Sunday, April 21, 2024

పవర్‌ పై వైట్‌ పేపర్‌

తప్పక చదవండి

(విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల.. మొత్తం అప్పు రూ.81,516 కోట్లు)

  • నష్టాల ఊబిలోకి విద్యుత్‌ రంగం
  • రూ. 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు..
  • గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  • సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి
  • మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ
  • సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి
  • యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ
  • గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం
  • అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీశ్‌ రెడ్డి
  • ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారరన్న కోమటిరెడ్డి

జెన్‌ కో అప్పులు
రాష్ట్రం ఏర్పడే నాటికి : రూ. 7,662 కోట్లు
ఇతర అప్పులు : రూ.5,107 కోట్లు
పదేండ్లలో చేసిన అప్పు : రూ. 25,135 కోట్లు
కొత్తగా చేసిన ఇతర అప్పు రూ.9,524 కోట్లు
మొత్తం రుణభారం అప్పట్లో : రూ. 16,635 కోట్లు
తాజాగా అప్పుల భారం : రూ.53,963 కోట్లు

- Advertisement -

ట్రాన్స్‌ కో అప్పులు
రాష్ట్రం ఏర్పడేనాటికి : రూ. 2,411 కోట్లు
ఇతర అప్పులు : రూ. 2,897 కోట్లు
పదేండ్లలో చేసిన అప్పు : 8,119 కోట్లు
కొత్తగా చేసిన ఇతర అప్పు : 8,719 కోట్లు
మొత్తం రుణభారం అప్పట్లో : రూ.6,277 కోట్లు
తాజాగా అప్పుల భారం : రూ. 24,476 కోట్లు

డిస్కంల నష్టాలు రూ. 62,461 కోట్లు
శాఖల బకాయిలు రూ. 28,842 కోట్లు
లిఫ్ట్‌ ఇరిగేషన్‌ బిల్లు రూ.14,193 కోట్లు
ట్రూ అప్‌ చార్జీల డ్యూస్‌ రూ. 14,928 కోట్లు
వ్యవసాయానికి కరెంటు సప్లయ్‌ 19 గంటలే
పదేండ్లలో కొత్త పంపుసెట్లు 9 లక్షలు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ చర్చ సాగింది. విద్యుత్‌ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్‌ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్‌ సరఫరానే వెన్నెముక అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్‌ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు.ప్రభుత్వం తీరును ఎండగడుతూనే గతంలో ఎలా విద్యుత్‌ను సరఫరా చేశామో అని మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం అనవసరంగా అప్పులు చేసి సంస్థను నష్టాల్లోకి పూడుకుపోయేలా చేసిందని ప్రకటించింది. దీంతో విద్యుత్‌పై జ్యుడిషియల్‌ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్‌ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురుదాడి చేసినం అని అనుకుంటున్నారని.. తొమ్మిదిన్నర ఏళ్లలో వాస్తవాలను సభ ముందు గత ప్రభుత్వం పెట్టలేదన్నారు. విద్యుత్‌ శాఖను స్కాన్‌ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలన్నారు. జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. విద్యుత్‌ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని.. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్‌ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగికి డిమోషన్‌ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారన్నారు. ఛత్తీస్‌ఘడ్‌ 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. రూ.1362 కోట్ల భారం ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై భారం పడిరదని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశిస్తామని సీఎం తెలిపారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇండియా బుల్స్‌ కంపెనీకి న్యాయం జరిగిందని… ప్రభుత్వానికి భారం పడిరదని తెలిపారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్‌ ప్రాజెక్టు పై జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ చేస్తామన్నారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలు భద్రాద్రి, యాదాద్రి పవర్‌ పాయింట్లపై అవినీతి జరిగిందని.. ఆ అవినీతిపై జ్యుడీషియల్‌ విచారణ చేస్తామన్నారు. భద్రాద్రి కాలం చెల్లిపోయిందని.. యాదాద్రి నుంచి ఒక్క మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి చెయ్య లేదన్నారు. 24 గంటల కరెంట్‌పై అఖిల పక్షంతో నిజనిర్దారణ కమిటీ వేద్దామన్నారు.. జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ చేయాలని మాజీ మంత్రి కోరిన కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ఈ అంశంపై అంతకుముందు వాడీవేడీగా చర్చ సాగింది.


తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ అక్రమాలపై వాడీవేడీ చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. దీనిపై సభలో లఘు చర్చ ప్రాంభం కాగా, మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి గత నిర్ణయాలను సమర్థించుకున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్‌ అవసరమని.. అలాంటి విద్యుత్‌ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేత పత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి, అభివృద్ధిలో విద్యుత్‌ రంగం కీలకపాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్‌ సరఫరాయే వెన్నెముకని అన్నారు. వైద్య రంగంలో అత్యవసర సేవలకైనా, రవాణా, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ఆర్థిక, నిర్వాహణ పరంగా విద్యుత్‌ రంగం పరిపుష్టిగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కోలో విద్యుత్‌ సామర్థ్యం 4,365.26 మెగావాట్లుగా ఉందిని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందు గానే.. ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పతి ప్రారంభించిన కొత్త విద్యుత్‌ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 18 వందల మెగావాట్ల విద్యుత్‌ వచ్చే విధంగా యూపీయే ప్రభుత్వం సోనియాగాంధీ నాయత్వంలో ప్రత్యేక నిబంధన చట్టంలో రూపొందించడం జరిగిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ మాత్రమేనని ఈ ప్రాజెక్టులో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఉపయోగించటం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వ్యయంలో కేవలం బొగ్గు సరఫరాకు ఏడాదికి 800 కోట్లు అదనంగా అవుతుందని, రాష్ట్ర విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు రూ. 81 వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ. 28,842 కోట్ల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సి ఉందని, రూ. 14,193 కోట్లు సాగునీటి శాఖ బకాయి ఉందన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించక పోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగదీసిందని, దీంతో రోజువారి విద్యుత్‌ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్న వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ను అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ..దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ తన స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమెట్‌ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్‌ 2 నాటికి విద్యుత్‌ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని.. ఆస్తులు పెంచామని వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్‌ దేవులాడుకురావడం.. క్యాండిల్స్‌ కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. అలా బోరుబావి దగ్గరికి పోయాక కరెంటు పోతే.. రెండు గంటలా మూడు గంటలా నాలుగు గంటలా ఎన్ని గంటలు అక్కడే ఉండాలో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. బిందెడు నీళ్లు లేకుండా ఇంటికి పోతే ఎసరు పెట్టే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్‌ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్‌ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని అన్నారు. ఇదే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్‌ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌ రెడ్డి ధీటుగా స్పందించారు.కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్‌ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్‌ కాలేదని చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలు అని అన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్‌ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయని అన్నారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలన్నారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తామా అనేది చూడాలన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను కాదని గతం గురించి మాజీమంత్రి మాట్లాడడంపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు అభ్యంతరం చెప్పారు. తరవాత ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ పేరుతో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు