Friday, May 3, 2024

తెలంగానంతా కల్తీ రాజ్యమేలుతోంది..

తప్పక చదవండి
  • తూనికలు, కొలతల శాఖ అవినీతి మత్తులో జోగుతోంది..
  • లీగల్ మెట్రాలజీకి ఒక్క ఫిర్యాదు చేస్తే 48 గంటల్లో చర్యలు అనుమానమే..
  • వ్యాపారస్తులతో చేతులు కలిపి వినియోగదారులకు పంగనామాలు..
  • వినియోగదారుల రక్షణ అటుంచితే.. జేబులు నింపుకోవడమే పరమావధి..
  • బాధ్యతలు మరచిన మెట్రాలజీ డిపార్ట్మెంట్ ను గాడిలో పెట్టేదెవరు..?

( తూనికలు, కొలతల శాఖ నిర్వాకంపై ‘ఆదాబ్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..)

ఆడపిల్ల, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని ఓ కవి చెప్పినట్లుగా.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యమేలుతోంది. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడే. ఉదయం లేచింది మొదలు ప్రతీది కిరాణా షాపుకు లేదా కూరగాయల కొట్టుకో పరిగెత్తి కొనుగోలు చేయాల్సిందే. నిత్యావసరాలైన పప్పులు, ఉప్పులు, కూరగాయలు మొదలు మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యంగా ఉన్నదా..? కొలతలు సరిగ్గా ఉన్నాయా..? అంటే డౌటే…నాణ్యత ప్రమాణాలకు సరిగా ఉండని వస్తువులు వినియోగదారుడికి దొరకనప్పుడు ఏం చేయాలి..? ఎవరికీ ఫిర్యాదు చెయ్యాలి..? మనం డబ్బు ఖర్చు పెట్టి సరైన నాణ్యత, తూకం లేని వస్తువు కొని అయ్యో అంటూ బాధపడాలా..? అంటే అవసరం లేదు.. మనం లీగల్‌ మెట్రాలజీకి ఒక్క ఫిర్యాదు చేస్తే.. వారు 48 గంటల్లో చర్యలు తీసుకుంటారు అని మీకు తెలుసా..?

- Advertisement -

హైదరాబాద్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ గురించి మీకు తెలుసా…? తూనికలు, కొలతల శాఖ అంటే సామాన్యులకు కూడా సులభంగా అర్థం అవుతుంది…ప్రజలు వారు కొనుగోలు చేసిన వస్తువులు సరి అయిన తూకంలో ఉన్నాయా.. లేవా..? అనే విషయాలపై నిఘా పెడుతూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. వినియోగదారుల రక్షణలో ఈ విభాగం నిర్వహించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ శాఖ వినియోగదారుల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూ.. వ్యాపారులకు అనేక మార్గదర్శకాలను పెట్టింది… అయితే వ్యాపారాలు బాగా జరిగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బడా సంస్థలు సహా, రోడ్లపైన తోపుడు బండ్లు నిర్వహించేవారు, చిన్న చిన్న వ్యాపారులు వీటిని సరిగా ఆచరించడం లేదు అనేది వాస్తవం.. అసలు తూనికలు కొలతల శాఖ వినియోగదారుల రక్షణకోసం ఏమి ప్రమాణాలు విధించిందో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రతి రెండేండ్లకోసారి ప్రామాణిక ముద్రలు :
తూనిక రాళ్లకు ప్రతి రెండేండ్లకోసారి తూనికలు, కొలతల శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ) నుంచి ప్రామాణిక ముద్రలు వేయించుకోవాలి. ఇందుకు కొంత నగదును తూనికలు, కొలతల శాఖకు ఫీజు రూపంలో చెల్లించాలి. అదే ఎలక్ట్రానిక్‌ కాటా అయితే ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలు చేయించుకొని స్టాంపులు వేయించుకోవాలి. అయితే వ్యాపారులు 70 శాతం మంది ప్రామాణిక ముద్రలు వేయించుకోవడంలేదు అనేది ఒక సర్వే లో తేలిన నిజం… అధికారులు తమ టార్గెట్ లను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో అడపాదడపా దాడులు చేసి, మొక్కుబడిగా కొంత ఫైన్ విధించి తూతూ మంత్రంగా వీటిని ముగిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి… పలుచోట్ల తోపుడు, కూరగాయల మార్కెట్లు, కిరాణా వ్యాపారాల్లో ఇప్పటికీ తూకం రాళ్లతో పాతపద్ధతిలోనే విక్రయిస్తున్నారు. సరాసరి ప్రతి కిలోకు 100 గ్రాముల వరకు నష్టపోతున్నట్లు అంచనా.. ఇదిలా ఉండగా వ్యాపారులు వినియోగించే తూనికలు, కొలతల యంత్రాలపై తప్పనిసరిగా ప్రామాణిక ముద్రలు వేయించుకునేలా అధికారులు శ్రద్ధ తీసుకుని నిఘా పెంచాల్సిన అవసరం అయితే ఉంది.. లీగల్ మెట్రాలజీ విభాగం యొక్క మొదటి, ప్రధాన విధి వినియోగదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం. అంతర్జాతీయ యూనిట్ల వ్యవస్థ (ఐఎస్ఐ) కి అనుగుణంగా ప్రమాణాల ఏకరూపతను తయారు చేయడం. లీగల్ మెట్రాలజీ యొక్క నిజమైన సహాయం ఇంకా సేవలను అందించడం ద్వారా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం. ముఖ్యంగా వాణిజ్య లావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల కొలతలలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ యొక్క గొప్ప భాద్యత కట్టుబడి ఉన్న విధి. అయితే వీరి బాధ్యతలతో పాటు ప్రజలు కూడా సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం… పెట్రోల్ బంక్ ల దగ్గరనుండి, వెండి, బంగారు నగలకు సంబంధించి జ్యువలరీ ప్రతివిషయంలో వారు మోసపోకుండా ఉండటం కోసం తగిన జాగురకతతో ఉండటం.. అలాగే ఏదైనా మోసం జరిగితే తూనికలు, కొలతల శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ) కు ఆన్లైన్ లో కానీ లేదా ఫోన్ ద్వారా కానీ పిర్యాదు చేసి చర్య తీసుకునే విధంగా అలెర్ట్ గా ఉండాలి.. కానీ ఇక్కడ అందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది.. డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెటాలజీ విభాగంలో అవినీతి అంతకంతకు పెరిగి, వినియోగదారులను విస్మరించి, సొంత పనులను చక్కబెట్టుకునే హడావిడిలో శాఖ ఉందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా సూర్యాపేట జిల్లాలో ఒక బంకు యజమాని ఒక అధికారితో కలిసి ఆడిన నాటకం బహిర్గతమై అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంకా కొందరు అధికారులు సుదీర్ఘకాలం ఒకే చోట విధులు నిర్వహిస్తూ తమకు అనుకూలమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకొని బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారని విశ్రాంత ఉద్యోగులే కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. ప్రతినిత్యం వినియోగదారునికి తూనికలు, కొలతల శాఖతో అనుబంధం కచ్చితంగా ఉంటుంది.. కానీ ఈ విభాగం అధికారులను, సిబ్బందిని వ్యాపారస్తులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోయినట్లు కనిపించడం లేదు. కారణం.. వారు సమర్పిస్తున్న తాయిలాలు కావచ్చు, లోపాయికారి ఒప్పందాలు కావచ్చు. దరిమిలా ఎక్కడ చూసినా కల్తీనే.. ఇప్పటికైనా వినియోగదారుని సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ పై నిఘాని పెంచి, అవినీతిమయమైన శాఖను ప్రక్షాళన చేసి, పారదర్శకమైన సేవలను అందించాలని పలువురు మేధావులు కోరుకుంటున్నారు. మరింత సమాచారంతో మరో కథనంతో మళ్లీ మీ ముందుకు తీసుకువస్తాం..’ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు