Sunday, April 28, 2024

కంచెలు తెగిన వేళ…పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి

తప్పక చదవండి
  • వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు
  • ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం
  • ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు
  • మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ
  • ఆర్థిక వ్యవస్థాను గాడిలో పెడతాం
  • శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం
  • తొమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
  • అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా పాలన
  • గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడి
  • ఉభయ సభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగం

హైదరాబాద్‌ : పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగంలో దీనిని ప్రస్తావించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దివాళా తీసిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడి పెడుతూనే సంక్షేమ పథకాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అభిందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్నా. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నానని గవర్నర్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్‌ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్‌ సంస్థ కొనసాగుతుందని… పౌరసరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పని చేసాయని తెలిపారు. కార్యనిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తా మని చెప్పారు. హైదరాబాద్‌లో ఇచ్చిన యువ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించింది ప్రభుత్వం. యువతకు తాము ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామని గవర్నర్‌ అన్నారు. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అనిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్‌ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్‌ తెస్తామని హామీ ఇచ్చామని.. కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాను. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలు ప్రకటించాం. హామీలకు చట్టబద్దత కల్పించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశాం. వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తు న్నాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ఆరోగ్య భద్రత.. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచాం. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లు అమలు చేస్తాం. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేపడుతాం అని గవర్నర్‌ తెలిపారు. ఎన్నికల సందర్భంగా యువతకు మేం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతాం అని గవర్నర్‌ స్పష్టం చేశారు. ఏడాది లోపు మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమ కారులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతీ వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్‌ క్యాలెండర్‌ విషయంలో చెప్పిన మాట ప్రకారం కార్యాచరణ ఉంటుందని గవర్నర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత రావడానికి కారణమైన ఉద్యోగ నోటిఫికేషన్లు. సంక్షేమ కార్యక్రమాల్లో ఆదర్శంగా ఉంటున్నామని చెప్పుకున్న పాలకులు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేకపోయారు. అందుకే ఆ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టుగానే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు గవర్నర్‌ ప్రసంగంలో తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎక్కడ దుబారా జరిగిందో కనిపెట్టే పనిలో యంత్రాంగం ఉందని వివరించారు. ప్రజలపై భారం మోపకుండానే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తుందని భవిష్యత్‌లో ఆ మార్పు ప్రజలే గమనిస్తారని కూడా గవర్నర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు