిండా మునగాల్సిందేనా!!

హైదరాబాద్: సామాన్య ప్రజానీకం ఎవరూ.. ఎప్పుడూ.. ఎక్కడా.. మోసపోయినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులు మాత్రమే.. కానీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేని సివిల్ కేసుల విషయంలోనూ, సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అప్రమత్తం చేసే ప్రయ త్నం చేస్తున్నారు. అయినా తెలిసీ తెలియక జరిపిన లావాదేవీల కారణంగా నష్టపోయిన భూమి కొనుగోలుదారులకు, బాధితులకు అండగా నిలిచి, జరిగిన నష్టాన్ని అంచన వేసి న్యాయం చేస్తున్నారు. నేటికీ ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న కేసులతో పోలీసులు సహవాసం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో దళారులు, మోసగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తూ.. తమ విధిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కానీ ఇవేవీ తెలియని సాధారణ ప్రజానీకం కొత్త పంధాతో వస్తున్న రియల్ మోసగాళ్ల బారినపడి బలవుతున్నారు. ఇందులో ఆర్థికంగానే కాకుండా, ఒక్కొక్కసారి అమాయకుల ప్రాణాలు కూడా నష్టపోవడం బాధాకరం. ఈ కోవకే చెందిన డివైన్ ఇన్ ఫ్రా, పుడమి ఇన్ఫ్రా పేరుతో వినియోగదారుల డబ్బుకు బై బ్యాక్ పేరుతో కొత్త మోసానికి తెరలేపారు. అమాయకుల బలహీనతను ఆసరాగా ఎంచుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. అసలు వారి వద్ద లేని భూమికి డిజిటల్ మాయాజాలంతో మార్కెటింగ్ మోసగాళ్లతో సొంతింటి కలను ఎరగావేసి అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో సంగారెడ్డి కేంద్రంగా సన్ పరివార్ పేరుతో ‘మెతుకు రవీంధర్’ వేలాదిమంది వినియోగదారులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేశారని ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు అదే తరహాలో బాగస్వాములను ఏర్పాటు చేసుకొని, తమ వ్యాపార రంగాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నారు. భాగస్వాములతో కలిసి ఆయనే యాదగిరిగుట్ట, చిట్యాల, నార్సింగ్ ప్రాంతాలలో నూతనంగా వెంచర్లను నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ చేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు కార్యాలయాలు ఉన్నట్లుగా రికార్డుల్లో ఉన్నప్పటికీ రెండు కార్యాలయాలను మూసివేసినట్లు తెలిసింది. ప్రస్తుతం బోడ ఉప్పల్, బౌద్ధ నగర్ కేంద్రంగా మాత్రమే ఒకే ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ కోసం ముఖ్యంగా ఆకర్షణీయమైన బహుమతులను కమిషన్ లను కమిషన్ల ఏజెంట్లకు అందజేస్తూ.. వ్యాపారాల్లో తమకు ఎటువంటి సంబంధం లేనట్టుగా డైరెక్టర్ల మధ్యవర్తిత్వంతో నిర్వహిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న కార్యాలయం ఒకటి మూసివేస్తే.. తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండబోతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టామని, వీరు జెండా ఎత్తిస్తే మా బతుకులు రోడ్డున పడతాయని తల్లడిల్లుతున్నారని పలువురు తెలియజేస్తున్నారు. పుడమి, డివైన్ ఇన్ఫ్రాల సంస్థలు తమ జీవితాలతో ఆటాడుకుంటున్నాయని పలువురు ఏజెంట్ లు సైతం తమ గోడు వెల్లబోసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి పెట్టిన ఆశావహులు, బాధితులు పరిస్థితి గమనించి, అసలు విషయాలు తెలుసుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియల్గా రియల్ వ్యాపారం చేయలేని మెతుకు రవీందర్ ఇతర డైరెక్టర్లు, మరెందరో రియల్ వ్యాపారులు అమాయకులైన ప్రజానీకాన్ని మార్కెటింగ్ పేరుతో రియల్ భూమ్ పేరుతో దోచుకుంటున్నా.. అమాయక ప్రజానీకానికి కనువిప్పు కలవకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, ఇలాంటి దారుణాలకు ఒడి కడుతున్న సంస్థలను వాటిని నిర్వహిస్తున్న దళారులను ముందస్తుగానే కట్టడి చేయాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బోర్డు తిప్పేసినాక ప్రజలు లబోదిబోమంటుంటే, ఆగమేఘాలపై చర్యలు తీసుకునే పోలీసులు ముందుగానే ఇటువంటి వారిపై నిఘా వేస్తే.. ప్రజలకు భరోసాతో పాటు, ముందుగానే నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని మేధావులు ఊటంకిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు